This Story Of Extreme Hardships In The Life Of Buddha's Disciple Will Teach You About God's Grand Design!

Updated on
This Story Of Extreme Hardships In The Life Of Buddha's Disciple Will Teach You About God's Grand Design!

పటాసార ఒక అందమైన మహిళ, తనకు ఏ స్థాయిలో అందం ఉందో అదే స్థాయిలో సంపద కూడా ఉంది. ఆమెకు వివాహం చేసే కాలం వచ్చిందని తన తండ్రి యోగ్యుడు, ధనవంతుడైన వరుడు కోసం వెతుకుతున్నాడు. కాని పటాసారకు తండ్రి అలా సంబంధాలను చూడడం ఎంతమాత్రమూ ఇష్టం లేదు. కారణం తన ఇంట్లోనే గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తిని మనస్పూర్తిగా ప్రేమించడం. తండ్రి ఖచ్చితంగా వారి పెళ్ళిని అంగీకరించడని పటాసార ప్రేమికుడితో కలిసి ఇంటి నుండి పారిపోతుంది. ఒక చిన్నపాటి గ్రామానికి వారిద్దరు చేరుకుని పెళ్ళిచేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. కొంతకాలానికి పటాసార గర్భవతి అయ్యింది. మొదటి గర్భం కాబట్టి పటాసార అమ్మనాన్నల దగ్గరికి వెళ్ళాలని ఆశించింది కాని భర్త ఇందుకు అంగీకరించలేదు. ప్రసవం అదే గ్రామంలో జరిగింది. కొన్నాళ్ళకు పటాసార మళ్ళి గర్భవతి ఐయ్యింది. కనీసం రెండోసారి ఐనా పుట్టింటికి వెళ్తాను అని భర్తను బ్రతిమాలుకుంది, ఈసారి ఎలాగైనా పుట్టింటికి వెళ్ళాలని పట్టుబట్టింది ఇక చేసేదేమిలేక భర్త ఒప్పుకున్నాడు.

పెద్దకూతురు, కడుపులో మరో బిడ్డతో ఆ భార్య, భర్తలు కాలినడక ద్వారా పయనమయ్యారు. కొంతదూరం అడవి మధ్యలోకి చేరుకున్నాక పటాసారకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పటాసారకు ఇంకా ఆ పుట్టబోయే బిడ్డకోసం ఒక గుడిసెను నిర్మించాలని భర్త కట్టెలకోసం వెళ్ళాడు. కట్టెలను సేకరిస్తున్న భర్తను ఒక భయంకరమైన తాచు పాము కాటు వేస్తుంది. ఆ భర్త తన భార్య పిల్లలను తలుచుకుని విలపిస్తూనే అక్కడికక్కడే చనిపోయాడు. ఇటు వైపు పురిటి నొప్పులతో, భర్త రాక కోసం ఎదురుచూస్తూ పటాసార విపత్కర పరిస్థితిలో బిడ్డను ప్రసవిస్తుంది. కాసేపు ఎదురుచూసి ఆ చంటిబడ్డను ఎత్తుకుని భర్తకోసం వెతకడం ప్రారంభించింది. అత్యంత కష్టతరమైన ఆ సమయంలో భర్తను వెతుకుతున్న సందర్భంలో భర్త శవం కనిపించడంతో ఒక్కసారిగా తన గుండె కొట్టుకోవడం ఆగి, మరల వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఒక్కసారిగా ఆకాశం మీద పడినట్టుగా భూమి మాహాప్రళయంతో ఆకాశాన్ని అందుకున్నట్టుగా ప్రకంపనలు జరిగాయి తనలో.. భర్త శవం దగ్గరే తనలో శక్తి క్షీణించేంత వరకు విలపించి, ఒక చేత్తో బిడ్డను నడిపిస్తూ మరోచేత్తో చంటిబడ్డను ఎత్తుకుని ఇద్దరు పిల్లలతో తన పుట్టింటికి ప్రయాణం మొదలుపెట్టింది.

