2-3-1999 “ప్రమీల... పెళ్లి కి ఒక రోజు ముందు వచ్చాడెంటే నీ కాబోయే పెనివిటి, ఇంతకీ జరుగుతున్నది అతని పెళ్లి అని తెలుసా తెలిదో చెప్పవే... వెళ్లి ఓ మాట చెప్పొస్తా”..అన్న రంగమ్మత్త మాట విని అందరు నవ్వుకుంటుంటే..నేను మాత్రం ఆయనని చూడాలని కలిసి ఇంకా చదువుకోవాలి అని ఉందని చెప్పాలని ఎదురు చూస్తున్న, మా నాన్న కి మిలిటరీ వాళ్ళంటే చాలా ఇష్టం, గౌరవం. నాలో కుడా చిన్నపట్నుండి ఆ గౌరవాన్ని పెంచారు. అందుకే మిలటరీ వాళ్ళ సంబంధం వస్తే ఎంత మంది చెబుతున్న వినకుండా... ఖాయం చేసారు. నేను కుడా అతన్ని చూడలేదు, ఎం.ఎ పూర్తయ్యాక చేసుకుంటా అని చెప్దామని ఒక పక్క అనిపిస్తున్నా... నాన్న నమ్మకాన్ని చూసి సరే అన్నాను. ఫోటోలో చూసినంత వరకు ఆయన అందగాడే పేరుకి తగ్గట్టు అర్జునుడే... మిలటరీ లో కల్నల్ గా పనిచేస్తున్నారు.
ఇలా వాళ్ళ నవ్వులో వాళ్ళు, నా ఆలోచన లో నేను ఉంటె... ఇంతలో పెళ్లికొడుకు వాళ్ళ అక్క వచ్చింది. ఎవరికీ వినపించకుండా నా చెవిలో “మేడ మీద నా తమ్ముడు నీకోసం ఎదురుచూస్తున్నాడు, నీతో ఏదో మాట్లాడాలి అంటా...” అని పైకి మాత్రం “ తులసి కోట కి నమస్కరించుకుందాం రా ప్రమీల” అని తీసుకువెళ్ళింది.
లోపల తనని చూస్తున్న అనే సంతోషం ఉన్న... పైకి సిగ్గు పడుతూ... వద్దు అంటూ మేడ వైపుకి అడుగులు వేసాను. ఎదురుగా ఆయన అందంగా హుందాగా హీరో లా ఉన్నారు. ఏం మాట్లాడాలో తేలికా మౌనంగా ఉన్న నన్ను చూసి “మీ ఎం.ఎ పరిక్షలకి బాగా ప్రిపేర్ అవుతున్నారా” అని అడిగారు. ఇలాంటి ప్రశ్న వస్తుందని అనుకోలేదు కాబట్టి తడపడుతూ “హా..” అని చెప్పి ఊరుకున్నాను. “సారి.. ఇలా సంబంధం లేకుండా మాట్లాడుతున్నందుకు.. నేను పెద్దగా చదువుకోలేదు, నా భార్య అయినా బాగా చదువుకోవాలి అని తన కాళ్ళ మీద తను నిలబడాలి అని నా కోరిక అందుకని మొదట గా అది అడిగా. ఇక సూటిగా విషయానికి వస్తా.. 17 ఏళ్ళు వచ్చిన వెంటనే మిలటరీ లో చేరా అప్పట్నుండి అదే నా ప్రపంచం. పుట్టినందుకు నలుగురికి సాయం చేయాలి. నలుగురి చేత మంచి అనిపించుకోవాలి అనేది నా అభిమతం. కొన్ని కోట్ల మంది హాయి గా నిదురపోవడానికి కారణం అయిన వేళ్ళ మందిలో నేను ఒక్కడ్ని అని అనుకున్నప్పుడల్లా నాకు సంతోషంగా ఉంటుంది, కాని ఇక్కడ మా అమ్మ నాన్న లని తలుచుకుంటున్నప్పుడల్లా.. బాధ, వాళ్ళు ఎలా ఉన్నారో అనే భయం. ఒక్కడ్నే కొడుకుని కదా పైకి నవ్వుతున్న వాళ్లకి నేనెలా ఉన్నానో అనే దిగులు ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఆనందించే విషయం ఒక్కటి చేయలేదు నా పెళ్లి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందని ఒప్పుకున్నా. కాని నా గురించి నీకు తెలియాలి ఎందుకంటే ఈ పెళ్లి వల్ల నువ్వు నా ప్రపంచం లో కి వస్తున్నావ్. ఆ ప్రపంచం లో నేను నీతో కన్న శత్రువుల తోనే ఎక్కువ ఉంటానేమో... పెద్ద యుద్ధమే జరగబోతుంది అనే సంకేతాలు వస్తున్నాయి. ఈ యుద్ధం ఎందరో వీరులని బలి తీసుకోవచ్చు అందులో నేను ఉండచ్చు. అందుకే గుండె ధైర్యం కల స్వంతంత్ర భావాలు ఉన్న అమ్మాయి నా భార్య గా రావాలి అని కోరుకున్న అనుకున్నట్టే నువ్వు కలిసావ్. నీ నుంచి నా కోక భరోసా నమ్మకం కావాలి నా మీద ఆధారపడిన అమ్మ నాన్న ఆసరాగా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ నాకు తోడూ గా ఉంటావా? ఐ లవ్ యు కన్నా నేనున్నా అనే ఒక మాట నాకెంతో బలాన్నిస్తుంది, ఆ బలం నాకిస్తావా. లేదు అంటే నేనేమి అనుకోను. నాకే ఈ పెళ్లి ఇష్టం లేదని చెపుతాను".
