The Incredible Story Behind Qutb Shah's Love For The City And His Wife

Updated on
The Incredible Story Behind Qutb Shah's Love For The City And His Wife

Contributed By: Anand S Dhulipala

తను ఎంతగానో ప్రేమించిన తన భార్య చనిపోయాక ప్రపంచం అంతా శూన్యంలా కనిపించింది కులీకుతుబ్ షా కి. తన వీర ప్రేమ చరిత్ర గురించి పూర్తిగా తెలిసింది ముగ్గురికే, ఒకరు కులీకుతుబ్ షా తండ్రి ఇబ్రహీం, రెండు తన భార్య భాగ్మతి, మూడు తనకి. ఇబ్రహీం, భాగ్మతి చనిపోయారు కాబట్టి బతికి ఉన్న వాళ్ళల్లో కులీకుతుబ్ షా ఒక్కడికే తెలుసు. తన ప్రేమ కథ తనతో అంతం అయిపోకోడదు అనిపించింది కులీకుతుబ్ షా కి. మత కలహాలని దాటి పెళ్లి వరకు వచ్చిన తన ప్రేమని ముందు తరాలవాళ్ళకి అందించాలి అనుకున్నాడు. అందుకు స్వయంగా తనే తన ప్రేమ కథని ఒక శిల మీద చెక్కాలి అనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం కోటకి ఉత్తరాన, ఎగువన ఉన్న ఒక పెద్ద కొండ రాయి మీద తన ప్రేమ కథ చెక్కడం ప్రారంభించాడు. ఏడు రోజులు తిండి తిప్పలు మానేసి అదే పనిగా పెట్టుకున్నాడు కులీకుతుబ్ షా. ఆ కథ ఇలా ఉంది. “మా వంశంలో నేను ఐదవ రాజును. మా నాన్నగారు ఇబ్రహీం కుతుబ్ షా గారి తరువాత సింహాసనాన్ని అధిరోహించాను. రాజుగా కంటే కుడా ఒక ప్రేమికుడిగా నన్ను గుర్తుంచుకోవాలి అనుకుంటున్నాను. నేను రాజు అవ్వడానికి ముందే నా జీవితంలోకి భాగ్మతి వచ్చింది. తన పరిచయం నా జీవితం లోకి వెలుగుని తెచ్చింది. మా ప్రేమ కథకి ప్రత్యక్ష సాక్షి - మూసి నది. మత కలహ సర్పాల కోరలకి చిక్కకుండా పెళ్లి తీరానికి చేరుకున్న మా ప్రేమ కథ ముందు తరాల వాళ్ళు తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నా అభిప్రాయం. నాకు పదిహేడేళ్ళు ఉన్నప్పుడు ఒక్కడినే దేశాటన చెయ్యాలి అన్న కోరిక కలిగింది. మా నాన్నగారి అనుమతి తీసుకున్నాను. గోల్కొండలోని మా కోట నుంచి మూసి నది మీదగా దేశాటనకి బయలదేరాను. అప్పటి దాక కోటలోనే ఉండి బయటి వ్యవహారాలు వినడమే కాని ఎన్నడూ చూడలేదు. అంతా కొత్తగా అనిపించింది. చీకటి పడే సమయానికి ‘చిచలం’ అనే ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి వెళ్ళాలి అనిపించింది, కానీ అక్కడ ఉన్న వారు నన్ను రానివ్వరు అని అర్ధం అయ్యింది. వెంటనే దేవాలయం వెనక భాగం వైపు వెళ్లి ఎవ్వరికి కనపడకుండా అక్కడ ఉన్న ఎత్తయిన గోడను దూకి లోపలికి ప్రవేశించాను. గోడల మీద చెక్కి ఉన్న శిల్పాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నా మనసుకి ఏదో తెలియని ప్రశాంతత దొరికింది. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాను. దేవాలయంలోని జనాలు అందరూ ఒక పక్కగా కూర్చొని దేనికోసమో ఎదురు చూస్తున్నారు. ఎవరికోసం ఎదురుచూస్తున్నారో తెలీదు. ఈ లోపు ఒక అందమైన యువతి అటుగా వచ్చింది. పెద్ద జడ, కాటుక కళ్ళు, సూర్యుడి లాంటి ఎర్రని బొట్టు, చేతికి గోరింటాకు, కాళ్ళకి గజ్జలతో ఎంతో సౌందర్యంగా ఉంది. తొలి చూపులోనే ఆమెతో ప్రణయంలో పడ్డాను. ఆ యువతి అక్కడే ఉన్న నాగేశ్వర స్వామి విగ్రహానికి దణ్ణం పెట్టుకొని నాట్యం చెయ్యడం ప్రారంభించింది. పౌర్ణమి వేళ, చల్లని గాలి నడుమ, నదీ తీర సమీపం లోని దేవాలయంలో ఆ యువతి చేసిన నాట్యం నేను ఎప్పటికి మర్చిపోలేను. నాకు తెలియకుండానే నా రెండు చేతులు ఎత్తి తనకి నమస్కరించాను. కానీ నాట్యంలో నిమగ్నం అయ్యి ఉండడం వల్ల తను నన్ను పట్టించుకోలేదు. అంతా బాగున్నప్పటికీ ఆమె ముఖంలో ఏదో తెలియని వెలతి కనిపించింది నాకు. ఎందుకో తెలీదు. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆ యువతి ఎవరో, ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి అనిపించింది. మరుసటి రోజు ఉదయం ఆ దేవాలయం సమీపం లోని ఒక వర్తకుడిని ఆ యువతి వివరాలు అడిగాను. అతడు “ఆ అమ్మాయి పేరు భాగ్మతి. వాళ్ళది దేవదాసీల కుటుంబం.” అన్నాడు. “దేవదాసి అంటే?” అని అడిగాను. “తమ జీవితాలని దేవుడికి అంకితం చెయ్యడం. బతికి ఉన్నన్నాళ్ళు దేవుడి సన్నిధానంలో నాట్యం చేస్తూ గడపడం. వాళ్ళు ఎవ్వరిని పెళ్లి చేసుకోరు.” అన్నాడు ఆ వర్తకుడు. ఆ మాటకి నాకు చాలా బాధ కలిగింది. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలి అనిపించి ఆ ప్రాంతం నుంచి బయలుదేరాను. మార్గమద్యంలో ఎవరో వ్యక్తి ఒక నల్లటి రగ్గు కప్పుకొని రహస్యంగా పరుగు తీస్తూ కనిపించింది. అతను బందిపోటు అయి ఉండచ్చు అన్న సందేహంతో వేగంగా ముందుకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నాను. ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. ఆమె, నేను ముందు రోజు రాత్రి దేవాలయంలో చుసిన యువతి, భాగ్మతి. నా నుంచి వదిలించుకొని పరుగు తీయడం మొదలు పెట్టింది. నేను ఆమె వెనకాల పరిగెత్తాను. నేను తన వెనకాలే రావడం చూసి తను ఆగింది. “ఎవరు నువ్వు? నా వెనకాల ఎందుకు వస్తున్నావ్?” అని అడిగింది. అది నాకు భాగ్మతితో మొదటి సంభాషణ. తొలి సంభాషణ లోనే అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదు. అందుకే నిజం చెప్పాను. “నా పేరు మొహమ్మద్ కులీకుతుబ్ షా. ఈ ప్రాంతానికి యువరాజును. దేశాటన చేస్తున్నాను”. వెంటనే భాగ్మతి తన రెండు చేతులు జోడించి తల వంచుకొని నించుంది. “నిన్న దేవాలయంలో నీ నాట్యం చూసాను. చాలా బాగుంది. తొలి చూపు లోనే నీతో ప్రేమలో పడ్డాను. కాని నువ్వు దేవదాసివి అని తెలిసి వెళ్ళిపోతున్నాను” అన్నాను. భాగ్మతి నా వైపు చూసింది. తన కళ్ళు తడిగా ఉన్నాయి. “ఏమైంది?” అని అడిగాను. “నాకు