I am an atheist and i thank god for it -George Bernard Shaw
దలైలామ, గోగినేని బాబు గారు వీళ్ళిద్దరూ ప్రపంచంలో శాంతి వెల్లివిరియాలని కలలుకుంటు అందుకు తగిన పోరాటం చేస్తున్న యోధులు. వారిద్దరి దారులు వేరైనా కాని లక్ష్యం మాత్రం ఒక్కటే. భగవంతుడు ఉన్నాడా లేదా ఒకవేళ ఉంటే అది పరమశివుడా, జీసస్ హా అని కాదు ఇక్కడ సబ్జెక్ట్.. ఒక ఉన్నత విలువలున్న పూజారి, స్వామిజి, ఆధ్యాత్మిక ప్రభోదకుడి వల్ల ఈ సమజానికి ఎంత ఉపయోగం ఉన్నదో అందుకు భిన్నమైన వారి వల్ల కూడా అంతే ఉపయోగం ఉన్నది. ఒక రాజా రామ్మోహన్ రాయ్ గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు మన సంస్కృతిలో లోపాలు ఎత్తి చూపకుంటే ఇప్పటికి బాల్య వివాహాలు, సతీసహగమనాలు అంతర్గతంగా జరుగుతూ ఉండేవేమో. అలాంటి గొప్ప వ్యక్తులలో బాబు గోగినేని గారు ఒకరు. "నేను హేతువాదిని కాదు మానవతావాదిని" అని సమాజాన్ని ప్రేమిస్తూ తనదైన శైలిలో వ్యక్తులను చైతన్యం చేస్తున్న గోగినేని బాబు గారి గురించి కొంత తెలుసుకుందాం..
బాల్యం, అమ్మ నాన్నలు: 'మనకు ఊహ తెలిసి ఈ ప్రపంచం అంటే ఏంటి' అనే ఉత్సుకత చెలరేగినపుడు ఎవరైతే మనకు హీరోగా కనిపిస్తాడో, అలాంటి వ్యక్తిలా ఎదగాలనే లక్ష్యంగా బాల్యం నుండే కలలుకంటుంటాం.. అలా కరుడుగట్టిన హేతువాది ఐన ఎం.ఎన్ రాయ్ గారి పుస్తకాలను బాబు గారు పదవతరగతిలోనే చదవడం, ఆరోజుల్లో చిరంజీవి, బ్రూస్ లీ సినిమాల కన్నా ఎం.ఎన్ రాయ్ గారి మీద విపరీతమైన అభిమానం పెరగడంతో "ఇదే నిజం, భగవంతుడు అనేవాడు ఎవ్వరూ లేరు, జనం కేవలం తెలియని విషయాలకి దేవుడి శక్తి అని భ్రమపడుతున్నారు దీనిని ఎలా ఐనా రూపుమాపాలి ప్రపంచంలో శాంతి వెల్లివిరయాలని" సైన్స్ ఆధారంతో పోరాటం మొదలుపెట్టారు. గోగినేని బాబు నాన్నగారి మొదటి ఉద్యోగం తండ్రిగా తన ఒక్కగానొక్క కొడకుని ప్రయోజికుడిని చేయడం. ఆ తర్వాతే వ్యవసాయం చేసేవారు.
"మనమందరం ఒక ఏక కణ జీవి నుండి వచ్చాము. రెండు లక్షల సంవత్సరాల క్రితం ఒకే తల్లికి పుట్టిన మనుషలం మనం. తల్లి ఒక్కతే కాని తండ్రులు వేరు మైటోకాండ్రియా ఇదే చెబుతుంది. ఇంతకన్నా సైన్స్ ఆధారంగా నిరూపితమైన గొప్ప స్పిరిట్యూయల్ లైన్ ఉండదు కాబోలు -గోగినేని బాబు"
దిక్కుమాలిన సెంటిమెంట్స్: బాబు గారు నర్సరీ చదవకుండా డైరెక్ట్ గా రెండవ తరగతి చదువుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుండగా బాబు గారి పక్కన ఉన్న తోటి విద్యార్ధి "పేపర్ మీద చిన్నరాయి పెట్టి రాయి ఇదొక సెంటిమెంట్ ఇలా చేస్తే నువ్వు పాస్ అవుతావు" అని చెప్పాడట. నేను చేయను!! అని చెప్పి బాబుగారు మామూలుగానే ఎగ్జామ్ రాశారట. కట్ చేస్తే రిజల్ట్స్.. రాయి పెట్టి రాయనందుకు బాబు గారికి కు డబుల్ ప్రమోషన్ వచ్చేసి 4వ తరగతిలోకి వెళ్ళిపోయారు.. ఆ రెండో బాబు విస్తుపోయాడు!! ఈ సంఘటన బాబుగారి ప్రపంచంలో పెనుమార్పులు తీసుకువచ్చింది.
