సినిమా అంతా ఐపోయింది .. రోలింగ్ టైటిల్స్ మొదలు అయ్యాయి .. సినిమా మొదట్లో చూపించిన ఇంట్లో బంధించబడ్డ వాళ్ళు క్లూ కనుక్కుని ఇంట్లోంచి మొత్తం మీద బయట పడ్డారు .. " వాళ్ళు మళ్ళీ ఏదైనా చేస్తే " అంటాడు కానిస్టేబుల్ సుదర్శన్ .. " బ్రతకడం తెలిసినోడికి నరకడం నచ్చదు " అంటాడు నీలాంబరి .. అంటే బ్రతుకు విలువ తెలిసిన ఎవ్వరికైనా మరోకడిని చంపాలి అనిపించదు అని .. మహానంది గారి వీర రాఘవరెడ్డి - ఇతని పయనం - పోరాటం అంతా అదే .. తన ప్రత్యర్దులకి ' బతుకు ' తాలూకు విలువ చూపించాలి అని
ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ (త్రివిక్రమ్) - ఈ సినిమా ద్వారా ఇతని ఆరాటం కూడా అదే .. ' బతుకు ' యొక్క గొప్పతనం అర్ధమయ్యేలా చెప్పాలి జనాలకి అని ..
అందుకే సినిమాలో అతిపెద్ద పోరాట దృశ్యం సినిమా మొదట్లోనే పెట్టేసాడు ఈ డైరెక్టర్ .. యుద్దం ముగిసిన తరవాత మిగిలే రోదన , వేదన గురించి చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి ఇరవై నిమిషాల్లోనే యుద్ధం , దాని పర్యవసానాలు చూపిస్తూ సాగాడు .. కళ్ళ ముందే కన్న తండ్రిని చంపేస్తే శత్రువు మీద పగ తీర్చుకోవాలి అని రక్తం మరుగుతున్నా .. అతని అడుగు శాంతి వైపే పడింది .. దానికి కారణం అతని పన్నెండేళ్ళ లండన్ చదువా ? కాదు కాదు .. కొమ్మద్ది లో నారపరెడ్డి దగ్గర పని చేసే శివయ్య గాడి పెళ్ళాం నాగమణి - ఆమె యొక్క ఆరు నెలల కడుపూ .. అతను మారడానికి కారణం .. ఇంటినిండా ముండ మోశారు ఆడోళ్ళు అన్న అతని అత్త దీనికి కారణం .. యుద్ధం లక్షణం అంటూ లోపం గురించి గుర్తు చేసిన అతని జేజి కారణం .. అన్నిటినీ మించి అతను ఇష్టపడ్డ అరవింద కారణం .. ఆ పరిస్థితి నుంచి .. వైలెన్స్ అనేది తమ ప్రాంతం మీద రుద్దబడ్డ ఒక అత్యవసర పరిస్థితి అని అర్ధం అయ్యేలా చెప్పడం వరకూ ఎదుగుతూ వచ్చాడు వీర రాఘవ .. ఎట్టా మారుస్తావ్ రెడ్డీ అన్న బసిరెడ్డి ప్రశ్నకి .. ఇట్టా మారుస్తా అని సమాధానం ఇస్తూ ఎదిగాడు రాఘవ .. అతను అడగని , అతనికి తెలియని , అతనెప్పుడూ చూడను కూడా చూడని ఒక యుద్ధం లో చిక్కుకున్న యువకుడు .. తనని తాని త్యాగం చేసుకుంటూ యుద్ధాన్నే ఆపిన తీరుని త్రివిక్రమ్ చూపించిన విధానానికి ఎవ్వరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే .. ఫాక్షన్ సినిమాలు అంటే కడప , కర్నూలు , అనంతపూర్ , చిత్తూర్ ఆ మొత్తం రాయలసీమ ఒక డేంజర్ జోన్ గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది .. ఎవ్వరూ ఊహించని ' సొల్యూషన్ ' పాయింట్ ని తీసుకుని చాలా చాకచక్యంగా , సున్నితంగా తెరమీద ఆవిష్కరించాడు త్రివిక్రమ్ .. అజ్ఞాతవాసి లాంటి సినిమా తీసి విపరీతంగా బ్యాక్ ఫైర్ అందుకున్న త్రివిక్రం మళ్ళీ calendar year తిరగకుండానే తన సత్తా ఏంటో ఇంత గొప్పగా నిరూపించుకున్నాడు .. ఒక్క సన్నివేశం మాత్రం నన్ను విపరీతంగా కదిలించింది ..
కొమ్మద్ది - నల్ల గుడి మధ్యలో తెప్పలేరు వంతెన దగ్గర యుద్ధం మొత్తం ముగిసింది .. చుట్టూ శవాలు - రక్తం - తన వాళ్ళలో దాదాపు అందరూ చనిపోయారు .. రాఘవ తండ్రి శవం కారులో అలా పడి ఉంది .. డోర్ రాకపోవడం తో విసిరి అవతల పడేసి రాఘవ కారెక్కి తండ్రి పక్కన కూర్చున్నాడు .. పన్నెండేళ్ళ తరవాత లండన్ నుంచి తిరిగొచ్చిన అతనికి ఇరవై అంటే ఇరవై నిమిషాల్లో తండ్రి ని ఇలా చూడాల్సి వస్తుంది అని ఇన్నేళ్ళ లో అతనెప్పుడూ ఊహించుకుని కూడా ఉండడు .. ప్రాణం విలువ అమితంగా తెలిసిన ఆ కుర్రాడికి - ప్రాణానికి ప్రాణం ఐన తండ్రి పక్కన ప్రాణాలతో లేడు అనే బాధ ఎలా చెప్పుకోవాలో కూడా అర్ధం కాక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు .. ఇంటికెళ్ళాలి - అమ్మ దగ్గరకి, జేజి దగ్గరకి, ఊర్లో జనాల దగ్గరకీ నాన్న శవాన్ని తీసుకెళ్ళాలి - పడిపోకుండా సీటు బెల్ట్ పెడతాడు ఎన్టీఆర్ - అప్పుడు ఒక్కసారిగా నాకు ఒళ్ళు ఝాలధరించింది - హరి కృష్ణ గారు గుర్తొచ్చారు .. సీటు బెల్ట్ మీదనే ఉండిపోయింది మనసంతా ..
జీవితం ఎంత యాదృచికమో కదా అనిపించి కంట్లో నీళ్ళు తిరిగాయి .. రం .. మరణం .. గెలవం .. ఎవరం ...