దారిలో ఒక వాగు అడ్డుగా వచ్చింది వర్షాకాలం వల్ల వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఇద్దరు పిల్లలను ఎత్తుకుని వాగు దాటడం కష్టమని భావించి ఒక్కో బిడ్డను ఒక్కోసారి వాగును దాటించాలని అనుకుంది. చంటిబిడ్డను ఒక పెద్ద బండరాయి మీద పడుకోబెట్టి ఆ బిడ్డపై రెండు పెద్ద ఆకులను కప్పి పెద్దబిడ్డను వాగు దాటించి మరల తిరిగివచ్చి చంటి బిడ్డను తీసుకొద్దామని వాగులోకి ప్రవేశించింది. వాగు మధ్యలోకి చేరుకోగానే ఒక రాబందు ఎగురుకుంటూ చంటిబిడ్డ వైపు వెళ్ళింది. గుండె బద్దలయ్యే భయంతో రాబందును బెదిరించడానికి పటాసార చేతులను ఆటు ఇటు ఊపింది. తనని రమ్మని పిలుస్తుందని భ్రమపడిన పెద్ద కూతురు వాగులోకి ప్రవేశించింది. ఇటువైపు రాబందు చంటి బిడ్డను నిర్ధాక్షిణ్యంగా ఎత్తుకెళ్ళిపోతుంది, మరోపక్క ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో పెద్ద కూతురు కొట్టుకుపోయింది. వాగు మధ్యలో ఉన్న పటాసార ఈ పరిస్థితులకు ఎలా స్పందించాలో తెలియలేదు.. తన ప్రపంచం ఆగిపోయింది.. ఒకే సమయంలో ఇద్దరు బిడ్డలు చనిపోయారు.

పటాసార ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది, అడుగులు అత్యంత కష్టంగా పడుతున్నాయి, అలా నడుస్తూనే తల్లిదండ్రుల ఇంటికి వెళుతుంది. క్రిందటి రోజు రాత్రి భీకరమైన గాలి వానలో తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లు కూలిపోయింది.. తనకు జన్మనిచ్చి, అల్లారు ముద్దుగా, ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రులు అప్పటికే చనిపోయి జీవంలేని శవాలయ్యారు. పటాసారకు అంతా చీకటిగా ఉంది.. అనంతమైన శక్తితో భగవంతుడు అభాగ్యురాలైన నాపై యుద్ధం చేస్తున్నాడనిపించింది. భర్త, పిల్లలు, అమ్మనాన్నలు తన సర్వస్వాన్ని కోల్పోయే సరికి గుండెలవిసేలా రోదిస్తుంది. నీటి నుండి నేలమీద పడిన చేపలా గిలగిల కొట్టుకుంటు ఏడుస్తుంది.. అక్కడున్న వారందరికి తనని ఎలా ఓదార్చాలో తెలియక వారికీ శోకం అంటుకుంది. పటాసార బిగ్గరగా, ఏ దాపరికం లేకుండా, మనస్పూర్తిగా ఏడుస్తుంది.. తనవారి మరణం తనని ఎంత బాధిస్తుందో ఆ ఏడుపుతో తెలుస్తుంది. పిచ్చిపట్టేలా ఏడుస్తుంది. పట్టేలా కాదు నిజంగానే ఆ క్షణంలోనే తనకు పిచ్చిపట్టింది.! ఎక్కడ సంపన్న కుటుంబం, ఎక్కడ తోడు నీడగా ఉండే భర్త ప్రేమానురాగాలు, పిల్లలు.. అన్నిపోయి చివరికి పటాసారకు పిచ్చిపట్టి రోడ్లమీద తిరిగేది. ఒకరోజు కరుణ, ప్రేమ నిండిన శక్తివంతుడైన గౌతమ బుద్దుడు ఆమెను చూశాడు..

