చిత్రకొండ గంగాధర్ గారు కొంతమందికి కవి, కొంతమందికి సెంట్రింగ్ పనిచేసేవాడు, మరికొంతమందికి మనిషి.

Updated on
చిత్రకొండ గంగాధర్ గారు కొంతమందికి కవి, కొంతమందికి సెంట్రింగ్ పనిచేసేవాడు, మరికొంతమందికి మనిషి.

2011 సెప్టెంబర్ 25, పలాస మండలం బొడ్డపాడు గ్రామం. ఉంటే ఉంటాను పోతే పోతాను, ఉంటే ఉంటాను పోతే పోతాను, ఉం...టే ఉం...టాను పో...తే.... పోతాను..!! 37 ఏళ్లపాటు తనని మోస్తున్న భూమిపై చివరి అడుగులు వేస్తున్నారు.. చెరువు గట్టున చెప్పులు విప్పి, పుట్టిన ఊరి లోనే చనిపోవాలని ఉందని ఉత్తరం విడిచి, ఆఖరి సారి శ్వాస తీసుకుంటూ చెరువులోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు. అతని శరీరంలోని శ్వాస గాలిలో కలిసిపోయింది, రక్తం నీటిలో కలిసిపోయింది, శరీరం భూమిలో కలిసిపోయింది, ఆత్మ మాత్రం అతనిని అమితంగా ప్రేమించే స్నేహితులలో కలిసిపోయింది. అయితే 2011లో ఆయన చనిపోతే 2017 వరకూ ఈ విషయం తెలియరాలేదు. చిత్రకొండ గంగాధర్ గారి గురించి కాస్త తెలుసుకున్నా అతడిని జీవితాంతం మర్చిపోవడానికి కుదరదు.

చిత్రకొండ గంగాధర్ గారు కొంతమందికి కవి, కొంతమందికి సెంట్రింగ్ పనిచేసేవాడు, మరికొంతమందికి మనిషి. నాన్న సింహాచలం గారు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తుంటారు. ఆర్ధికంగా ఇబ్బందులు లేవు. బాల్యం 'చిత్రకొండ'లో(సీలేరు సమీప గ్రామం) మధురంగా గడవడం మూలంగా పేరుకు ముందు చిత్రకొండను జతచేర్చారు. పుస్తకాలంటే ఇష్టం ఎక్కువ. ఎక్కువ సమయం వాటితోనే గడిపేవారు. అతనిది ప్రాణమున్న స్పందించే గుండె. ఒకానొక దశలో ఎక్కడ ఎన్ కౌంటర్ జరిగినా అక్కడికి వెళ్లిపోయేవారు.. జీవితాంతం పెళ్లి చేసుకొనని ఒట్టు పెట్టుకున్నారు అలాగే ఉన్నారు కూడా..

గంగాధర్ గారు తనకెంతో ఇష్టమైన సెంట్రింగ్ పని చేసేవారు. బయటి ప్రపంచం వారు చదువురాని వారు చేసే కూలి పనిగా దీనిని భావించేవారు. నిజానికి ఆయన అనుకుంటే ఈ పని చెయ్యాల్సిన పరిస్థితే ఉండేది కాదు. నాన్న గారిది గవర్నమెంట్ ఉద్యోగి, అలాగే కొబ్బరితోట, జీడీ మామిడి తోట, సొంత ఇల్లు, తన కోసం ఎదురుచూసే ఒక ముసలి తల్లి కూడా ఉంది. సెంట్రింగ్ పని కాస్త శ్రమతో కూడుకున్నది, సాయంత్రానికి అరచేతులు కాయలు కాసిన, వొళ్ళు నొప్పులు పెట్టినా అంతగా స్పందించరు, కానీ పనిలో కాలు జారి ఇనుప సీకుల మీద వేలాడిన పిల్లవాడి గురించో, పోలీసుల ఎన్ కౌంటర్లో మరణించిన ఒక మంచి మనిషి గురించో బాధపడేవారు. గంగాధర్ గారు తన కవిత్వాన్ని కాగితాలపై రాసుకునేవారు, వీటన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా తీసుకురావాలని మిత్రులతో చెప్పేవారు కూడా..

నిజానికి ఆయన చావు నెమ్మదిగా ప్రారంభమయ్యింది. ముఖ్యమైన కారణం ఇక్కడ అప్రస్తుతం. యువకుడిగా బలంగా ఉండాల్సిన వయసులోనే రోజుల తరబడి ఏమి తినక మానసికంగా శారీరకంగా కృంగి పోయారు.. మనుషులున్నా, స్నేహితులన్నా ప్రాణమిచ్చే తను చివరికి వారెవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లిపోయారు..