ఆయన చెప్పింది విన్నాక నా లో నేను కాసేపు మాట్లాడుకుని ఇలా బదులిచ్చా... “కాసేపట్లో పెళ్లి, ఇవి మీరు చెప్పవలసిన అవసరం లేదు కాని నా ఇష్టానికి, స్వతంత్రానికి కుడా ప్రాధాన్యతని ఇచ్చారు. ఈ ఒక్క విషయం చాలండి మీరు మంచి వారని.. మనసున్న వారని అర్ధం చేసుకోవడానికి. మా నాన్న కి మిలటరీ వాళ్ళంటే చాల ఇష్టం కాని ఆయన అవ్వలేకపోయారు. ఆయన నాకెప్పుడు ఒకటి చెప్పేవారు, దేశానికి తోడూ గా ఉండేవారికి, తోడూ గా నిలిచే అవకాశం వస్తే కాదనకమ్మ అది వరం, నీ ఐదో తనమే అతనికి రక్ష గా నిలుస్తుందని. ఆ మాటని నేను మనసారా నమ్ముతాను. మీరు ప్రేమించే దేశం లో ఉన్న నేను ఈ దేశమంతటి ప్రేమని మీకిస్తూ మీకు తోడుగా ఉంటాను. మీరు ప్రశాంతంగా గర్వంగా ఈ దేశానికి సేవచేసుకోండి. కాని మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ని మీకోసం నేనున్నాని గుర్తుపెట్టుకోండి.” అని చెప్పాను.
“అంటే నన్ను నీ పెనివిటి గా ఒప్పుకున్నట్టే కదా” అని ఆయన సన్నగా నవ్వుతూ అడిగితే.. బిడియంగా అవును అన్నాను. అలా గంభీరంగా సాగిన మా సంభాషణ మధ్యలో చిరునవ్వుల సడి అలలా తాకింది.. ఊరంతా అతిధులు గా మా పెళ్లి ఘనంగా జరిగింది. కొన్ని రోజులకే ఆయన బోర్డర్ కి బయలుదేరారు. నా పరిక్షలు బాగా రాసాను. నేను చదివిన కాలేజ్ లో నే ఉద్యోగం వచ్చింది. అమ్మ నాన్న, అత్త మామ లని చూసుకుంటూ. ఆయన ఫోన్ కోసం ఎదురుచూస్తూ.. వచ్చినప్పుడు మాట్లాడిన మాటల ఊసులతో తర్వాతి ఫోన్ కోసం నిరీక్షిస్తూ... గడిపాను.
కొన్ని నెలల తర్వాత యుద్దం జరుగుతోంది అని వార్తలు వచ్చాయి . అందరు కంగారు పడ్డారు కాని నేను నాలో ఏ చిన్ని ప్రతికూల భావాన్ని రానివ్వలేదు. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం అందరికి ధైర్యం చెప్పుతూ ఆయన వస్తారని గట్టిగా నమ్మాను. బహుశా ప్రేమంటే ఇదేనేమో. నెలలు గడిచాయి యుద్ధం లో గెలిచామన్న కబురొచ్చింది, ఆయన వంటినిండా గాయాలతో పెదవుల పై విజయ గర్వం తో తిరిగొచ్చారు. అప్పటి వరకు నా లో ఉన్న ధైర్యం కరిగి కంటి భాష్పాలు గా కురిసి గట్టిగా కోగిలించుకున్నాను. ఆ క్షణం దేశం కోసం సరిహద్దు లో పోరాడుతున్న ఎందరో వీరులని, ఆనందంగా పంపుతూ ప్రేమతో తన పెనివిటికి రక్షగా నిలవాలని తమ మేడలో పసుపు తాడు కట్టించుకున్న ఎందరో తల్లులని గర్వంగా తలుచుకుంటూ, ఆయన నుదిటిన తిలకం దిద్ది స్వాగతించాను.