Contributed By PR
రవీంద్ర(24) కోటి బస్ స్టాప్ మలుపు దగ్గర ఫుట్ పాత్ మీద చెప్పులు కుడుతూ ఉంటాడు. సుమారు రెండు ఏళ్ల నుంచి అక్కడే పని చేస్తున్నాడు. పొద్దున్నే 7.30 కి వస్తాడు. రాత్రి 8.30 కి ఇంటికి వెళ్తాడు. షూ, చెప్పులు, బెల్టులు, బ్యాగ్లు అన్ని రిపేర్ చేస్తాడు.
రోజులానే తన పనిలో తాను బిజీగా ఉన్నాడు. ఇంతలో ఓ పోలీసు ఒకడు వచ్చి షూ పాలీష్ చేయమన్నాడు. రవి చేశాడు. పోలీసు పని అయ్యాక వెళ్ళిపోతుంటే, రవి, “సార్! డబ్బులు!” అని అడిగాడు. ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి, “ఏరా ఫ్లాట్ ఫామ్ నా కొడకా.. సార్ నే డబ్బులు అడుగుతావా!” అని తిట్టాడు. రవి ఏమి మాట్లాడలేదు. ఆ పోలీసు రవి వంక ఓ చూపు చూసి, దగ్గరికి వచ్చి నవ్వి, “సారి! ఇదిగో అని ఓ పది నోటు ఇచ్చాడు!” కానిస్టేబుల్, “వాడికెందుకు సార్ డబ్బులు!” అని నచ్చచెప్పబోయాడు. పోలీసు నవ్వి, “సర్లే! కష్టపడే కుర్రాడు!“ అని చెప్పి వెళ్ళిపోయాడు. రవీంద్ర ఆ పది తన డబ్బుల పెట్టె లో వేసుకున్నాడు.
మరుసటి రోజు పొద్దున్నే వచ్చే సరికి, రవీంద్ర కొట్టు పెట్టుకునే ఫుట్ పాత్ మూల లో, ఓ టీ కొట్టు కొత్తగా పెట్టి ఉంది. రవికి ఏమి అర్ధం కాలేదు. కొంచెం సేపు ఆలోచించి.. ఆ కొట్టు అతనితో, “సార్ ఇది నా చోటు! సుమారు రెండు ఏళ్ల నుంచి ఇక్కడే చేస్తున్నా! ఇంతకు ముందు, సావిత్రి మామ్మ ఇక్కడ పూలు అమ్మేది! కావాలంటే ఆవిడని తీసుకొస్తా!” అని చెప్పాడు. అప్పటికే టీ కొట్టు దగ్గర ఉన్న ఓ పెద్ద అతను, “లంజాకొడక లెక్కలు మాట్లాడుతున్నావ్? నీ బాబు దారా ఈ ఫుట్ పాత్?” అని కొట్టాడు. రవీంద్రకు కోపం వచ్చింది, కాని కళ్ళలో నీళ్ళు రాలేదు. ఇంతలో నిన్నటి పోలీసోడు వచ్చి, నవ్వుతూ టీ కొట్టు దగ్గర కూర్చున్నాడు. అప్పుడు అర్ధమయ్యింది రవికి ఇదంతా నిన్నటి పది రూపాయల లెక్క అని. అక్కడ తన సామాను లేదు. అడిగితే మళ్ళీ కొడతారు. ఏమి చెయ్యాలో తెలియక, పక్కన ఉన్న మసీదు సందు లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. సందు చివరికి వెళ్ళాక ఎందుకో ఏడుపు ఆపుకోలేక ఏడ్చేశాడు.
ఆ రోజు మధ్యాహ్నమే ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. పోయిన సామాను విలువ సుమారు 1000 రూపాయలు ఉంటుంది అనుకున్నాడు. మళ్ళీ రోడ్ ఎక్కాడు. నడుచుకుంటూ అన్ని చౌరస్తాలు తిరిగాడు. ప్రతి మూల ఎవడో ఒకడున్నాడు. పూలు, పళ్ళు, కొబ్బరి బోండాలు, పిన్నీసులు, కర్చీఫ్ లు, పోస్టర్ లు, పాత పుస్తకాలు, బట్టలు, చెప్పులు కుట్టే వాళ్ళు. సాయంత్రానికి హిమాయత్ నగర్ బ్రిడ్జ్ కింద ఓ చోటు కనిపించింది. చోటు బాగుంది. కాని “బేరాలు ఉంటాయా?” అన్న భయం. ఏమో రేపు వచ్చి చూద్దాం అనుకుని ఆ చోటు ఫిక్స్ ఐన క్షణంలో, ఓ పిచ్చి ముసలోడు వచ్చి, చిన్న పిల్లాడిలా భయపడుతూ, కిందకి చూసుకుంటూ, “ఇది నా చోటు!” అన్నాడు. ఆ మాటకి, పొద్దున తను, “ఇది నా చోటు!” అని టీ కొట్టు వాడితో అన్న మాటలు ప్రతిధ్యనించాయి. ఆ క్షణం తెలియని ఉద్వేగంలో కళ్ళ వెంట కన్నీళ్లు వచ్చేశాయి. ఆ పిచ్చి ముసలోడు జాలిగా, “నువ్వు ఏడవకు!” అన్నాడు. రవి నవ్వి, కళ్ళు తుడుచుకున్నాడు. పక్కనే రోడ్ అవతల ఉన్న ఫుడ్ సెంటర్ లో, ఓ వెజిటబుల్ బిరియాని పార్శిల్ కట్టించుకున్నాడు. ఓ వాటర్ బాటిల్ కొన్నాడు. పక్క బండి దగ్గర నాలుగు అరటిపళ్ళు కొన్నాడు. మొత్తం మూడు ఆ పిచ్చి ముసలాయనికి ఇచ్చి వచ్చాడు. ఆ ముసలాయనికి ఆకలి గా ఉంది అనుకుంటా, వెంటనే పొట్లం విప్పబోతే, రవి చేతులు కడిగించి, అప్పుడు తినమన్నాడు. ముసలాయన తింటుంటే, రవి నవ్వి ఇంటికి బయలు దేరాడు.
