నాకు మొదటిసారి వీరందరి గురించి తెలుసుకోగానే ఎంతో ఆనందమేసింది.. ఎందుకంటే మా బంధువులలో చాలామంది గ్రామాలలో నివసిస్తుంటారు. పండుగలకు, ఇతర శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించడం నాకు అలవాటు. కొంతమంది మహిళలు మూడ నమ్మకాలతోపాటు ఇతర ఆర్ధిక ఇబ్బందులతో చాలా అవస్థ పడుతుంటారు అదే కూలి పనికి పోతుంటారు. శారీరకంగా శ్రమ పడడం కన్నా ఆలోచనల ద్వారా శ్రమపడితే అద్భుతాలు సృష్టించవచ్చని నేను చెబితే "నేనా.. అంటూ తేలిగ్గా తీసిపారేస్తుంటారు" కొంతమందైతే మారడానికి భయపడుతుంటారు. నలుగురు మహిళలు కలిసి ఏ పట్టనానికి వెళ్ళకుండా ఇలా వారి ,గ్రామంలోనే స్వయం ఉపాధిని సృష్టించుకోవడం చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుంది.
ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే దాని అవసరం ప్రజలకు ఉండాలి. మరి ఆ అవసరం ఏదై ఉంటుంది అని చెప్పి అమరావతి గారు, నాగలక్ష్మి గారు, పద్మావతి గారు, గంగా భవాని గారు అందరూ కలసి తీక్షణంగా కొన్ని రోజుల పాటు ఆలోచిస్తే "ఒక అవసరం తమ ఊరిలో ఉందని తేలింది". వీరు ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో దాదాపు ప్రతి ఇంటిలో పశువులున్నాయి. వాటి దాణా కోసం ఎంతగానో అవస్థపడి ఆహారం పెడుతున్నారు, కొన్నిసార్లైతే పక్క ఊరికి వెళ్ళి మరి తెచ్చుకునేవారు. అలా తెచ్చుకున్నా కాని అందులో పోషక విలువలు అంతంత మాత్రం గానే ఉండేది. ఈ డిమాండ్ నే ఆధారం చేసుకుని పశువులకు దాణాను నాణ్యతతో ఇవ్వాలని, పశుదాణాను తయారుచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆలోచన అద్భుతంగా ఉంది మరి పెట్టుబడి సంగతేంటి.? నలుగురు మహిళలు కూడా దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారే.. పశుదాణా పెట్టుబడి కోసం అత్యధికంగా ఖర్చుపెట్టవలసింది మిషిన్ కోసం. నలుగురు మహిళలు కలిసి జిల్లా గ్రామీణాభివృద్ది శాఖా అధికారులను కలిశారు. గ్రామాలలోని మహిళలు మరింతమంది స్వయం ఉపాధి పొందాలని అధికారులు ప్రభుత్వం తరుపున 1.50 లక్షలు విలువచేసే యంత్రాన్ని ఉచితంగా అందజేశారు. వారి పొలం పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే మిల్లును స్థాపించారు. పశువులకు అవసరమైన అత్యంత పోషకవిలువలున్న దాణా నీ వీరు తయారుచేయడం మొదలుపెట్టి అమ్మడం మొదలు పెట్టిన తర్వాత ఆ గ్రామ రైతులు మాత్రమే కాదు పక్క ఊళ్ళలోని రైతులు కూడా రావడం మొదలుపెడుతున్నారు.