చెల్లెలి కాపురం అనే పేరు చూడగానే, చెల్లి కాపురం కోసం అన్న ఏం చేసాడనేదే ఉంటుంది అనేది అందరికి తట్టే మొట్టమొదటి ఆలోచన. నిజానికి ఈ కథని, కథనాన్ని, కథానాయకుడి పాత్రని నడిపించేది చెల్లెలి పాత్రే అయినా కూడా, దాన్నిమించిన చాలా భావోద్వేగాలు ఉంటాయి ఈ సినిమాలో. ముఖ్యంగా సినిమాలో వచ్చే చిన్న కవితలు ముచ్చటగా అనిపిస్తాయి.
క్లుప్తంగా కథ:
పల్లెటూరిలో ఉండే ఓ రచయిత, చెల్లెలి కోసం పట్నం వచ్చి ఏం చేసాడు, ఎటువంటి పరిస్తితులు ఎదురుకున్నాడు అనేది కథ.
ఈ కదిలే బొమ్మల కూర్పు గురించి కొన్ని విశేషాలు:
1. మన సంస్కృతిని, తెలుగు వారి సంస్కారాన్ని సినిమాల ద్వారా తెలియచెప్పిన అతి తక్కువ మంది దర్శకుల్లో మొదటివారైన కాశీనాధుని విశ్వనాధ్ గారే ఈ సినిమా దర్శకులు. సినిమా మొదలవ్వడమే "పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి..." అనే పాట రావడంతోనే అర్ధమైపోతుంది దీని దర్శకుడు ఎవరనేది.
2. మన్నవ బాలయ్య గారు స్వహస్తాలతో రాసిన కథని, స్వీయ నిర్మాణంలో అమృత ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ద్వారా వచ్చిన మొదటి సినిమా.
3. కవులు అనగానే ఇప్పుడు మనకు గుర్తువచ్చే సినారే, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరధి గారు సాహిత్యాన్ని అందిచిన సినిమా.
4. K.V మహదేవన్ గారు అందించిన కనుల ముందు నీవుంటే, నీలా కృష్ణ, ఆడవే మయూరి, పిల్లగాలి, భలే అన్నయ్య పాటలు గుర్తుండిపోతాయి.
5. గొల్లపూడి మారుతీరావు గారి సంభాషణల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క మాట ఎక్కువా, తక్కువ కాకుండా కళ్ళ ముందు జరుగుతన్న వాటిలా పక్కాగా కుదిరిపోయాయి.
6. పేర్లు పడేప్పుడు ముందు కథానాయిక పేరు రావడం కొత్తగా అనిపిస్తుంది.
7. సినిమాలో బాగా ముచ్చటైన కవితలు బోలెడు ఉన్నాయ్. మాటలు గొల్లపూడి మారుతీరావు గారు రాసారు, మరి ఆ కవితలు ఆయనే రాసారో లేదో తెలీదు.
సినిమా చూడాలనుకునే వారి కోసం కొన్ని…
సినిమాని ఈ కవితతో మొదలెట్టడం, విశ్వనాధ్ గారి ప్రత్యేకమైన శైలికి నిదర్శనం.
రచయిత అయ్యే వ్యక్తికి మంచిపేరు వచ్చేవరకు ప్రతి ఒక్కరూ అనే మాటలు...
నేను ఇదే చేస్తా, నాకు ఇదే వచ్చు అంటే కుదరదు. వచ్చిన పని ఇచ్చేవాడు లేకపోతె, రాని పని నేర్చుకోవాలి తప్పదు.
మనిషి బాహ్య స్వరూపానికి, లోపలి సామర్ధ్యానికి సంబంధం ఏంటి భయ్యా !?
ప్రేమలోపడిన వ్యక్తి పరిస్తితి...
ఆడపిల్లలందరూ బాహ్య సౌందర్యాన్ని చూసే ప్రేమిస్తారంటారు. ఇలా ఎవ్వరైనా ఆలోచిస్తారా ?
కళ్ళెదురుగా ఉన్న ప్రేయసిని ఊరించడానికి వీటినిమించిన మాటలు అవసరమా ?
ఈ సినిమా మొదలయ్యే ముందు కథ గురించి మనం ఏమి ఊహించుకున్నా, అన్నిటిని తలకిందులు చేసేస్తారు విశ్వనాధ్ గారు.






