చెరుకూరి చాముండేశ్వరి గారు ఈ కాంపిటీషన్ ప్రపంచంలో వెలసిన మరో ధృవ తార. పెళ్లి జరిగాక ఇంకేమి చేయలేమని భావించే వారందరికీ కూడా తన గెలుపు ఓ దిశ నిర్ధేశాన్ని ఇస్తుంది..
చాముండేశ్వరి గారిది విజయవాడ. భర్త తో కలిసి పెళ్లి జరిగాక పెరిసేపల్లి గ్రామానికి షిఫ్ట్ అయ్యారు. ప్రతి వ్యక్తిలోను అన్ని మంచి గుణాలు ఉండవు అన్నట్టుగానే ప్రతి ఊరిలోనూ అన్ని సౌకర్యాలు ఉండవు. పిల్లల చదువుకు సంభందించిన సౌకర్యాలు ఆ ఊరిలో లేకపోవడంతో దగ్గరిలోని గుడివాడకు చేరుకున్నారు. ఇక్కడే అసలు సమస్య ఆ సమస్య నుండి ఓ ఆలోచన ఉదయించింది.
ప్రతీ సంవత్సరం నోట్ బుక్స్ రెట్లు పెరిగిపోవడంతో ఎంతో ఇబ్బందిగా తోచేది. ఈ ఇబ్బంది తనకు మాత్రమే కాదు గుడివాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి సైతం ఉండడంతో నోట్ బుక్స్ ఎందుకు తయారు చేయకూడదు అనే ఆలోచన వచ్చేసింది. ఆలోచన రావడం కాకతాళియమే కావచ్చు కాని ఆచరణకు మాత్రం పక్కా ప్రణాళిక అవసరం ఉంటుంది.
వీటికి సంభందించిన రీసెర్చ్ తో పాటుగా, కుటుంబంతో తన ఆలోచన వివరించడం వారు కూడా అందుకు సానుకూలంగా స్పందించడంతో చకచకా పనులు మొదలయ్యాయి. ఆరు లక్షల రూపాయలకు మొదటి ఆర్థర్ రావడంతో నోట్ బుక్స్ కోసం ఎంత డిమాండ్ ఉందో మరింత నిశితంగా చాముండేశ్వరి గారికి తెలిసిపోయింది. పెట్టుబడి మరింత ఎక్కువపెట్టి ఎక్కువ స్కూల్స్ కు, కాలేజీలకు పెద్ద సంఖ్యలో తక్కువ ధరకే అందించడంతో వేగంగా పెద్ద సక్సెస్ బాటలో పయనించారు.
చాముండేశ్వరి గారు నోట్ బుక్స్ తయారీలోనే నిమగ్నమయ్యింటే తన ఎదుగుదలకు తానే సరిహద్దు నిర్మించుకునుండేవారేమో.. నోట్ బుక్స్ తర్వాత అంతటి డిమాండ్ ఉన్న మరో ఉత్పత్తి వస్తువు యునిఫామ్. సీతారామ గార్మెంట్స్ సంస్థ స్థాపించి కేవలం స్కూల్ వరకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఫ్యాక్టరీ కార్మికులకు, పోలీస్ వారికి కూడా అమ్మడం మొదలుపెట్టారు.
ఒక్క ఆలోచన ఇంత ఎదుగుదలకు కారణమయ్యింది.. ఒక్క ఆలోచన ఇంతమంది అవసరాలను తీర్చింది.. ఒక్క ఆలోచన దాదాపు 200 మందికి ఉపాధినిచ్చింది.. మన ఆలోచనలకు మామూలు శక్తి లేదు..