"ఈ జనం స్వతంత్రంగా ఎప్పుడు ఆలోచిస్తారు.? మరొకరు చెసిందే కాపి కొట్టడం తప్ప -రావిపూడి వెంకటాద్రి గారు"
నన్ను అరెస్ట్ చెయ్యమనండి చూద్దాం: అది ఇందిరగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సి విధించిన రోజులు.. అప్పుడు తనకు ఎదురితిరిగన వారిని అరెస్ట్ చేస్తున్నారు. గోగినేని బాబుగారిది స్కూల్ కు వెళ్ళే వయసు " అప్పుడు స్కూల్ కు వెళ్తు నన్ను అరెస్ట్ చేయమను చూస్తాను" అని స్కూల్ కు వెళ్ళడానికి ప్రయత్నించారట పువ్వు పుట్టగానే పరిమలిస్తుంది అనేమాటకి ఇదొక ఉదాహరణ.
"ఆనాడు ఆ బుద్దుడు తన సమస్థ రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళి బిక్షమెత్తుకుని ప్రజలలో ఆజ్ఞానాన్ని రూపుమాపితే ఈనాడు ఈ దొంగస్వామిజీలు పెద్ద పెద్ద రాజప్రాసాదాలను నిర్మించి అమాయక ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు. -బాబు గోగినేని"
ఉద్యోగం: మూడు సంవత్సరాల చదువుకన్నా పరీక్షల ముందు పదిరోజులు చదివిన చదువల్లే ఈ దేశంలో మార్కులు వేస్తున్నారు అనవసరంగా అంత సమయాన్ని వృధా చేయడమెందుకు అని డిగ్రీలో మైక్రో బయాలజీ పూర్తిచేసి అక్కడితో ఆపేశారు. అలాగే ఫ్రెంచ్, జర్మన్ లాంగ్వేజెస్ పూర్తిచేసి 20లలోనే టీచింగ్ మొదలుపెట్టారు. అలా లండన్ లో పదిసంవత్సరాల పాటు ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో టీచింగ్ ఇచ్చారు.. అక్కడి డాక్టర్ల కన్నా, లాయర్ల కన్నా 5రెట్లు ఎక్కువ వేతనం తీసుకున్నారు. హైదరాబాద్ లో "స్కిల్ గురు" అనే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దానితో పాటు ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ లాంటి లాంగ్వేజీలలో కూడా టైనింగ్ ఇస్తున్నారు. "రాజకీయ పార్టీలు ప్రజల పేదరికాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాలి, కాని ప్రజల మూడ నమ్మకాలను పెంచి పోషించడం కాదు - ఎం.ఎన్. రాయ్"
ప్రభుత్వాలను సైతం నిద్రలేపడం: భారతదేశంలో ఇన్ని వనరులు, ఇంత మేధ సంపద ఉన్నా కాని ఇప్పటికి మూడ నమ్మకాలు నదిలా ఒక తరం నుండి మరో తరానికి ప్రవహిస్తుందంటే దానికి కారణం ప్రభుత్వ విధానాలు కూడా. పుష్కరాల వల్ల పాప నాశనం కాదు చర్మ వ్యాధులు, అంటు రోగాలు ప్రభలుతాయి. పాపాల మాట తర్వాత సంగతి ముందు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోండి.. అని గళమెత్తడం దగ్గరి నుండి వేల కోట్లల్లో వ్యాపారం చేస్తు ఆదాయ పన్ను కట్టకుండా, ప్రజలను మానసికంగా కుంగదీసే జ్యోతిష్యులను విమర్శించేంత వరకు.. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిఒక్కరిని నేరుగా విమర్శిస్తూ, నిర్భయంగా అక్కడికే వెళ్ళి ప్రజల హృదయంలో ఉన్న మానసిక దౌర్భల్యాన్ని నిర్మూలించడానికి పోరాటం చేస్తుంటారు.