దేవదాసిగా ఉండడం ఇష్టం లేదు. అది మా నాయనగారికి చెప్తే ఆయన ఒప్పుకోలేదు. వేరే మార్గం లేక పారిపోతున్నాను” అని చెప్పింది. నాకు ఎం బదులు చెప్పాలో అర్ధం కాలేదు. ఈ సమస్యకి పరిష్కారం ఒక ప్రేమికుడిగా కంటే, ఒక భవిష్యత్తు రాజుగా ఆలోచించాలి అనిపించింది. రెండు నిమిషాలు ఆలోచించి, “ఈ క్షణం ఏ నేను నిన్ను ఇక్కడ నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోగలను. కాని ఈ ప్రాంతం వారంతా నీ మీద నమ్మకంతో ఉన్నారు. వాళ్ళని మోసం చెయ్యడం తప్పు. అలా అని నీ మనసుకి నచ్చని పని చెయ్యడం కూడా సరైంది కాదు. అందుకని ఊరి అందరి ముందు మీ నాన్నగారికి నీ మనసులోని మాట చెప్పు. ఈసారి నీ వెంట నేను ఉంటాను. దేవదాసి అనేది ఒక బాధ్యత మాత్రమే. నువ్వు ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నావు. నువ్వు కాకపోతే ఆ బాధ్యతని వేరే వారు తీసుకుంటారు. అందుకు ఊరందరిని ఒప్పిద్దాం. దానికోసం ఇలా పారిపోయి అందరిని బాధ పెడుతూ, నువ్వు బాధ పడడం సరైన పద్దతి కాదు. పద వెళ్దాం.” అని తనని నా గుర్రం మీద కూర్చోబెట్టి నేను పక్కనే నడవసాగాను. వాళ్ళ ఊరు చేరుకున్నాక అక్కడ అందరి ముందు భాగ్మతి తన మనసులోని మాట చెప్పింది. మొదట ఎవరూ ఒప్పుకోలేదు. కాని నేను యువరాజుని అని తెలుసుకున్నాక నా మాటని ఎవరూ కాదనలేకపోయారు. చివరికి చేసేది ఏమి లేక భాగ్మతి స్థానంలో ఇంకొక దేవదాసిని నియమించడానికి ఒక ఏడాది సమయం పడుతుందని, అప్పటి వరకు భాగ్మతి ఈ బాద్యతను స్వీకరించాలన్న నిర్ణయానికి వచ్చారు అందరూ. అప్పుడు భాగ్మతి నన్ను చూసిన చూపు ఎన్నడు మర్చిపోలేను. ఆ చూపు ధన్యవాద భావనతో చూసిన చూపు కాదు, ప్రేమ భావన కలిగిన చూపు. భాగ్మతి నన్ను ప్రేమించడం మొదలు పెట్టిన క్షణం అదే అని నాకు బలంగా అనిపించింది. ఆ సంఘటన తరవాత నేను తిరిగి గోల్కొండకి వెళ్ళిపోయాను. కాని, ఎదో ఒక కారణంతో ప్రతి వారం భాగ్మతిని కలిసేందుకు వాళ్ళ ఊరు వెళ్ళేవాడిని. తను నన్ను ప్రేమిస్తోంది అని తెలిసినప్పటికీ నేను బయటపడలేదు. అలా కొంత కాలం అయ్యాక, ఒక రోజు ఇక మనసులోని మాట బయటపెట్టాలి అని తలచి మా మధ్య ప్రేమ ప్రస్తావన తెచ్చాను. “భాగ్మతి, నువ్వంటే నాకు ఇష్టం. నేనంటే నీకు ఇష్టం ఉంటె, నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడిగాను. ఆ మాటకి భాగ్మతి సిగ్గుతో తల దించుకొని సిగ్గుపడుతూ, ‘ఇష్టమే’ అన్నట్టుగా తల ఊపింది. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “కానీ...” అని ఆగింది భాగ్మతి. “కాని? ఏంటో చెప్పు” అన్నాను. “నీది నాది వేరే మతం. పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా?” అని అడిగింది భాగ్మతి. ఇది మునపటి వలె చిన్న సమస్య కాదు పరిష్కరించడానికి. ఇద్దరి జీవితాలతో ముడి పడిన సమస్య. తన ప్రశ్నకి అర్ధం ఉంది. మా పెద్దలు మా ప్రేమని అంగీకరిస్తారు అన్న నమ్మకం నాకు కుదరలేదు. ”ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. ఇవాళే నేను మా నాన్నగారితో మాట్లాడుతాను” అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను. ఆ రోజు రాత్రి నాన్నగారితో భాగ్మతి గురించి చెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. “నువ్వు ఒక మాములు వ్యక్తివి కాదు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజువి. నువ్వు నలుగురికి మార్గదర్శకుడిగా ఉండాలి కాని నువ్వే ఇలాంటి పని చెయ్యకోడదు” అని సున్నితంగా మందలించారు. ఆ మాటలతో మా నాన్నగారు, నేను ఒక ధోరణిలో ఆలోచిస్తున్నాం అని అర్ధం అయింది నాకు. ఆయన అన్న మాటలు నిజమే. నేను నలుగురికి మార్గదర్శకుడిగా ఉండాల్సిన వాడిని. అందుకే హిందువు అయిన భాగ్మతిని పెళ్లి చేసుకొని మత కలహాలకి, కొట్లాటలకి తెర దించాలి అనుకున్నాను. కాని ఇదంతా నేను నాన్నగారికి అప్పుడు చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెప్పాలి అనిపించి నా మందిరంలోకి వెళ్ళిపోయాను. వర్షాకాలం వచ్చింది. ఆ ఏడాది కురిసిన వర్షాలకి మూసి నది పొంగింది. భాగ్మతి వాళ్ళ ఊరు దిగువ ప్రాంతం లో ఉంటుంది, దానితో ఆ వర్షాలకి వాళ్ళ ఊరు వరద నీటితో మునిగిపోయింది. నేను వెంటనే భాగ్మతి వాళ్ళ ఊరు వెళ్దాం అనుకున్నాను. మా కోట నుంచి ఎవరికీ కనపడకుండా బయటకి వచ్చి ఒక తెప్ప సహాయంతో ఉప్పొంగే మూసి నదిని దాటి భాగ్మతి వాళ్ళ ఊరు చేరుకున్నాను. ఊరి వాళ్ళందరూ నాగేశ్వర స్వామి దేవాలయంలో తల దాచుకున్నారు. ఎక్కువ సేపు అక్కడ ఉండలేరు అని అర్ధం అయ్యింది. అక్కడి అధికారులతో నేనే స్వయంగా మాట్లాడి అందరినీ సురక్షిత ప్రాంతానికి చేర్చాను. అల్లా దైవంలా ఎటువంటి ప్రాణ నష్టము జెరగలేదు. కానీ నేను రహస్యంగా కోట దాటడం, చిచలం వెళ్ళడం మా నాన్నగారికి తెలిసింది. నన్ను పిలిచి “ఎందుకు అలా చేశావు?” అని అడిగారు. “భాగ్మతి కోసం, తన మీద ఉన్న ప్రేమ కోసం” అని చెప్పాను. ఆయన నన్ను ఏమి అనకుండా ఏకాంత మందిరం లోకి వెళ్ళిపోయారు. రెండు రోజులు మా నాన్నగారు ఎవ్వరితోనూ మాట్లాడలేదు. మూడవ రోజు నన్ను ఆయన మందిరానికి పిలిచారు. “బాగా ఆలోచించాను. ఆ అమ్మాయి కోసం నీ ప్రాణాలని కూడా లెక్కచేయకుండా ముందుకి వెళ్ళావంటే ఆ అమ్మాయిని ఎంతగా ఇష్టపడుతున్నావో నాకు అర్ధం అయ్యింది. నువ్వు ఆ అమ్మాయిని వివాహం ఆడడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.” అని చెప్పారు. అలాగే, ఇక ఎన్నడూ వర్షాల కారణం గా అలా జెరగకుండా మూసి నది మీద నుంచి ఒక వంతెన కూడా నిర్మించారు. నేను చాలా సంతోషించాను. కాని అది తాత్కాలికమే. భాగ్మతి వాళ్ళ ఊరి వాళ్ళని ఒప్పించాలి. అలాగే మా బంధువులని కూడా ఒప్పించాలి. ఈ రెండూ అనుకున్నంత సునాయాసంగా జెరగలేదు. అల్లర్లు మొదలు అయ్యాయి. మా మతం వారు ఎవ్వరూ మా పెళ్లికి మద్దతు ఇయ్యలేదు. ఈ గొడవ అక్బర్ చక్రవర్తి దాక వెళ్ళింది. అక్బర్ చక్రవర్తి హిందూస్తాన్ మొత్తానికి బాద్షా. మాది ఆయన సామంత రాజ్యం. ఆయనని కలవమని నాకు వర్తమానం వచ్చింది. డిల్లి వెళ్లి ఆయన్ని కలిశాను. అప్పుడాయన ఉద్యానవనంలో, ఆయన ధర్మపత్ని అయిన జోధాభాయితో ఉన్నారు. అక్బర్ చక్రవర్తిని పెళ్లి చేసుకోక ముందు ఆవిడ రాజ్ పుత్ యువరాణి. అంటే హిందువు. నేను వెళ్లి వారిద్దరికి నమస్కరించి నించున్నాను. “నువ్వు ఎవరో హిందువు స్త్రీ ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నావ్ అని తెలిసింది.” అన్నారు అక్బర్ చక్రవర్తి. “ అవును మహారాజా. నేను భాగ్మతి అన్న హిందువు యువతిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి నాకు మీ అనుమతి కావాలి” అని చెప్పను. అక్బర్ చక్రవర్తి జోధాభాయి వైపు చూసారు. ఆవిడ ఒక చిరు నవ్వు నవ్వింది. అక్బర్ చక్రవర్తి కూడా నవ్వి, నా వైపు తిరిగి “నువ్వు నిశ్చింతగా ఆమె ని పెళ్లి చేసుకోవచ్చు. ఈ పెళ్లి హిందూ ముస్లింల సఖ్యతకి సహాయపడుతుంది. నీకు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము.” అన్నారు. ఆయన స్వయంగా మా పెళ్ళికి మద్దతు ఇస్తూ ఒక లేఖ రాసి నాకు ఇచ్చారు. వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను తిరిగి గోల్కొండ చేరుకున్నాను. మా తరుఫు నుంచి అక్బర్ చక్రవర్తి కరుణ వల్ల ఇంక ఎలాంటి ఇబ్బంది లేదు. భాగ్మతి వాళ్ళ ఊరివాళ్ళ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, వివాహం మాత్రం కొత్త దేవదాసి నియమం అయ్యాకే జెరగాలి అని కోరారు. నేను దానికి సమ్మతించాను. అలా మా ప్రేమ సఫలం అయ్యింది. ఇది వచ్చే తరాల వాళ్ళకి తేలికగా అనిపించచ్చు. కానీ మతం పేరుతో తలలు నరుక్కునే కాలంలో, ఈ ప్రేమ విజయం చారిత్రకమైనది. పెళ్ళికి ముందు భాగ్మతికి ఒక ప్రేమ కానుక ఇవ్వాలి అనిపించింది. ఎం ఇవ్వాలో అర్థం కాలేదు. మా పెళ్ళితో ఆ ప్రాంతంలో ఒక కొత్త సంస్కృతికి తెర లేవబోతోంది. దానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి కొత్త కళ తీసుకురావాలి అనిపించింది. అందుకని నా ప్రేమ కానుకగా, మూసి నది సాక్షిగా ఆ ప్రాంతాన్ని భాగ్మతికి అంకితం ఇచ్చాను. దానికి భాగ్మతి పేరు కుడా కలిసే లాగా పేరు పెట్టాను.” అని తన ప్రేమ కథని శిల మీద చెక్కిన తరువాత, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కుతుబ్ షాహి వంశానికి చెందిన ఐదవ రాజు, కులీకుతుబ్ షా. భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతి భాగ్యనగరం!