రాత్రి ఇంటికి వచ్చాక, జరిగింది అమ్మకి చెప్పలేదు. ఆవిడ కంగారూ మనిషి. ఊరికే బాధపడుతుంది. అన్నం తిని కల్పన ఇంటికి వెళ్ళాడు.
కల్పన(21) రవి ప్రియురాలు. తను టైలరింగ్ నేర్చుకుంటుంది. రవినే, ఎన్నాళ్లు బట్టల కొట్టులో నిల్చుంటావు? టైలరింగ్ నేర్చుకో నేను కొట్టు పెట్టిస్తా!” అని భరోసా ఇచ్చాడు. కల్పన ఇంట్లో కూడా రవి అంటే ఇష్టం. కల్పన, తను చర్చ్ గ్రౌండ్ కి వచ్చారు, వాళ్ళకి ఏకాంతం దొరికేది అక్కడే. జరిగిన సంగతి చెప్పాడు. కల్పన అంతా విని, “ఆ ఎదవల జోలికి పోమాక!” అంది. “ఈ చోటు కాకపోతే ఇంకో చోటు! మంచి పనోడు ఎక్కడైనా బతకొచ్చు!” అంది మళ్ళీ తనే భరోసాగా. “ఈ సమాజం లో అందరూ దొంగలంజాకొడుకులే! కష్టపడే వాడి కడుపులోనే తంతారు! వాడు తన్నినా ఊరుకోవాలి!” అని కోపం గా ఆవేశం వెళ్లగక్కాడు. దానికి కల్పన, “ఊరుకోక, నువ్వు పెద్ద హీరో, ఇట్టా కొట్టగానే అట్టా పడిపోతారు! గొడవలు పడకుండా గమ్మునుండు! అసలే పేదోల్లమ్! మనకెందుకు కోపాలు!” అంది.
రవికి కల్పన తన బట్టలు కొట్టు ఓనర్ తో మాట్లాడి పని ఇప్పించింది. నిన్నటి దాకా చెప్పులు, ఇప్పుడు బట్టలు అనుకుని పనిలో చేరాడు. కాని చెప్పులు ఎందుకో తనకి ఇష్టం. బట్టల కొట్టులో కూడా కస్టమర్ చెప్పులే మొదట నోటిస్ చేసేవాడు. ఓనర్ రెండు, మూడు సార్లు తిట్టాడు.. “ఎప్పుడూ కిందకి చూస్తావేందుకు ?” అని.
ఓ రోజు సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వస్తున్న టైమ్ లో కల్పన, “నువ్వు గిరికి, నువ్వు చెప్పులుకుట్టే వాడిని అని చెప్పావా?” అని రవిని అడిగింది. రవి దానికి, “అవునని చెప్పాడు. అందులో తప్పేముంది?” కల్పన, “నీకు కొట్టులో వాళ్ళ గురుంచి తెలీదు! వాళ్ళు రేపటి నుంచి నిన్ను చులకన గానే చూస్తారు!” అంది. రవి చెప్పేది వినిపించుకోకుండా చికాకు పడి వెళ్ళిపోయింది. కల్పన చెప్పినట్టు గానే కొట్టులో అందరూ చులకనగా చూడటం మొదలుపెట్టారు. “పారాహుషార్!” అంటూ స్వయంకృషిలో పాట పాడేవాళ్లు. నవ్వేవాళ్లు. కల్పన పని మానేసింది. రవితో మాట్లాడటం మానేసింది.
రవిలో సమాజం మీద, మనుషుల మీద ఓ తెలియని కోపం మొదలయ్యింది. దేవుడు మీద నమ్మకం పోయింది. “ఉగ్రవాదులు, నక్సలైట్లు, దొంగలు.. అందరూ చేసేది కరెక్ట్ ఏ.. ఏమో ఎవడి ఆవేశం వెనక ఏ కారణం ఉందో!” అనుకునే వాడు.
