Written By Swathi Vadlamudi
Disclaimer: The language used in the poem below contains certain words, that are not for everyone.
బాధపడకండి.. మీ బూతులు మా హృదయాల్ని గాయపరుస్తాయనీ లంజా అంటే సిగ్గుపడి భూమిలో కుంగిపోతామనీ పూకుల్ని బజార్లో పెడితే ద్రౌపదిలా మోరెత్తి మొర పెడతామనీ మీ నోళ్ళల్లో మా బతుకులు బ్లూ ఫిల్ములైతే అవమానంతో ఉరికొయ్యలకు వేలాడతామనీ భ్రమపడకండి అయ్యలూ భయపడకండి
మా శరీరాలు మీ పెరట్లో ముఱ్ఱా జాతి గేదలైనప్పుడే మా గర్భాలు మీ వంశాలకు ఇంక్యూబేటర్లయినప్పుడే మా బిడ్డలు మీ మగతనాలకు అడ్డ్రసులైనప్పుడే మా నిషిద్ధ శృంగారాలు మీ విల్లులో అమ్ములైనప్పుడే అవేవీ మావి కాకుండా పోయాయి వాటికి జరిగే అవమానాలు మావెలా అవుతాయి?
జండా కు జరిగే అవమానం జండాది కాదు గుడిలో బొమ్మను తంతే బొమ్మ తిరగబడదు శత్రువు దురాక్రమిస్తే సరిహద్దు కేం నొప్పి? ఎవడి పాదాలైతేనేం తన్నులు తినడానికి!
లంజలమైనా పూకులమైనా మీకే, మాకు కాదు మాది కాని యుద్ధానికి మేము రాము
కాబట్టి మహారాజుల్లా కత్తులు సానబెట్టండి మా పూకుల్నీ రంకుల్నీ మీ నోళ్ళల్లో నానబెట్టండి కమ్మగా అమ్మా ఆలీ బూతులతో రెచ్చిపోండి అహాలు, పౌరుషాలు దెబ్బతిన్నాయని సచ్చిపోండి.
మేం పాప్కార్న్, పెప్సీ తాగుతూ గ్యాలరీలో నుంచి చీరియో చెప్తామ్!