తెలుగు భాష కి సినీ కవి చంద్రబోస్ ఇచ్చిన అక్షర నివాళి!

Updated on
తెలుగు భాష కి  సినీ కవి చంద్రబోస్ ఇచ్చిన అక్షర నివాళి!
(Article by Satya Prasad) "తెలుగు భాష తీయదనం... తెలుగు జాతి గొప్పతనం... తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం" అని కలమెత్తి చాటిన ఆ తల్లి ముద్దుబిడ్డ చంద్రబోస్ గారు నవంబర్ 15 2015 స్వరాభిషేకం కార్యక్రమంలో తెలుగు వెలుగును మరోసారి ప్రస్తావిస్తూ... "భాషంటే మన గతపు గుండె ఘోష భాషంటే మన వర్తమాన శ్వాస భాషంటే మన భావితపైన ఆశ ఆదికవి నన్నయ్య అక్షరార్చన తెలుగు తిక్కన్న చక్కంగ చెక్కింది మన తెలుగు అన్నమయ్య పున్నమై వెలిగింది తెలుగు త్యాగయ్య తీగలై సాగింది తెలుగు పోతన్న పెద్దన్న ఎర్రన్న కేతన్న వికటాట్టహాసాల శ్రీరామక్రిష్ణన్న విశ్వనాధుడు నిలిచే తెలుగు శిఖరాగ్రాన విశ్వ సత్యాలెన్నో వివరించే వేమన్న అవనిపై అభిమానమతని అడుగుల జాడ నడిచాడు అందరినీ నడిపాడు గురజాడ అంగనల స్వేచ్చకై అచంచలము అంగలేసిన కలం పేరు చలము కవితయను కన్యకి పోరాట పురుషుడికి పెండ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ పంట చేలల్లో పద సంచారి నండూరి సుజ్ఞాన పీఠికలు సినారె, రావూరి భావకవితల మేస్త్రి మన కృష్ణశాస్త్రి జాన తెలుగు బోదిమాను మల్లాది తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బుడుగు గ్రామీణ యాసలకు గొడుగు పట్టెను గిడుగు అంత్య ప్రాసల ముద్ర కాదే ఆరుద్ర తెలుగు తలపై క్రౌను చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కాలమను కడుపులో కాలితే కాళోజీ గాయాల గుండెపై చద్దరే గద్దరు పింగళి జాషువా మధురాంతకం ఆత్రేయ వేటూరి సిరివెన్నెల అభివందనం కవులకభివందనం వారి అభ్యుదయ భావాలకభివందనం నా తాత నా అయ్యా కారు పండితులు నా బంధుమిత్రులు కారెవరు కవులు నా కయిత నా పాట స్వయం సంపాద్యం అంతా అనుశ్రితం.. కొంత అనుశీలనం గోరంత దొరికింది వాణీ (సరస్వతి) అనుగ్రహం" ___________________________________________________ ఇప్పుడు చెప్పండి, జన్మనిచ్చిన అమ్మకి బిడ్డ అవసరాలు తెలియనివా..? మరెందుకు ఆ మాతృమూర్తి మాధుర్యాన్ని అనుభవించకలేకపోతున్నారు...? ఈ అనితర సంపదతో, అమూల్యమైన సంస్కారంతో బంధాన్ని తెంచుకుంటున్న వారికి చివరి మాట.. శ్రీ కాళోజీ వారి తూటా.. "అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంటూ సకలించు ఆంధ్రుడా సావవెందుకురా...?"