ఓ మూడు వారాల తరువాత, రవి ఓ రోజు రాత్రి ఇంటికి వచ్చే సరికి, ఓ పెద్దాయన ఇంటి బయట కూర్చుని ఉన్నాడు. ఆయన బ్యాంక్ మేనేజర్ మూర్తి గారు. ఆయన రోజు రవి దగ్గరే షూ పాలిష్ చేయించుకునేవాడు. ఇంట్లో అందరి చెప్పులు, బ్యాగ్లు రవినే కుట్టేవాడు. “రవి నీ సంగతి తెలిసింది. మొదట ఊరు వెళ్ళావేమో అనుకున్నా, కాని తరువాత ఆ పుస్తకాల కొట్టు అతను చెప్పాడు. ఏం కంగారూ పడకు! రేపు ఓ సారి బ్యాంకు కు రా! వచ్చేప్పుడు నీ ఆధార్ కార్డు తెచ్చుకో!” అని చెప్పి, భుజం తట్టి వెళ్ళిపోయాడు.
రెండు వారాల తరువాత, అబిడ్స్ రోడ్లో, కొత్తగా కట్టిన షాపింగ్ మాల్ లో ఓ పారగాన్ చెప్పుల షోరూమ్ తెరుచుకుంది. మూర్తి గారి భాగస్వామ్యంలో రవి పెట్టిన షాప్ అది. పెద్ద షోరూమ్. బ్యాంక్ లోను, వగైరా అన్ని మూర్తి గారు చూసుకునేవాడు. రవి బిజినెస్ చూసుకునేవాడు. షాప్ తెరిచిన మూడో నెల, ఓ చిన్న పాపకి చెప్పులు సెలెక్ట్ చేస్తున్నారు. పాప వల్ల అమ్మ కూడా ఉంది. పని అమ్మాయి సహనం కోల్పోయినా రవి దగ్గరుండి, చిన్న పాపకి నచ్చే వరకు చూపించాడు. ఆ పాపకు నచ్చే చెప్పులు సెట్ అయ్యాక, బిల్ ఇచ్చే టైమ్ లో ఆ పాప నాన్న వచ్చాడు. రవి అతన్ని వెంటనే గుర్తు పట్టాడు. అది ఆ పోలీసోడు. రవిని షాప్ లో చూసి వాడు కొద్దిగా షాక్ అయ్యాడు. భార్య రవి గురించి, “ఈ కొట్టు లో పని వాళ్ళ కన్నా ఓనర్ యే బాగున్నాడు! కుర్రాడికి ఓర్పు ఎక్కువ!” అని చెప్పి నవ్వింది. ఆ పోలీసోడు ఇంకా ట్రాన్స్ లో ఉన్నాడు. పెళ్ళాం, కూతురితో బండి ఎక్కి వెళ్ళాడు కాని, ఆ ట్రాన్స్ ఇంకా పోలేదు. చెప్పాలంటే, “వాడి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది!”
కొట్టు లో పని చేసే లేడి వర్కర్, రవి తో, “ఆయన ఎందుకో మిమ్మల్ని అలానే చూస్తూ ఉన్నాడు?” అంది. రవి దానికి నవ్వి, “ఎవరో నాలాంటి ఒకడు గుర్తొచ్చి ఉంటాడు!” అని నవ్వి మళ్ళీ పనిలో పడ్డాడు. “ఆ పోలీసోడు ఆ రోజు అలా చేసి ఉండకపోతే ఇప్పటికీ నేను కోటి బస్ స్టాప్ మలుపు దగ్గర ఫుట్ పాత్ మీద చెప్పులు కుడుతూ ఉండేవాడిని.” అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు. ఇంతలో కల్పన వచ్చింది. షాప్ లో పనిచేసే లేడి వర్కర్ నవ్వినా కల్పన నవ్వలేదు. ఎంతైనా ఓనర్ కి కాబోయే పెళ్ళాం కదా, లెవెల్ పోయింది. కల్పన ఇప్పుడు ఓన్ టైలరింగ్ షాప్ పెట్టింది. రవికి, కల్పనాకి, వచ్చే నెల లో పెళ్లి అనుకున్నారు ఇంట్లోవాళ్లు.
రవికి ఇప్పుడు సమాజం మీద, మనుషుల మీద, దేవుడు మీద మళ్ళీ నమ్మకం వచ్చింది. ఇది ఓ మూర్తి గారు ఇచ్చిన నమ్మకం. ఇది తనలో నుంచి వచ్చిన నమ్మకం. ఎంతటి అగాధం అయినా దాటగలను అనే నమ్మకం. ఇది చచ్చే దాకా పోని నమ్మకం. జీవితం చాలా వింతగా ఉంటుంది. ఈ సమాజం ఇంకా వింతగా ఉంటుంది. ఆ పోలీసోడు ఉన్న సమాజం లోనే, ఓ మూర్తి గారూ ఉన్నారు. పడగొట్టే వాడు ఉన్నచోటే, పైకి లేపే వాడు ఉంటాడు. పడాలి, లేవాలి. పడిన ప్రతిసారి లేవాలి. బతుకు ఓ కెరటం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.