అది 1998వ సంవత్సరం,మే నెల స్వాతంత్రానంతరం నుండి భారత దేశానికి పెద్దన్నగా అండగా ఉన్న సోవిఎట్ రష్యా విచ్చినం తరువాత ఏర్పడ్డ శూన్యత నుంచి భారత్ ఒంటరిగా ఎదిగేందుకు పోరాడుతున్న రోజులవి,ఆర్దిక వ్యవస్థని గాడిలో పెట్టి భారతదేశం దివాళా తీసే స్థితి నుండి తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయికి తీసుకొచ్చారు అంతకు ముందు ప్రధానిగా సేవలందించిన పీవీ నరసింహా రావు గారు.కానీ ప్రపంచ దేశాలు భారత్ తమ కనుసన్నలలో ఉండాలని,తమ అభీష్టాలకు,అభిప్రాయాలకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాయి,ఒక వైపు స్నేహ హస్తాలు అందిస్తూనే మరో వైపు భారత్ ని బలహీన దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.అగ్ర రాజ్యం అమెరికా భారతదేశం పైన నిఘా వేసి మరీ ఒక్కో కదలికని భూతద్దంతో చూస్తుంది.ఇంతటి క్లిష్ట సమయంలో భారత్ ఒక్క తప్పటడుగు వేసినా జరిగే పరిణామాలు ఊహాతీతం. క్లిష్ట సమయాలలోనే మనలోని ధైర్యవంతుడు బయటకి వస్తాడు అన్నట్లుగా, అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అమెరికా వంటి దేశానికి సైతం తెలియకుండా,ప్రక్రియ పూర్తయ్యే వరకు మూడో కంటికి కూడా తెలియనంత రహస్యంగా అణ్వస్త్ర పరీక్షలు జరిపింది భారత్.ఇది కేవలం అణ్వస్త్ర పరీక్షలు మాత్రమే కాదు,భారత దేశం తన ఆత్మ గౌరవాన్ని చాటిన సందర్భం.ఎంతటి క్లిష్టమైన పరిస్థితులలో అయినా భారత్ సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని,వేరెవరో వచ్చి తమ పై అధికారం చెలాయించలేరని ప్రపంచ దేశాలన్నిటికీ విన్పించేల కుండ బద్దలు కొట్టిన సందర్భం ఇది. అటల్ బిహారి వాజపేయి ప్రధానిగా తీసుకున్న అతి గొప్ప సాహసోపేతమైన నిర్ణయం ఇది.దేశ రక్షణ విషయంలో ఎవరి కట్టుబాట్లకు లొంగమని అగ్ర రాజ్యాలను సైతం ఎదురించిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు.
అది 1999వ సంవత్సరం,ఏప్రిల్ నెల మొదటిసారి మెజారిటీ నిరూపించుకోలేక కేవలం 13 రోజులకే ప్రభుత్వం కూలిపోయిన తరువాత,రెండవసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా భాద్యతులు చేపట్టారు వాజపేయి.రాజకీయ పరిస్థితుల వల్ల ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం నుండి వైదొలిగింది.వాజ్పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది,బలం నిరుపించుకోవాలంటే కావాల్సిన సంఖ్య 270.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు 269 మంది ఎంపీ లు ఉన్నారు,మరో ఒక్కరు లేదా ఇద్దరిని తమ వైపు ఆగితే ప్రభుత్వం నిలబడుతుంది,అధికారం ఐదేళ్ళు ఉండిపోతుంది,ప్రధాని పదవి లో ఉండిపోవోచ్చు.కానీ వాజ్ పేయి ఎటువంటి అనైతిక చర్యలకు తావివ్వలేదు,ఎవరితో సంప్రదింపులు జరపలేదు,ఎవరినీ బుజ్జగించనూ లేదు,పదవులు ఆశ చూపి తమ వైపు లాక్కోలేదు,డబ్బులు ఏర వేసి ఆకర్షించనూ లేదు.కేవలం ఒక్క ఓటు తేడాతో వాజ్ పేయి ప్రభుత్వం అధికారం కోల్పోయింది,ఆ అవిశ్వాస తీర్మానం సందర్భంగా అటల్ బిహారి వాజపేయి చేసిన ప్రసంగం చారిత్రాత్మకం.
