This Story About Buddha's Disciple And His Relationship With A Prostitute Will Teach You Everything About Character!

Updated on
This Story About Buddha's Disciple And His Relationship With A Prostitute Will Teach You Everything About Character!

గౌతమ బుద్దుడు మరియు తన శిష్యబృందం కలిసి ఒకరోజు అలా వీధిలో నడుచుకుంటు వెళుతుండగా అదే దారిలో వస్తున్న ఒక అందమైన స్త్రీ బుద్దుని శిష్యబృందంలోని ఒక సాధువుని చూసి ప్రేమలో పడింది. ఆ సాధువుతో ఎలాగైనా మాట్లాడి తన కోరికను తెలపాలని అనుకుంది. నిజానికి ఆ స్త్రీ ఒక వేశ్య. ఈ విషయం ఆ ఊరిలో అందరికి తెలిసిందే.. ఒకరోజు ఒంటరిగా ఉన్న ఆ సాధువు దగ్గరికి వెళ్ళి పరిచయం పెంచుకుని ఇలా మాట్లాడింది. మీరంతా సాధువులు.. మీకు ఏ ఇల్లు, ఆస్థులు ఉండవు.. రాబోయేది వర్షకాలం, మీ సాధువులంతా ఈ వర్షకాలం నాలుగు నెలలు ఎక్కడో ఒకచోట ఉండాలి కదా మీకు అభ్యంతరం లేకుంటే ఆ ఉండెదేదో ఈ వర్షకాలం మీరొక్కరు నా ఇంట్లో ఉండొచ్చు.. ఏమంటారు.? దానికి అతను.. "ధన్యవాదాలు నేను నా గురువు గారికి మీ ఆహ్వానాన్ని తెలియజేస్తాను, గురువు గారు అంగీకరిస్తే రేపు ఉదయం మీ ఇంటికి చేరుకుంటాను" అని చెప్పి ఇంకేమి అనవసరంగా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

అలా వెళ్ళిపోతున్న సాధువు వంక చూస్తున్న ఆ వేశ్యకు తన కోరిక అస్సలు నెరవేరేలా కనపడటం లేదు.. మామూలు మగవారే నా ఇంటికి రావడానికి ఆలోచిస్తారు ఇంక ఈ సాధువు వస్తాడా.. అని ఆ సాధువు రాకపై అంతగా నమ్మకం పెట్టుకోలేదు. అదేరోజు సాయంత్రం ఆ సాధువు మిగిలిన శిష్యబృందం సమక్షంలో బుద్దునికి ఆ వేశ్య ఆహ్వానం గురించి తెలియజేశాడు.. అక్కడున్న శిష్యులకు ఈ చర్చ ఒకింత ఆశ్చర్యానికి, కొంతమందికి అసహ్యంగా అనిపించింది. ఇది ఉపేక్షింపకూడదు ఒక సాధువు వేశ్య ఇంట్లో ఉండటమా!? ఇది జరగకూడదు.. ఐనా బుద్దుడు దీనికి ఏ మాత్రము అంగీకరించడు.. అని వారిలో వారు అనుకున్నారు. గౌతమ బుద్దుడు ఆ సాధువును కాసేపు చూసి "సరే.. నువ్వు ఈ నాలుగు నెలలు ఆ వేశ్య ఇంటిలో ఉండటానికి నేను ఒప్పుకుంటున్నా.. నువ్వు అక్కడ ఉండవచ్చు" అని అన్నారు. ఊహించని ఈ సమాధానానికి ఆశ్చర్యానికి గురైన శిష్యులు "గురువు గారు ఇది సరైన నిర్ణయంగా మేము భావించడం లేదు.. ఆ వేశ్య ఈ యువకుడిని కోరుకుంటున్నది, కేవలం ఈ యువకుడితో గడపడానికి మాత్రమే ఈ ఆహ్వానం.. ఆ వేశ్య ఎంతోమంది రాజులను, ధనవంతులను నాశనం చేసింది. ఈ యువ సాధువు చూడటానికి అమాయకుని వలె ఉన్నాడు ఈ విషయంపై మీరు మరోసారి ఆలోచించండి" అని అన్నారు. దానికి బుద్దుడు.. మీరు కొన్ని నెలలు ఓపిక పడితే ఆ సాధువు గురించి నిజం తెలిసిపోతుంది కదా.. ముందు తనని వెళ్ళనిద్దాం అని వేశ్య దగ్గరికి పంపించారు.

