2.0 సినిమా చూసిన అందరు రజిని గారి నటన గురించి , చివర్లో వచ్చే చిన్ని సర్ప్రైజ్ గురించి, విజువల్స్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో.. ఒక వ్యక్తి గురించి కూడా అంతే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు సలీమ్ అలీ గారు. 2.0 లో అక్షయ్ కుమార్ గారి పాత్ర ఆయనని పోలి ఉంటుంది. ఆయనని "Bird man of India" అని పిలుస్తారు. పక్షులపై ఎన్నో పరిశోధనలు చేసిన మహా వ్యక్తి ఆయన.
సలీమ్ అలీ: సలీమ్ అలీ గారు మొయిజుద్దీన్, జీనత్ అనే దంపతులకు నవంబర్ 12 1896 న 9 మంది పిల్లలలో చివరి సంతానంగా జన్మించారు. కానీ తండ్రి సలీమ్ అలీ గారు సంవత్సరం ఉన్నప్పుడు చనిపోయారు. తల్లి 3 వ సంవత్సరం అప్పుడు చనిపోయారు. తన మావయ్య అమీరుద్దీన్ గారి దగ్గర సలీమ్ పెరిగారు.
పక్షుల పై ప్రేమ: చిన్నపుడు ఓ సారి ఒక పక్షిని అనుకోకుండా రాయితో కొట్టారు. అది చనిపోవడం చూసి తట్టుకోలేక బాధ పడి ఆ పక్షి పిల్ల ని తన మావయ్య కి చూపిస్తే .. ఆ పక్షి ఏజాతి కి సంబంధించిందో తెలుసుకోవడానికి Bombay Natural History Society కి Honorary Secretary గా పని చేసే W.S. Millard గారి దగ్గరికి తీసుకుని వెళ్లారు. మిల్లర్డ్ గారు పిల్లవాడైన సలీమ్, పక్షుల పై చూపిస్తున్న ఇష్టాన్ని గమనించి అక్కడ ఉంచిన మరెన్నో పక్షి జాతులని చూపించారు. ఆ రోజు నుండి అక్కడికి ఆయన తరుచు వెళ్లేవారు. అలా ఆయనకీ పక్షుల పై ఇష్టం ఏర్పడింది.
చదువు, వృత్తి: ముంబాయి St Xavier’s కళాశాలలో జంతు శాస్త్రం లో డిగ్రీ వచ్చిన తరువాత 1918 లో పెళ్లి చేసుకుని 1926 లో Bombay Natural History Society లో నే గైడ్ గా చేరారు. ఆ పని అతనికి పక్షుల పై ప్రేమని మరింత పెంచాయి. 1929 లో జర్మనీ కి చెందిన Dr. Irvin Strassman అనే పక్షి శాస్త్రవేత్త దగ్గర కొంత కాలం పని చేసి బొంబాయి కి తిరిగొచ్చారు. గైడ్ గా పని పోయింది కానీ క్లర్క్ గా అక్కడే తిరిగి ఉద్యోగం వచ్చింది. ఈ పని ఆయనకి పక్షి జాతుల గురించి తెలుసుకోవడానికి ఎంతో సహాయపడింది. అతని భార్య తల్లి తండ్రుల ఇల్లు ముంబయి సమీపం లో ని కిహిం అనే పల్లెటూరి లో ఎంతో ప్రశాంతంగా చుట్టూ చెట్లు మధ్య ఉండేది. ఆ ప్రాంతాన్ని తను నేతపని పక్షి(weaver bird) పై చేసే పరిశోధనలకు ఉపయోగించుకునే వారు. ఆ పరిశోధనల సాయం తో ఒక రీసెర్చ్ పేపర్ ని 1930 లో రాసారు. ఆ ఆర్టికల్ ornithology రంగం లో ఆయన పేరు వినపడటానికి పునాది గా నిలిచింది. ఎంతో గుర్తింపు ని తెచ్చింది. అప్పటినుండి పక్షుల పరిశోధన కోసం ఎన్నో ప్రదేశాలను సందర్శించారు. 1939 ఆయన భార్య చనిపోయారు.
పుస్తక రచనలు: అప్పటివరకు ఆయన చేసిన పరిశోధనల ఆధారంగా రాసిన "The Book of Indian Birds in 1941" పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది. చాలా కాలం వరకు బాగా అమ్ముడైంది. 1964 - 1974 వరకు తన పరిశోధనలను మరో పక్షి శాస్త్రవేత్త అయినా S. Dillon Ripley గారితో పది పుస్తకాల సంకలనంగా Handbook of the Birds of India and Pakistan ని ప్రచురించారు. ఆ పుస్తకం ఆ తర్వాతి పరిశోధనలకు తోలి అడుగు గా నిలిచింది. 1967 లో "Common Birds" అనే పుస్తకాన్ని రాసారు. 1985 లో తన ఆత్మకథ "The Fall of Sparrow" గా ప్రచురితమైంది. Click here to buy that book
చివరి రోజులు: కేవలం పక్షుల పై పరిశోధనలే కాకుండా... ప్రకృతి ని కాపాడటానికి తన వంతు కృషి ఆయన చేశారు. ఆయన కృషి కి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు వచ్చి 5 లక్షల బహుమతి ఇచ్చినా.. ఆ డబ్బుని తనలో పక్షి శాస్త్రవేత్తని పుట్టించిన, మరెన్నో తన పరిశోధనలకు బీజమైన Bombay Natural History Society కి విరాళమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 1958 పద్మభూషణ్ బిరుదు తో 1976 పద్మవిభూషణ్ బిరుదు తో ఆయనని సత్కరించింది. 1987 లో 90 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. 1990 లో ఆయన పేరు మీద Sálim Ali Centre for Ornithology and Natural History ని స్థాపించబడింది. వ్యక్తిగతంగా అమ్మ నాన్నలని చిన్నపుడు కోల్పోయి భార్య ని చిన్న తనం లో నే కోల్పోయినా తన పరిశోధనలను వదలకుండా దేశానికి, ప్రకృతికి, పక్షి జాతికి ఆయనెంతో సేవ చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
THE WESTERN GHATS WILDLIFE వారు ఆయన జీవితం గురించి డాక్యూమెంటరి తీశారు.
Here is an Animated Video on his life
బహుశా ఈ కాలం లో సలీమ్ అలీ గారు పుట్టుంటే 2.0 లో అక్షయ్ కుమార్ లానే స్పందించేవారెమో. ఆ ఊహ నుండి శంకర్ గారు అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ని డిజైన్ చేసుండచ్చు. ఏది ఏమైనా బడి లో ఒక పాఠంగా ఉన్న ఆయనని తిరిగి గుర్తు చేసుకుని ఆయన గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం ఈ సినిమా వల్ల వచ్చింది. ఇలాంటి పాత్రలు మరెన్నో వస్తే ఎందరో మహానుభావుల గురించి నేటి తరానికి తెలిసే అవకాశం ఉంటుంది.