"టెక్నాలజి పెరుగుతున్న కొద్ది మనిషి తన నైతిక విలువలను మార్చుకుంటూ ఎదగాలి -బాబు గోగినేని"
అమ్మ గారు చనిపోయినప్పుడు: 2001లో బాబు గారి అమ్మ క్యాన్సర్ తో వ్యాధితో చనిపోయారు అప్పటికే విదేశాలలో ఉన్న బాబు గారు ఈ విషయం తెలుసుకుని హుటాహుటిగా ఇంటికి తిరిగివచ్చారు కాని అప్పటికే ప్రాణం పోయింది. ఆ తల్లి తన కొడుకుని చివరిసారి చూసుకోలేకపోయింది. అక్కడే కూర్చుని 'అమ్మ అమ్మ..' అంటూ ఏడవడం కన్నా అమ్మ శరీరం పూర్తిగా పాడవకముందే శరీర భాగాలను ఇతరులకు దానం ఇస్తే పోయిన ప్రాణం కొంతమంది జీవితాలను పొడిగిస్తుందని బాబు గారు గాంధీ, ఉస్మానియా, కామినేని తదితర హాస్పిటల్స్ కు ఫోన్ చేసి "అవయవాలు అవసరమైన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా మా అమ్మ గారు చనిపోయారు" అంటు తనంతట తానుగా ఎంక్వైరి మొదలుపెట్టారు. తనకు సహాయం చేసేందుకు మిగిలిన వారికి సహాయం పొందేందుకు ఒక సంధర్బం అనుకూలించింది. అలా కామినేని హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. అమ్మ శరీరంలోని ఒక కిడ్నిని హిందూ మతస్థునికి, మరో కిడ్ని ముస్లిం మతస్థునికి అమర్చారు. "నాకు మాత్రమే జన్మనిచ్చిన తల్లి కొంతమందికి కూడా ప్రాణం పోసింది, ఇందులో నేను భాగస్తుడనయ్యాను.. ఇదే నాకు తెలిసిన హేతువాద మానవవాద పద్దతి" అని మాటలతో కాదు చేతలతో జీవించే గొప్ప వ్యక్తి గోగినేని బాబు గారు.
"ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా మిత్రుడే, మూడాచారాలు పాటించి నాశనమవుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను.? - బాబు గోగినేని"
పాకిస్థాన్ మెడలు వంచి ప్రాణం కాపాడారు: పాకిస్థాన్ లో డా.యూనిక్ షేక్ అనే డాక్టర్ ఉండేవారు. ఒకసారి స్వేచ్ఛాయుతంగా "మనకు కాశ్మీర్ అవసరం లేదు" అని ఓ మీటింగ్ లో అన్నారట దానికి ఆగ్రహం చెందిన కొంతమంది వ్యక్తులు వీడు మహ్మద్ ప్రవక్త మీద దైవ దూషణకు తెగబడ్డాడు అని చెప్పి కేసు పెట్టారు. యూనిక్ షేక్ కు తెలుసు ఈ రాజ్యంలో ఎవ్వరూ తనని ఆదుకోలేరు.. అని చెప్పి ఒక మిత్రునికి బాబు గారి మేయిల్ అడ్రస్ ఇచ్చి తనను ఆదుకోవాలని విన్నవించారు. ఈ విషయం తెలుసుకున్న బాబు గారు మూడు సంవత్సరాల విపరీతమైన శ్రమతో 12దేశాల ప్రభుత్వాలను ఇన్వాల్వ్ చేసి పాకిస్థాన్ ప్రభుత్వ మెడలు వంచి ఆ డాక్టర్ ప్రాణాలు కాపాడారు. ఒక ప్రాంతం, ఒక మతం, ఒక జాతి అన్న తేడా మానవత్వానికి ఉండదు అనే తత్వానికి ఓ గొప్ప ప్రతీక ఈ సంఘటన.