మొదటి సందర్భంలో వాజపేయి ప్రధానిగా ఎంతటి శక్తి వంతుడో తెలిపితే, రెండవ సందర్భంలో వాజపేయి కేవలం రాజకీయ నాయకుడు కాదు రాజనీతిజ్ఞుడు అని రుజువు చేస్తుంది. భారత దేశ విముక్తి పోరాటంలో పాల్గొనడం తో మొదలైంది ఆయన ప్రజాజీవితం.స్వతంత్ర ఉద్యమ కారుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు వాజపేయి.1947 పంద్రాగస్టు రోజున తొలి ప్రధానిగా జాతినుద్దేశించి నెహ్రు చేస్తున్న ప్రసంగం వింటూ వాజపేయి కూడా ఊహించి ఉండరు పది సంవత్సరాల తరువాత అదే నెహ్రుతో కలసికూర్చొని చట్టాలు చేసే చట్ట సభలో ఉంటానని. వాజపేయి ఎంతటి గొప్ప వక్త అంటే ప్రపంచంలోనే అత్యుత్తమ వక్తలలో ఒకరిగా పేరున్న నెహ్రు ని సైతం మెప్పించెంత గొప్ప వక్త, వాజపేయి ప్రసంగాలను నెహ్రు సంపూర్ణ ఏకాగ్రతతో వినేవారు.
ఆయనలోని యోధుడు కేవలం స్వాతంత్రోద్యమం సమయంలోనే కాదు,నిర్బందాలు,అరాచకాలు హెచ్చు మీరిన ప్రతీసారి బయటకు వస్తాడు. స్వతంత్ర ఉద్యమ పోరాటం నుంచి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం దాక ఆయనలోని యోధుడి మరింత శక్తివంతుడిగా బలం పున్జుకుంటూనే ఉన్నాడు. కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల ఏకీకరణలో ఆయనలోని రాజకీయ చతురత కి మచ్చుతునక.కేవలం రెండు సీట్లకి పరిమితం అయిన భారతీయ జనతా పార్టీని అతి పెద్ద పార్టీగా మార్చి సుస్థిర సంఖ్యా బలం తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి తెసుకోచ్చారు వాజ్ పేయి. ఒక వైపు దాయాది పాకిస్తాన్ తో శాంతి చర్చలకి చోటు కల్పిస్తూనే దేశ రక్షణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కార్గిల్ యుద్ధం ద్వారా తెలియజేసారు.
పార్టీల సిద్దంతాలు వేరుగా ఉండొచ్చు,అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కాని అవి ప్రభుత్వ విధానాలకి,అభివృద్దికి నిరోదకాలుగా ఉండకూడదని బలంగా నమ్మి ఆచరించిన వ్యక్తి వాజ్ పేయి. దేశ గతిని మార్చి ప్రగతి పధాన పయనిన్చేలా చేసిన జాతీయ రహదారుల విస్తరణ,విద్యా అందరికీ అందాలనే ధ్యేయంతో మొదలైన సర్వ శిక్ష అభయాన్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది వాజ్ పేయి గారే. కాంగ్రెసేతర ప్రధానిగా ఐదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మొదటి ప్రధాని ఆయన.ప్రధానిగా ఆయన సింహాసనం మీద కూర్చున్నా ఆ పదవి తలపై ముళ్ళ కిరీటంగానే భావించారు.
కేవలం ప్రధానిగా మాత్రమే కాదు,సాహిత్య రంగానికి విశేషంగా సేవలు అందించారు వాజ్ పేయి,ఆయనో గొప్ప కవి.బహుముఖ ప్రజ్ఞాశాలి.మహా వక్త,ఎటువంటి విషయం పైనైన అనర్గళంగా మాట్లాడగలగడం ఆయన ప్రత్యేకత. అటల్ బిహారి వాజపేయి,భారత దేశం చూసిన అత్యుత్తమ ప్రదానులలో ఒకరు,భారత ప్రజలు మెచ్చిన నాయకులలో ఒకరు.ప్రతిపక్షాలు,ప్రత్యర్ధులు సైతం గౌరవించే అత్యున్నత వ్యక్తి.యువ రాజకీయ నాయకులకి మార్గదర్శి.
అలుపెరుగని బాటసారిగా సుదీర్ఘమైన ప్రయాణం చేసి అజాత శత్రువుగా అందరి ప్రేమను పొంది, జన్మనిచ్చిన దేశానికి శక్తి వంచన లేకుండా సేవలందించి, నవ భారత నిర్మాణంలో తన పాత్రను సమర్ధవంతంగా పోషించి, ఎందరికో ఆదర్శంగా నిలిచి,ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొని తన ప్రయాణాన్ని ముగించిన వాజపేయి గారు మనందరికీ చిరస్మరనీయులు.