This Touching Story Of An Artist Who Designed His Own Life With His Talent Is Inspiring AF!

Updated on
This Touching Story Of An Artist Who Designed His Own Life With His Talent Is Inspiring AF!

అది 2009.. హైదరాబాద్ మదాపూర్ లోని ఒక కంపెనీలో జాబ్ చేస్తూ, అవకాశాలు వెతుక్కుంటూ తనకెంతో ఇష్టమైన ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటుడుగ ఎదుగుదామని నెల్లూరు నుండి హర్ష సిటీకి వచ్చాడు. ఇంటర్వూ ముగిసింది బయటకు వచ్చి ఆటో కోసం ఎదురుచూస్తుండంగా pajero sport car బండి వచ్చి ఆగింది.. చూస్తే అందులో అందరూ 40 నుండి 50 వయసులో ఉన్న మహిళలు, ఫుల్ గా మందు తాగి ఉన్నారు. హర్షను కార్ లోనికి లాగి రా పదా.. భయపడకు డబ్బు కూడా ఇస్తాంలే ఉంటు అతనిని అందులోకి లాగుతున్నారు. హర్షకు చాలా ఇబ్బందిగా ఉంది.. చేతిలో ఉన్న ల్యాప్ టాప్ బ్యాగును కూడా వారి నుండి తీసుకోక అక్కడి నుండి దూరమయ్యాడు. ఇక్కడ ఒక మామూలు వ్యక్తి ఉండేదుంటే ఇంతకన్నా ఇంకేం అదృష్టముంటుంది అని ఎగేసుకుంటూ వెళ్ళేవాడేమో కాని ఒక లక్ష్యం, జీవితం పట్ల ఒక నిర్ధిష్ట ఆలోచన ఉన్న వ్యక్తి తన లక్ష్యం నుండి దూరంగా వెళ్ళలేడు. ఒకవేళ హర్ష ఆరోజు వారితో పాటు వెళ్ళేదుంటే ఈరోజు ఇలా ఎదిగేవాడే కాదు, మనం ఇలా మాట్లాడుకునేవాళ్ళమే కాదు. "ఒక వ్యక్తికి టాలెంట్ ముఖ్యం కాని సర్టిఫికెట్స్ కాదు" అని తన జీవితాన్ని తానే అందంగా గీసుకున్న ఆర్టిస్ట్ హర్ష కథ ఈరోజు.

మంచి నటుడు అవ్వాలనుకున్నాడు: హర్ష చిన్నప్పటి నుండి మంచి ఆర్టిస్ట్ యే కాని దానిని కేవలం హాబి గానే పరిగణించాడు తప్ప దానినే కెరీర్ గా ఊహించుకోలేదు. ఎప్పటికైనా గొప్ప నటుడు కావాలని చెప్పి ఎంతో తపించాడు. ఆ ఉద్దేశంతోనే హైదరాబాద్ కు వచ్చి రామోజి ఫిల్మ్ సిటి దగ్గరి నుండి అన్నపూర్ణ స్టూడియో వరకు దాదాపు అన్ని స్టూడియోల చుట్టు తిరిగి, వ్యక్తులను కలిసి అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాని అది ఎంత మాత్రము అనుకున్న ఫలితాన్ని తీసుకురాలేకపోయింది.

ఆ వ్యక్తి అభినందన జీవితాన్నే మార్చివేసింది: ఒకరోజు మనుషుల హావభావాలను పరిశీలించడం కోసం ఎం.జి.బి.ఎస్ బస్టాండ్ లో కూర్చున్నాడు. అక్కడే హర్షకు ఓ పెన్సిల్ ముక్క కనిపించింది ఏదో అలా కాలక్షేపం కోసం అని చెప్పి అక్కడే ఉన్న ఒక వ్యక్తి బొమ్మను గీయడం మొదలుపెట్టాడు, పూర్తిచేసిన ఆ బొమ్మను తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆశ్చర్యం!! ఎంత అద్భుతంగా గీశావు బాబు నా బొమ్మను.. నా శరీరం మాత్రమే కాదు ఇందులో నా ఆత్మ కూడా కనిపిస్తుంది, జీవం కనిపిస్తుంది.. అంటూ పరవశించి అతని దగ్గరున్న 300రూపాయలను కానుకగా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దారి తెలియక కొట్టు మిట్టాడుతున్న హర్షకు ఆ వ్యక్తి మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చి, తన జీవితానికి దిశ నిర్ధేశం చేశాయి. అంతే ఇక అక్కడి నుండి ముంబయ్ కి వెళ్ళి సముద్ర తీరంలో దేశ, విదేశి పర్యాటకుల బొమ్మలు గీసి అక్కడే రాటుదేలాడు. స్వతహాగ పేయింటింగ్స్ లో ఏ కోర్స్ నేర్వని హర్ష ఆ సముద్ర తీరన్నే అద్భుత పాఠశాలగా భావించి తన ప్రతిభను మరింత సానబెట్టాడు.