"I am not against religion but When religion is against human rights I am against religion - బాబు గోగినేని"
శాంభవి కేసు: శాంభవి అప్పుడప్పుడే లోకజ్ఞానం తెలుసుకుంటున్న ఓ ఏడు సంవత్సరాల చిన్నిపాప. ఎక్కడో చుసి పూర్వజన్మలో నేను శాంభవి స్నేహితులం.. రెగ్యులర్ గా టెలిపతిలో మాట్లాడుకుంటామని ఆధ్యాత్మిక గురువు దలైలామ చెప్పిన మాటకు ఆమెను దేవదూత, దేవత అంటు ఆ పాప చుట్టు చేరి పాపను కొన్ని రకాల ఇబ్బందులకు గురిచేసేవారు. ఆ పాపలో తన కుతురిని చూసుకున్న బాబు గారు నంద్యాలకు వెళ్ళారు. ఈ భావ దారిద్ర్యం ఒక ఎత్తు ఐతే ఇది నిజం అని ప్రజలకు చెప్తున్న మీడియా ప్రచారం మరో ఎత్తు. అని ప్రజలలో ముడనమ్మకాలు పంచుతున్న మీడియాపై ఏకంగా పోలిస్ స్టేషన్ లో ఆధారాలతో సహా కేసు పెట్టారు. ఆ తర్వాత మీడియా కూడా నిజం తెలుసుకుని మారడం, అలాగే బాబు గారు కోర్టులో కేసు వేసి తీర్పు శాంభవి భవిషత్తుకు అనుకూలంగా వచ్చేంత వరకు పోరాడారు.
"నా దేశం గొప్పదేశం, నా దేశం చంద్రునిపై శాటిలైట్ ని పంపించింది. అంతటి గొప్ప దేశాన్ని చంద్రుని నీడ ను చూసి నా దేశ ప్రజలను భయపడేలా చేస్తున్నారు కొంతమంది జ్యోతిష్యులు - బాబు గోగినేని"
మనుషులు మారుతున్నారు: గ్రహణం రోజున గర్భం దాల్చిన మహిళలకు ప్రసవం జరిగితే బిడ్డ శారీరక లోపంతో పుడతాడని, గ్రహణ సమయంలో ఏదైనా తింటే మంచి జరగదని ఇలాంటి రకరకాల అపోహలున్నాయి.. ఇందులో ఏ మాత్రమూ వాస్తవం లేదని సైంటిఫిక్ ఆధారాలతో వివరిస్తు బాబు గారు గ్రహణం రోజు నాలుగు టీవి ఛానెళ్ళకు ఇంటర్వూలు ఇస్తున్నారు. అదే గ్రహణం రోజున దిల్ షుక్ నగర్ లో ఉంటున్న ఓ వ్యక్తి సోదరికి నొప్పులు మొదలయ్యాయి. హాస్పిటల్ కు తీసుకువెళ్దామనంటే కుటుంబ సభ్యులు వాద్దని వారించారట.. ఏం చేయాలో తెలియక అదే సమయంలో టీవిలో బాబు గోగినేని గారి ఇంటర్వూలు చూపించారట అప్పటి వరకు గ్రహణం అది ఇది అని మూడ నమ్మకాలతో ఉన్న కుటుంబ సభ్యులకు జ్ఞానోదయం కలిగి వెంటనే గర్భవతిని హాస్పిటల్ కు తీసుకెళ్ళడం, సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డ పుట్టడం జరిగిపోయింది.
"సత్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో ప్రమాదాలను దా టాల్సి ఉంటుంది - బాబు గోగినేని" "ప్రతి ఒక్కరు చెప్పే మాట విను, నా మాట కూడా విను కాని నీకు ఏది నిజమని మనస్పూర్తిగా అర్ధమవుతుందో దానిని ఆచరించు - గౌతమ బుద్దుడు"బహుశా ఈ ఆర్టికల్ ఓ వర్గం వారిని ఇబ్బందికి గురిచేసి ఉండవచ్చు.. బాబు గోగినేని గారు విమర్శించే వాటిని సమర్ధించుకోవడం కోసం కాదు, లేదా సమర్ధించుకోవడం కోసం కూడా కాదు. తనని విమర్శిస్తున్నా కాని వదిలేయక మనుషులపై ప్రేమ నింపుకుని తాను నమ్మిన నిజాన్ని ప్రజలకు తెలియజేస్తు వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే అతని నిజాయితీ కారణంగా ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. కృతజ్ఞతలు.