This Short Story Of A Guy Who Had Feelings On His Class Topper Is Relatable For Everyone

Updated on
This Short Story Of A Guy Who Had Feelings On His Class Topper Is Relatable For Everyone

ఏ కళ కి అయినా, ఏ కథకి అయినా ఒక మూలం ఒక మొదలు ఉంటుంది.., రచన కవిత్వం నా వృత్తి నా జీవితం నా కళ. నాలో ఉన్న ఈ కళ కి అప్పటివరకు ఆటలు చదువులు అమ్మానాన్న ప్రేమలు, అప్పుడప్పుడు వాళ్ళు తిట్టే తిట్లు తో ఆనందంగా నిండిపోయిన నా కథ లోని ఒక మలుపుకి ... మూలం తను..

2007 నేను అప్పుడు 8th క్లాస్.. తను మా క్లాస్ టాపర్. సహజంగా క్లాస్ టాపర్ అంటే ఉండే ఒక సెలబ్రిటీ హోదా తనకి ఉండేది. మంచి మనసు పైగా పాటలు చాలా బాగా పాడేది ఇంకేం ప్రతి వారం ఒక్క సార్ అయినా ఒక్కసారైనా తన చేత పాటలు పాడించేవాడు. అవి వింటూ.. తనంటే ఒక హీరోయిన్ మీద ఉంటె అభిమానం ఏర్పడింది. తన తో మాట్లాడదాం అని ఒక ఆత్రుత.. కానీ ఇది టీనేజ్ మనలో ఏం లేకపోయినా మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలు లేని పోనీ ఆలోచనలని పుట్టించడానికి... అదే తనతో ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా చేసింది..

అదే సమయానికి స్కూల్ మ్యాగజిన్ కి కథలు కవితలు పంపమంటూ సర్కులర్., తను ఒక కవిత రాసిందని తెలుగు మాష్టారు చదివి వినిపించారు... ఇదే తనతో మాట్లాడటానికి ఒక అవకాశం అనిపించి.. నేను కూడా కవిత రాద్దాం అని మొదలుపెట్టా .. మొదటి ప్రయత్నం అట్టర్ ఫ్లాప్. రెండో ప్రయత్నం..పర్లేదు అలా ఒక పది ఇరవై ప్రయత్నాల అనంతరం నేను తృప్తి చెందాక మా తెలుగు మాష్టారికి చూపిస్తే ఆశ్చర్యపోయారు. ఏనాడు తప్పు లేకుండా ఒక్క వాక్యం కూడా పూర్తి చేయని నేను.. ఒక కవిత రాసా అంటే.., ఆశ్చర్యపోరా మరి.. "శ్రీను గాడు కవిత రాసాడంట" అని అందరికి వినిపించారు. కొందరి నవ్వులు కొందరి మెచ్చుకోలు మధ్య మౌనంగా వింటున్న తను మాత్రమే కనిపించింది.. ఆ కళ్ళలో ఒక మెరుపు చూడటానికి ఆ రోజు నుండి ఎన్నో కవితలు రాయడం మొదలు పెట్టా.. పదాలు కోసం అమ్మ చదివే పుస్తకాలు తెలుగు పద్యాలు చదవడం మొదలు పెట్టా.. వాటితో పాటు క్లాస్ పుస్తకాలు కూడా.. ఒక కవిత కోసం ఆ కవిత విన్న తన కళ్ళలో కనిపించే ఒక మెరుపు కోసం ఎన్నో పుస్తకాలు ఎన్నో భావాలు ఎన్నో పదాలు నేర్చుకున్న వాటిని రంగరిస్తే., మొత్తానికి ఒక కవిత పుట్టింది.., ఆ కవిత విన్న తన కళ్ల లో ఒక మెరుపు నన్ను మెచ్చుకుంది.. ఆ చిత్రం ఇప్పటికి అలానే ఉండిపోయింది..మ్యాగజిన్ లో మొత్తానికి మా ఇద్దరి కవితలు పడ్డాయి. అవి అందరికి నచ్చాయి.