"నువ్వు షూ పాలిష్ చెయ్యడానికి కూడా పనికిరావు": ముంబయ్ లో కొంతకాలం గడిచాక మన హైదరాబాద్ కు తిరిగివచ్చి ఇక్కడే ఓ స్కూల్ లో పిల్లలకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తన దగ్గర సర్టిఫికెట్ ఉన్నవారికన్నా సంబ్రమాశ్చర్యాలకు గురిచేసే ప్రతిభ ఉన్నా కాని ఆర్టిస్ట్ గా సర్టిఫికెట్ లేకపోవడంతో చాలా చులకన పదాలతో అతనిని ఇబ్బందిపెట్టేవారు. ఒకసారి ఢిల్లి పబ్లిక్ స్కూల్ లో క్లాస్ తీసుకుంటుండగా ఒక స్టూడెంట్ నేరుగా హర్షనే "నువ్వు బూట్ పాలిష్ చేయడానికి కూడా పనికిరావు" అంటూ కించపరిచేసిందట.. ఇలాంటి సంఘటనలు కేవలం విద్యార్ధుల నుండే కాదు తన కన్నా వయసులో పెద్దవారైన కొంతమంది పొగరుబోతు ఆర్టిస్టుల నుండి కూడా ఎదురయ్యింది. ఇంకొకడైతే వారి మీద పగను, కోపాన్ని పెంచుకునే వారేమో, లేదంటే తనని తను నిందించుకునే వారమో కాని "విజేత" మాత్రం అలాంటి వారి నుండే ఎక్కువ స్పూర్తి పొందుతాడు. అప్పుడు హర్షకు వారిని బాధ పెట్టాలని కాదు తన ప్రతిభను రుచి చూపించాలనుకున్నాడు.

గిన్నిస్ రికార్డ్: ఏదైనా ఎవ్వరూ చేయని దానిని చేసిన వారికే గొప్ప పేరు లభిస్తుంది. అలా ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయని విధంగా 24 గంటలు ఆపకుండా బొమ్మలు గీద్దామని నిర్ణయించుకున్నాడు హర్ష. అనుకున్నట్టుగానే దాని కోసం ఎంతో ప్రాక్టిస్ చేసి 24 గంటల పాటు (6 నిమిషాలు ఒకసారి బ్రేక్ తీసుకున్నారు, అది కూడా వాష్ రూమ్ కోసం) ఆపకుండా 507 పేయింటింగ్స్ గీసి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఎవరైతే తనకు ఆర్టిస్ట్ గా సర్టిఫికెట్ లేదని కించపరిచారో ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలిసేలా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుని వారి దగ్గరున్న దానికన్నా గొప్ప సర్టిఫికెట్ ను గెలుచుకున్నాడు.

తదుపరి రికార్డ్: 24గంటలపాటు ఆపకుండా బొమ్మలు గీసిన హర్ష ఇప్పుడు తన రికార్డ్ ను తానే బద్దలు కొట్టే రికార్డ్ కోసం ప్రాక్టీస్ ను మొదలుపెట్టారు. 2018 లండన్ వేదికగా జరిగే ఓ కార్యక్రమంలో ఆగకుండా 24గంటలు డాన్స్ చేస్తు బొమ్మలు గీయబోతున్నాడు. వినడానికే ఇది కష్టంగా ఉన్నా దీనిని ఎంజాయ్ చేయడానికి మన హర్ష మాత్రం ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు.

చిన్నప్పుడు తోటి మిత్రులను, టీచర్లను ఇంప్రెస్ చేయడాని కోసం ఉపయోగపడిన ఈ టాలెంట్ ఇప్పుడు తనకో జీవితాన్ని ఇచ్చింది, తనకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సెలబ్రీటీలతో పాటు సామున్యుల బొమ్మలు గీస్తూ ఇప్పుడు తనకి వృత్తి జీవితం దొరికింది. అగ్గిపుల్ల, కత్తి, ఇయర్ బడ్స్ ఇంకా మీరు ఏ వస్తువునైనా ఇవ్వండి దానితో నేను అందమైన బొమ్మలను రివర్స్ లోను గీయగలను అని ఆనందంగా చెబుతున్న హర్ష తన జీవితాన్ని కూడా తానే అందంగా గీసుకుంటున్న శిల్పి.