మనలో చాలామందిలో సమజానికి ఏదో చేయాలనే తపన ఉంటుంది. అమెరికా వెళ్ళాక ఖచ్చితంగా సొంతూరికి సహాయం చేస్తాను, జాబ్ వచ్చాక కొంతమంది పిల్లలను చదివస్తాను లాంటివి అనుకుంటుంటారు కాని లక్ష్యం సాధించాక రకరకాల కారణాల వల్ల తమ జీవితంలోని సొంత అవసరాల కోసమే పరిమితమవుతుంటారు, కొంతమంది మాత్రమే అన్నిరకాల ఇబ్బందులను దాటుకుని వ్యక్తిగత జీవితానికి, సమజానికి పరిపూర్ణమైన న్యాయం చేసి ముందుకు సాగిపోతుంటారు అలాంటి ఉన్నతులలో తేజస్వి గారు ఒకరు.
తేజస్వీ గారిది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. కొంతమందికి కొన్నిరకాల ఇష్టాలుంటాయి సినిమాలు చూడడం, ఇంటర్నెట్ ప్రపంచంలో బ్రతకడం మొదలైనవి.. తేజస్వీ గారికి మాత్రం "సమాజ సేవ" అంటే ఎంతో ఇష్టముండేది. తనతో పాటు బ్రతుకుతున్న తోటి మనుషులను ఆత్మీయంగా ప్రేమిస్తే తప్ప ఇటువంటి లక్షణం రాదు. అలా తేజస్వీ గారు చిన్నతనం నుండే తనకు తోచిన విధంగా సమజానికి బాధ్యతను నిర్వర్తించేవారు. ఒంగోలు పట్టణాన్ని సుందరంగా మార్చివేస్తున్న "భూమి ఫౌండేషన్" ను హైదరాబాద్ టెక్ మహేంద్రాలో జాబ్ వచ్చాక కాదు, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే స్థాపించారు.
నిజంగా మార్పు తీసుకురావాలని మనస్పూర్తిగా అనుకుంటే ఎన్ని అడ్డంకులనైనా అదిగమించగలము. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు మరి ఒంగోలులో ఎలా అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు.? అనే అనుమానం రావచ్చు.. ప్రతి శనివారం ఆదివారం వారంతపు సెలవులు ఉంటాయి.. అలా శుక్రవారం రాత్రి ఒంగోలుకు వచ్చి(300 కిలోమీటర్లు ప్రయాణం చేసి) తన కుటుంబంతో సమయంగడపడం కన్నా ఒంగోలులోని సమస్యలపై తోటి మిత్రులతో కలిసి యుద్ధం చేసేవారు. ఒక వ్యక్తి ఉన్నతుడు కావడానికి అతను పాటించే శుభ్రత విషయాలు కీలకంగా ఆధారపడి ఉంటాయి. అది ఊరికి కూడా వర్తిస్తుంది. ముందుగా ఒంగోలు పట్టణ ప్రాంతంలోని బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం ప్రారంభించారు. ఒంగోలులోని బాబురావు పార్క్ పార్క్ లా కాకుండా అసభ్యంగా ఉండేది. దానిని పూర్తిగా శుభ్రం చేసి రంగులు వేసి, స్వయంగా టీం సభ్యులే అందమైన బొమ్మలు గీశారు.
ఆ తర్వాత బస్టాండ్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా సుమారు 50 ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు. అవి ఎంత అందంగా వాటి రూపును మార్చారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆనందపడ్డారు. ఇంతే కాకుండా ప్రత్యేకంగా పేదవారి కోసం కార్పోరేట్ హాస్పిటల్స్ సహకారంతో వైద్యం అందించడం, ప్రతి ఒక్కరు వారి ఏరియాను దత్తత తీసుకోవడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా సొంత ఊరిని సొంత ఇల్లులా తీర్చిదిద్దుతున్నారు..