చిత్రకొండ గంగాధర్ గారి కవిత్వం 1. నీడల నగరం ఆకలి, దప్పికతో తిరుగుతున్నాను నీడ లేదు పచ్చిక లేదు నీళ్ళ కులాయికి కాలం అయిపోయింది ఈ గోడలు కూలిపోవు మనుషులే కూలి పోతారు.

2. గ్రీష్మం నా ఏకైక లక్షణం సగం హృదయం రెక్క విరిగిపోయింది కుంటు కుంటూ దుఃఖిత మజిలీల మధ్య దహనం కట్టెనై నేనెప్పటికీ ఒంటరివాన్నే మిత్రమా ఈ ఎడారిని కొనసాగమంటాను మరికొంత కాలం.

3. ఎందుకున్నారో వందేళ్ల క్రితం నేనిక్కడలేను నా నాన్న కూడా కానీ నా నాన్నకు నాన్న యిక్కడే, యిదే చలికాలపు రాత్రిలో మద్యంతో మాంసంతో కూర్చుని ఉన్నాడు నాలాగే తన ఇరవయ్యేళ్ళ యవ్వనంలో

4. చలికాలపు రాత్రి: పది గంటలు ఎక్కడో ఒక చోట ఈ విశ్వంలో తొలివర్షం కురుస్తూ ఉంటుంది వెల్తుర్లో చీకట్లో ఎక్కడో ఒకచోట నగరం మధ్య, ఈ రాత్రిలో సారాయి దుకాణం తెరిచే ఉంటుంది వచ్చిపోయే వాళ్ళ రద్దీ పసుపు మసక వెల్తుర్లో పడిపోతూ లేస్తూ.. ఎక్కడో ఒకచోట దొంగతనం విఫలమై ఎవరో ఒకడు తిరిగొస్తూ ఉంటాడు వేశ్యల ఆశ్రమంలో ఎవరో ఒకామె నిద్రపోవడానికి మంచం దగ్గరికి వెళ్తూ ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఈ విశ్వంలో ఆకలి దేహమొకటి పెనుగులాడుతూ ఉంటుంది.

5. నా నాయనే కొంతమంది ముసలి స్త్రీలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు పూపొదల నీడలో కొందరు పొగాకు నములుతున్నారు వారి మమకారపు ఆవరణ ముందుకు వెళ్లి చెప్పుకుంటాను నా గురించి "కొన్ని రోజులైంది అన్నం తిని"

6. ఒక చలికాలపు సాయంకాలం స్నేహితులు వీడ్కోలు తీసుకుని విడిపోయారు. కానీ వారి కరచాలనపు బలిష్టమైన ఎముకలు ఇంకా విడిపోలేదు వాటికింకా జీవించాలనే ఉంది వాళ్ళ మరణం తర్వాతా.. ఆత్మలు చిరిగిన మనుషులు తమ మృతదేహాల్ని అందమైన శ్మశాన భూమిలో ఖననం చేస్తారని ఊహిస్తారు తమ వెనకాల దీర్ఘ శవయాత్రనీ వాళ్ళు కలగంటారు. కానీ వారి గుండెలోనే వారి స్మశానం విస్తరించి ఉంది నిరుత్సాహంగా ఒంటరిగా..

7. ప్రసవం చనిపోయిన పాముకి ఋణపడి ఉన్నాను నా సాయంకాలానికి తలుపులు మూయనందుకు. 8. బొమ్మా నువ్వేం చూస్తున్నావో నేనెప్పటికీ చూడలేను దేనికీ చెందని మనస్సుతో వెలుతురులో తమ లోకంలో ఉన్న కుర్చీలు కుర్చీలో చతికిలబడ్డ మనుషులూ మెల్లగా కదులుతూ చీకట్లో నిల్చున్న చెట్లూ ఋతువుల సంవత్సరాల ఈ కాగితం చిరిగి ఎగిరిపోతుంది నువ్వు చూసే దాన్ని నేనెప్పటికీ తెలుసుకోలేను నువ్వు చూస్తున్న దిక్కులో ఎవరూ కనిపించరు అయినా నువ్వు ఎవరినో చూస్తున్నావు ఎవరో ఒకరు ఏదో ఒకటి నీలో నిర్మల శాంతిని నింపుతున్నారు.

9. నీరేరా ఇంకా కొన్ని గ్లాసుల నీళ్లు తాగుతాను చల్లగా తగులుతుంది పల్చగా లోలోపలికి దిగినా నిజానికి చాలా చిక్కన ఈ విశ్వంలో ఇంకెక్కడా దొరకదు ఈ భూమి మీద తప్ప ఇంకా కొన్ని గ్లాసులు..