శిష్యులకు ఆ నాలుగు నెలలు కొన్ని యుగాలుగా గడిచాయి.. బుద్దుని నిర్ణయం సరైంది కాదు.. ఖచ్చితంగా ఆ వేశ్యతో సాధువు శారీరకంగా గడుపుతాడు అని భావించారంతా.. నాలుగు నెలల తర్వాత...

ఆ సాధువు బుద్దుని దగ్గరికి వచ్చి బుద్దుని పాదాలకు నమస్కరించారు. శిష్యులందరూ వెంటనే అక్కడికి చేరుకుని "ఇక ఇప్పుడు చెప్పు అక్కడేం జరిగింది నిజం చెప్పు" అని అత్రుతతో అడిగారు. సాధువు: తప్పకుండా మీకు నిజం తెలుస్తుంది.. ముందు కాస్త ఓపికగా ఉండండి, ఆ స్త్రీ ఇక్కడికి వస్తుంది. నాకన్నా వివరంగా తనే చెప్పగలదు, తను చెబితేనే మీకు స్పష్టంగా అర్ధం అవ్వగలదు. ఆ వేశ్య అక్కడికి వచ్చి బుద్దుని ఆశీర్వాదం తీసుకుని "నన్ను కూడా మీ శిష్యురాలిగా స్వీకరించండి, నేను కూడా సన్యాసినిగా మారదామని నిర్ణయించుకున్నాను.. నన్ను మీ శిష్యురాలిగా మనస్పూర్తిగా అంగీకరించండి. బుద్దుడు: ఎందుకు?

ఆ వేశ్య: నేను అతన్ని శారీరకంగా మోహించాను.. అందుకు తగ్గట్టుగానే రెచ్చగొట్టాను. నా ముఖకదలికలు, నా మాటలతో శృంగరం లోని తీపిని తెలియజేశాను, రాజులను సైతం పాదాక్రాంతం చేసే నా సమ్మోహపూరితమైన నాట్యాన్ని ప్రదర్శించినా కాని అతనిలో ఏ మాత్రమూ చలనం లేదు ఆఖరికి నా ఒంటిమీద వస్త్రాలన్ని విడిచి తన ముందుకు వయ్యారంగా వస్తే "ఈరోజు చాలా చలిగ ఉంది మీరు ఇలా వస్త్రాలు వేసుకోకుంటే చలి ద్వారా మీ ఆరోగ్యం పాడవుతుంది అంటు వస్త్రాలు అందించాడు." నేను ఎంతోమందిని ఒక చిన్న సైగతో నా బుట్టలో వేసుకునే దానిని కాని ఇలాంటి బుద్దిమంతుడిని చూడలేదు. నేను శృంగారానికి రెచ్చగొట్టాను తను కూడా నన్ను రెచ్చగొట్టాడు కాని నన్ను సన్యాసినిగా మార్చడానికి.. చివరికి తనే గెలిచాడు నాలోని చెడు ప్రవర్తనని దూరం చేసుకోవడానికి నాకో అద్భుతమైన దారిని చూపించాడు. నన్ను మనస్పూర్తిగా మీ శిష్యురాలిగా స్వీకరించండి అని కన్నీటితో వేడుకున్నది.. బుద్దుడు చిరునవ్వుతో శిష్యుల వంక చూసేసరికి వారు పశ్చాతాపంతో తలదించుకున్నారు..

ఈ కథలో గొప్ప నీతి ఉందండి. ఇలాంటి సాధువు ఇలాంటి వేశ్య లాంటి సంఘటన మన జీవితంలో ఎదురు కాకపోవచ్చు.. కాని మన వ్యక్తిత్వాని దిగజార్చడానికి చెడు ప్రవర్తనతో బ్రతికేవారు మనకు ఎదురై మనల్ని ప్రలోభాలకు గురిచేసి మనతో చేయరాని నేరాలను మోసలను చేపించి వారి స్వార్ధానికి బలిచేయవచ్చు. మన వ్యక్తిత్వం ఒక వెలకట్ట లేని ఆస్థి.. దానిని స్వార్ధం నుండి దోపిడికి గురికాకుండా కాపాడుకోవాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.