Contributed By Chandu machineni
అప్పుడే దర్శనం చేసుకుని గుడి నుంచి బయటకు వస్తున్న నాకు, దూరంగా చెట్ల మధ్య ఒక అమ్మాయి కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒంటినిండా రక్తపు మరకలు, చినిగిపోయిన బట్టలతో, కొన్ని సంవత్సరాల క్రితం నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపించింది.
•••••••••••• పౌర్ణమి రోజు రాత్రి అలా ఒంటరిగా నడుస్తున్న నేను, వెన్నెలలా కనిపించానేమో ఆ నలుగురుకీ నా వెంటపడ్డారు. వెక్కి వెక్కి ఏడవలేక, మూగబోయిన నా మాటలు.. " నవమాసాలు మోసిన తల్లి తెలియకపోయినా, నేను చనిపోయాక కలకాలం తన గర్భంలో దాచుకునే ఆ నేలతల్లి కూడా వెక్కిలిగా చూస్తూ ఒక పరుపులా మారిందే కానీ ఏమీ చేయలేకపోయింది ఆ క్షణాన.! "
నన్ను అనుభవిస్తున్న నలుగురు మూర్ఖులు, వారి కళ్లలో పైశాచిక ఆనందం, చేతికి అందనంత దూరంగా, కంటికి కనిపించి వెలుగునిచ్చే కొన్ని నక్షత్రాలు, చంద్రుడికి జాలేసిందేమో!! నన్ను చూసి మబ్బుల చాటున దాక్కున్నాడు. ••••••••••••
కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, ఎవరు కాపాడారో గుర్తులేదు. అనాథకి కూడా తెలియని రూపం తోడుగా ఉంటూ, అండగా నిలుస్తుందేమో!
అయినా అంత అర్థరాత్రి ఎవరుంటారు.? రూపం లేని దేవుడా! రూపాన్ని మార్చే మనుషులా!!
ఆ రోజు నుంచి గుడికి వెళ్ళడం ప్రారంభించా, అతను ఏదో వరాలు ఇస్తాడు, అడిగిన కోరికలు తీరుస్తాడు అని కాదు. ఒంటరిగా బ్రతికే ఈ అనాథకి ఆ గుడే ఒక గూడు, ఆ దేవుడే ఒక ఆప్తుడు అని. ఏదో తెలియని నమ్మకం, ఎంతో తెలియని అండ.. నన్ను నేను ఎదిరించి, పోరాడుతూ బ్రతుకుతున్నా!
అని నా మనసులో అనుకుంటూ అక్కడ ఉన్న అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాను. హాస్పిటల్ బయట ఆ అమ్మాయి తల్లిదండ్రులు, మన అమ్మాయి జీవితం అయిపోయింది, మన పరువు పోయింది అంటున్న మాటలు విన్న నేను, కని పెంచిన తల్లితండ్రులే పరువు పోయిందని మొహం చాటేసుకుంటున్నారు. బహుశా నాకు కూడా ' నా ' అనుకునే వాళ్ళు ఉంటే ఇలానే ఆలోచించే వారేమో! అని నాలో అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి..
అంటూ లోపల బెడ్ మీద పడుకొని ఉన్న వాళ్ల అమ్మాయిని చూస్తూ.. ఎవరు లేని నేనే ధైర్యంగా బ్రతుకుతున్నా, తనకి నా అనుకునే ఒక కుటుంబం, అండగా ఈ సమాజం ఉంది. ధైర్యం చెప్పే మీరే ఇలా కృంగిపోతున్నారు. అయినా తను మీకిప్పుడు బరువు కాదండీ! బాధ్యత.
ద్రౌపది కొంగు లాగారు కాబట్టే కురుక్షేత్రం జరిగింది. సీతని అపహరించారు కాబట్టే రామరావణుల యుద్ధం జరిగింది. ఆడదానికి అవమానాలు జరిగిన తర్వాతే కొన్ని యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి.
అంతలోనే స్పృహలోకి వచ్చి ఏడుస్తున్న తన దగ్గరికి వెళ్ళి, వింత జీవుల మధ్య బతుకుతున్న జీవితాలు కదా! మన జాతకాలు ఇంతే అనుకుంటున్నావా?
రాముని పాద ధూళితో రూపం పొందిన అహల్యలా, విముక్తి కోసం ఎదురు చూస్తున్నావా? చిన్నతనంలో దేనినైనా పట్టుకుని నిలబడాలి అనే ఆత్రుత ఉన్న నీకు, వయసొచ్చాక దేన్నయినా తట్టుకోవాలనే ఆత్రుత ఎందుకు లేదు.?
సమాజానికి ఆడది అంటే లోకువ అయిపోయింది, ఒక బలహీనత అయింది. ఆడ జన్మ... ఆట బొమ్మ కాదులే! ఆడది అందాల విందుకే కాదులే!! ప్రసవ వేదనను భరించి వేరొకరికి జీవితం ఇవ్వగలం. ప్రతి నెలా ఏ జీవి పొందని వరాన్ని మనం పొంది అనుభవిస్తున్నాం. కంటికి కనిపించని ప్రతి సమస్యతో పోరాడే మనకి, వేరొకడి తప్పు వల్ల మనమెందుకు మదనపడుతూన్నాం? వెలుగు చొరబడని చీకటిలో జరిగిన ఘటనను మరిచేలా మనసుపై యుద్ధం చేయలేమా! శోకాన్ని అణచుకుని జీవితాన్ని సరిదిద్దుకోలేమా!! అని తన బాధని తగ్గించి నా స్నేహాన్ని ఇచ్చే ప్రయత్నం చేసాను .
••••••••••••••• నేను చెప్పిన మాటలకి బరువు దించమంటూ రెప్ప జారిన కన్నీటి బొట్టు.. తన నీడను తననే వెతకమంటు పిలుస్తున్న వెలుగు, మాసమును బట్టి మారిపోయే ప్రకృతి జీవితవిధానంలా, మోసము జరిగిందని అక్కడే ఆగిపోకుండా వసంతంలో చిగురించు చిగురాకు వలె పది మందిని చైతన్య పరిచేలా తన జీవనాన్ని కొనసాగించడానికి మొదటి అడుగు వేసింది నాతో చెయ్యి కలుపుతూ...