This Short Story About The Dreams Of A Little Child Will Warm Your Heart Instantly

Updated on
This Short Story About The Dreams Of A Little Child Will Warm Your Heart Instantly

(Story By PR)

అక్టోబర్ 2, 2016. పొద్దున్నే 8.30 అవుతుంది. అది లామకాన్ అనే ఓ కల్చరల్ సొసైటికి ఎదురుగా ఉన్న చిన్న టీ కొట్టు. లామకాన్ కి వచ్చే వాళ్ళు చాలా మంది రిచ్ & హై సొసైటి యూత్. ఆ రోజు ఓ థియేటర్ గ్రూప్ గాంధీ మీద ఓ మ్యూజికల్ చెయ్యాలి అని ప్లాన్ చేసింది. అంతా బాగానే ఉంది కాని పాపం వాళ్ళ నాటకంలో గాంధీగా చెయ్యాల్సినతని కాలు బెనికి ఇంట్లో ఉండిపోయాడు. మ్యూజికల్ స్కిట్ కి ఇంకా 15 నిమిషాలే ఉంది. గెస్ట్స్ అందరూ వచ్చేశారు. “ఇప్పుడు ఎలా?” అని ఆ అమ్మాయిలు, అబ్బాయిలు తల పట్టుకునే టైమ్ లో వాళ్ళకి చింటూ(8) కనిపించాడు. చింటూ టీ కొట్టు కుర్రాడు. ఓనర్ కి 500 ఇచ్చి ఒప్పించారు. చింటూ చెయ్యల్సింది సిల్వర్ రంగు మేకప్ వేసుకుని స్టేజ్ మీద కదలకుండా ఓ 40 నిమిషాలు నించోవడమే. అంతా ఓకే కానీ, చింటూకి, హరిక కి సరిపడే హెడ్ మాస్క్ లేదు, హెడ్ బాల్డ్ లుక్ కోసం షేవ్ చెయ్యాలి అంది. అంటే చింటూకి గుండు చెయ్యాలి. “నాది బన్నీ హెయిర్ స్టైల్! నేను చేసుకోను!” అని చింటూ మొండి పట్టు పట్టాడు. Actualగా చింటూ కి ఓ చాకొలేట్ కేక్ ఇప్పిస్తాం అని చెప్పి ఒప్పించారు. అందులో హరిక “సరే, చాకొలేట్ కేక్ తో పాటు రెండు క్యాడ్బరి చాకొలేట్లు!” అని బేరం పెట్టింది. చింటూ, “నాకు కేక్ & చాకొలేట్లు వద్దు. 1000 రుపీస్ కావాలి! అది ఇప్పుడే, స్కిట్ కి ముందే ఇవ్వాలి!” అని సాలిడ్ గా కండిషన్ పెట్టాడు. “వీడు చాలా ముదురు!” అన్నాడు ఓ కుర్రాడు. రాఘవ్(23) ఓ కొత్త 1000 నోటు చింటూకి ఇచ్చాడు. చింటూకి 5 మినిట్స్ లో గుండు గీసి రెడి చేసేశారు. గంట తరువాత స్కిట్ సూపర్ సక్సెస్ గా పూర్తి అయ్యింది. చింటూకి చాకొలేట్ కేక్ & క్యాడ్బరి బోనస్ గా వచ్చాయి.

చింటూ ఇంటికి వెళ్ళి చెల్లికి క్యాడ్బరి చాకొలేట్ ఇచ్చాడు. నానమ్మకి 1000 నోటు ఇచ్చాడు. ఆవిడ కంగారూ పడి, “ఏరా నీ జీతం 500 యే గా అంది! ఐనా ఆ గుండు ఏంటి? ఏమయ్యింది?” అంటూ ప్రశ్న వెనక ప్రశ్న వేసింది. చింటూ, “నానమ్మ.. ఇది సేటు లెక్క కాదు. నాటకంలో వేషం వేసినందుకు ఇచ్చారు. గాంధీ వేషం! అందుకే గుండు!” అన్నాడు. నానమ్మ నవ్వుకుంటూ. “బాగా చేశావా?” అని అడిగింది. చింటూ కొంచెం నిరాశగా,” డైలాగ్ ఇవ్వలేదు. ఊరికె మద్యలో నిల్చో పెట్టారు!”అని వెంటనే, “ఈసారి నుంచి మంచి డైలాగ్ ఉన్న యాక్షన్ ఐతేనే చేస్తా అని చెప్పేశాను!” అన్నాడు. నానమ్మ 1000 నోటు చూసి, “ఏరా గాంధీ వేషం వేసి డబ్బులు తీసుకోవచ్చా? తప్పు కదూ!” అంది. చింటూ దానికి, “ఆ విషయం నోట్ మీద ఉన్న ఆయన్నే అడుగు!”అని కౌంటర్ ఇచ్చాడు. నోట్ మీద గాంధీ నవ్వుతున్నాడు. ముసలావిడ నవ్వుకుంది, మనవడి బతకనేర్చిన తెలివికి. చింటూ అద్దంలో గుండు చూసుకుంటూ Expression చెక్ చేసుకుంటున్నాడు. అద్దం పక్కన ఉన్న సరైనోడు పోస్టర్ చూస్తూ చింటూ ఆరోగంట్ గా, స్టైల్ గా, “ఒరేయ్ బన్నిగా నేను యాక్టర్ నే ఇప్పుడు! వస్తున్న.. వచ్చేస్తున్నా!” అన్నాడు. బన్ని కూడా ఆ మూమెంట్ చూసి ఉంటే నవ్వుకునే వాడు. ఏమో ఈ టీ కొట్టు కుర్రాడు సినిమా హీరో అవుతాడెమో ఎవరికి తెలుసు? ఓ టీ కొట్టు కుర్రాడు ప్రధాన మంత్రి అయిన దేశంలో ఓ కుర్రాడు హీరో అవ్వటం ఓ లెక్కా! Nothing is impossible.