గౌతమ బుద్దుడు ఆమె దగ్గరికి నిదానంగా కదిలాడు. అప్పటి వరకు కూర్చున్న పటాసార గౌతమ బుద్దుడిని చూడగానే తెలియకుండానే గౌరవ సూచికంగా లేచి నిల్చుంది. సమ్మోహనభరితమైన కరుణ, జ్ఞానం నిండిన బుద్దుని ముఖం చూడగానే పటాసారలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి.. తను మళ్ళి మామూలు మనిషయ్యింది.. తన గతం గుర్తుకొచ్చిన వెంటనే పిల్లలు, తల్లిదండ్రులు, భర్తను తలుచుకుని ఏడవడం ప్రారంభించింది గౌతమ బుద్దునికి గతమంతా వినిపించింది. బుద్దుని హృదయం ద్రవించింది.. "తల్లి నీ జీవితంలో జరిగిన ఈ గతం మరల మరెవ్వరికి జరగకూడదు, నువ్వు పడిన కన్నీటి వ్యధ ఈ ఒక్క జన్మలోనే జరగలేదు, మూడు జన్మలుగా జరుగుతుంది. తల్లి.. జన్మ జన్మలుగా నువ్వు రాల్చిన ఈ కన్నీరును కూడగడితే మూడు సముద్రాలు నిండుతాయి. తల్లి.. బాధలు, జన్మలు, బంధాలు లేని స్థితికి నువ్వు చేరుకోవాలి అందుకోసం నువ్వు నా శిష్యురాలివి కా.. అని బుద్ధుడు ఆత్మీయంగా ఆహ్వానించాడు". తదనంతరం బుద్ధుని శిష్యులలో పటాసార అత్యుత్తమ స్థాయికి చేరుకుని ఎంతోమందికి శాంతియుత జీవితాలను అందించింది.

నిజమే ప్రతి ఒక్కరికి ఎంత గొప్ప భక్తుడికైనా అనిపిస్తుంది దేవుడు నాపై వివక్ష చూపిస్తున్నాడు.. దేవుడు నన్ను మోసం చేస్తున్నాడు అని. అలా ఐతే భగవంతుడు అందరిపై వివక్ష చూపిస్తున్నాడనే అనుకోవాలి. ఎవరి కష్టం వారికి ఎక్కువే కావచ్చు కొంతమందికి కొన్నిసార్లు మనం ఊహించని కష్టాలస్తాయి. కాని ఎప్పుడైతే ఆ కష్టానికి తలవంచి అక్కడే మిగిలిపోయి ఏడుస్తూ కూర్చుంటే ఆ జీవితమంతా బాధలతో నిండిపోతుంది. శ్రీరామునికి, సీతమ్మకు, జీసస్ కు, మహాత్మ గాంధీకి, భగత్ సింగ్ కు, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, అంతెందుకు బుద్ధుడు కూడా విపరీతమైన కష్టాలను అనుభవించాడు. రాజ్యాన్ని వదిలేసి తనని తాను వెతుక్కునే క్రమంలో తిండి తినకుండా, జ్ఞానం లేక, సర్వస్వం కోల్పోయి ఎన్నో కష్టాలు అనుభవించాడు ఆ తర్వాతనే సిద్దార్ధుడు గౌతమ బుద్ధుడు అయ్యాడు.. కష్టాల తర్వాతనే గాంధీ మహాత్ముడు అయ్యాడు.. 27 సంవత్సరాల సుదీర్ఘ జైలు జీవితం తర్వాతనే దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా తాను కోరుకున్న మార్గనిర్దేశం చేశాడు. ప్రతి జీవితంలోను ఎన్నో కష్టాలుంటాయి. కష్టాల తర్వాతనే మనం కోరుకున్న ఆనందం ఉంటుంది.. కష్టాలు ఎదురయ్యాయి అంటే మనం మన అంతిమ గమ్యానికి అతి చేరువలో ఉన్నామనమాట.. మిత్రమా ఏ ఆటంకానికి ఆగిపోక ధైర్యంగా సాగిపో...