మా తెలుగు మాష్టారుకి ఇంకా నచ్చిందేమో.. పోటీలకు పంపేవాడు నేను ప్రైజులు తో తిరిగొచ్చేవాడ్ని. అలా 8th class వరకు పక్క క్లాస్ కూడా తెలీని నా పేరు 10th క్లాస్ కి వచ్చేసరికి అందరికి బాగా తెలిసిపోయింది.. ఇప్పటికైనా మాట్లాడాదామా.. అమ్మో వద్దు. నేను చదువుల్లో యావరేజ్ 70% వస్తే చాలు అనుకునే టైపు తనూ మొన్నో ఎగ్జాము లో 98 వచ్చాయని ఏడ్చింది. తనంటే సార్లందరికి ఒక అభిమానం గౌరవం.. మనకు తింగరోడు అని బిరుదు... ఇప్పుడిప్పుడే మంచి పేరొస్తోంది.. అది నిలబెట్టుకుని, 10th కంప్లీట్ చేసేదాం అనుకుని ఆ సంవత్సరం కూడా మౌనంగా మాట్లాడకుండా చూస్తూ ఉండేవాడిని. రోజు తనని చూడటం మనసుకు ఒక బూస్ట్ లాంటిది.. ఈ భావన బాగుంది.. కానీ దానిని ప్రేమ అని అనలేను.. ఎందుకంటే ఈ భావన మా అమ్మ నాన్న ప్రేమ కన్నా ఎక్కువైతే కాదు..

10th క్లాస్ పరీక్షలు మొత్తానికి రాసేశా .. అందరం కలిసి స్కూల్ పక్కనే ఉన్న థియేటర్ లో సినిమాకి వెళదామని మా టీచర్ ఒకరిని అడిగి మొత్తం 10th క్లాస్ అంతా.., ఆయన్ని తోడు తీస్కుని వెళ్లాం. నా ముందు రో లో తను. ఇప్పటికైనా తనతో మాట్లాడదామనుకున్న.., సరే ఏం మాట్లాడాలి?... నా మతి అడిగిన ఈ ప్రశ్నకు నా మది సమాధానం చెప్పలేకేపోయింది .. మాటలు మౌనంగా లోపల ఉంటెనే ఎన్నో భావాలు వస్తున్నప్పుడు ఇంకా ఆ మాటలని బయటపెట్టకూడదనుకున్నాను ఈ పరిచయాన్ని ఇలానే ఉంచేద్దాం అనుకున్నాను. మౌనంగానే తనని చూస్తుండిపోయాను, సినిమా అయ్యాకా అందరు వాళ్ళ బస్సులు ఎక్కుతున్నారు, నేను ఎక్కి ఆ బస్ తనని నా కంటి నుండి మాయం చేసేంత వరుకు తనని నా జ్ఞాపకాలలో దాచుకున్న...

తనతో ఒక్క మాట మాట్లాడకపోవచ్చు కానీ తన వల్ల నాలో పుట్టిన ఒక రచయిత ఇప్పటికి ఎప్పటికి నాతో ఉంటాడు. తన వల్ల ఒక లక్ష్యం ఏర్పడింది, బహుశ ఆ లక్ష్యం నాలో కలిగించడానికి తను పరిచయం అయిందేమో, అలా ఎప్పటికి మొదటి క్రష్ గా నా ప్రయాణం లో ఒక అద్భుతమైన మజిలీ గా తను ఉంటుంది..

10th క్లాస్ అయ్యాక అందరం తరువాత ఎలా కలుస్తాం అనుకున్నాం కానీ 3 ఏళ్ళ కే facebook లో అందరు మళ్ళి కలిసాం. తను తప్ప., తనని చూసి ఇవాళటికీ సరిగ్గా పది సంవత్సరాలు.. ఒక్క సారి గా పదేళ్ల వెనక్కి ప్రయాణం చేసి ఆ అనుభూతులు అన్ని ఇలా రాసాను.,

ఇది పోస్ట్ చేసిన కాసేపటికి నా facebook అకౌంట్ కి ఒక రిక్వెస్ట్ వచ్చింది.