The Meaning Behind This 'Annamayya Sankeerthana' Is Beyond Beautiful

Updated on
The Meaning Behind This 'Annamayya Sankeerthana' Is Beyond Beautiful

Contributed by Sree Prasanna Nedunuri బ్రహ్మోత్సవం... ప్రతి సంవత్సరం ఆ కొండలరాయునికి జరిగే విశేష ఉత్సవం. ఈ బ్రహ్మోత్సవాలు కోయల్ ఆళ్వార్ తిరుమంజనంతో మొదలు అయ్యి చక్రస్నానంతో పూర్తి అవుతాయి . అంకురార్పణ, ధ్వజారోహణం,వాహనసేవలు,ధ్వజావహారోహణం వంటి క్రతువులు దీనిలో భాగం.అధిక మాసం వచ్చిన సంవత్సరం లో వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారు. బ్రహ్మ ముందుండి జరిపించే ఆ బ్రహ్మాండనాయకుని ఉత్సవాలు మీద అన్నమాచార్యులు రాసిన అద్భుత సంకీర్తన మరియు దాని అంతరార్థం ఇది...

పల్లవి: తిరువీధుల మెరసీ దేవదేవుడు | గరిమల మించిన సింగారములతోడను || తిరుమలాధీశుని ఆలయం చుట్టూ వున్నా వీధులను మాడవీధులు అంటారు. అవి అతి పవిత్రమయినవి. అటువంటి మాడవీధులలో ఆ శ్రీనివాసుడు తేజస్సుతో ఎంతో గొప్పవైనా సింగరాలతో తిరుగుచున్నాడు అని అన్నమయ్య కీర్తించాడు.

చరణం-1: తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు | సిరుల రెండవనాడు శేషుని మీద | మురిపేన మూడవనాడు ముత్యాల పందిరిక్రింద | పొరి నాలుగవనాడు పువ్వు గోవిలలోను || తొలిరోజు ధ్వజారోహణం జరిగే ముందు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరేగి సకల దేవతలను ఆహ్వానిస్తాడు. తొలిరోజు రాత్రి ఇరువురు దేవేరులతో శ్రీవారు ఏడుపడగల పెద్దశేష వాహనం మీద ఊరేగుతారు.మనలో ఇమిడి ఉన్న కుండలినీశక్తిని మేల్కొల్పమని భోదించడమే ఈ వాహనసేవ విశిష్టత. ఎండావానల నుంచి తనని ఎల్లవేళలా కాపాడే ఆ ఆదిశేషుని మీద ప్రీతి తో రెండవనాడు శ్రీవారు ఒక్కరే ఉదయం ఐదుపాడగల చిన్నశేష వాహనం మీద ఊరేగుతారు.చదువుల తల్లి అయినా సరస్వతి స్వరూపంతో శ్రీనివాసుడు హంసవాహనం మీద ఆ రోజు రాత్రి అనుగ్రహిస్తాడు. హంస పాల నుంచి నీళ్లను ఎలా వేరు చేస్తుందో అదే విధంగా మనం మంచి చెడు విచక్షణ తెలుసుకోవాలి అని చెప్పడమే ఈ సేవ ఉద్దేశం.మూడవనాడు ఉదయం స్వామి యోగశాస్త్రం లో సహనశక్తికి,గమన శక్తికి ప్రతీకగా తెలిపే సింహవాహనం మీద దర్శనం ఇస్తారు.నవరత్నాలలో ముత్యం ఆరోగ్యప్రధాతయిన చంద్రునికి ప్రతీక. అటువంటి ముత్యాలపందిరిలో శ్రీదేవి భూదేవి సమేతుడయ్యి గోవిందుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.నాలుగోరోజు ఉదయం భార్యలతో సహా మలయప్పస్వామి కోరిన వరాలు ఇచ్చే కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తుల మనస్సంకల్పలను తీరుస్తాడు.బ్రహ్మాండనాయకుడు ఆయన. ఆయన నాలుగోరోజు రాత్రి ఊరేగే ఆ బంగారుపల్లకినే సర్వభూపాలవాహనం అంటారు.

చరణం-2: గ్రక్కున నైదవనాడు గరుడునిమీద | యెక్కెను నారవనాడు యేనుగుమీద | చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను | యిక్కువ దేరును గుర్రమెనిమిదవనాడు || అయిదవనాడు ఉదయం స్త్రీ రూపధారుడు అయ్యి మోహిని అవతారం లో బంగారుపల్లకిలో అందాలు ఒలకబోస్తూ దర్శనమిస్తారు. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం గొప్పది అని చాటిచెప్తారు.గరుడసేవ అత్యంత ప్రసిద్దమయినది.పక్షిరాజం,విష్ణువాహనమయిన గరుత్మంతునిపై మూలవిరాట్ ధరించే మకరకంఠి,లక్ష్మీహారం,విష్ణు సహస్రనామాలువంటి ఆభరణాలతో మలయప్పస్వామి దర్శనం ఇస్తారు.ఆరవనాడు ఉదయం శ్రీవారొక్కరే శ్రీరామ అవతారం లో తన ప్రియభక్తుడు అయినా హనుమంతుని భుజాలపై ఊరేగుతారు.త్రేతాయుగంలో సేవ చేసిన తన భక్తుడిని ఇప్పటికి కూడా తాను మర్చిపోలేదని చెప్పడమే దీని అర్ధం. అదేరోజు సాయంసంధ్య సమయం లో వసంతోత్సవం అనంతరం బంగారురధం మీద దేవేరులతో స్వామివారు అనుగ్రహిస్తారు. ఎంత పెద్ద సమస్యని అయినా తాను పరిష్కరిస్తా అని సూచించేలా ఆ గజేంద్రునిపై వెన్నెలలో శ్రీవేంకటేశుడు విహరిస్తాడు. ఏడవనాడు ఉదయం సూర్యప్రభ వాహనం మీద,రాత్రి చంద్రప్రభ వాహనం మీద స్వామివారు దర్శనమిస్తారు.సూర్య చంద్రులు రెండు తానే అని చెప్పడం దీని వెనుక దాగిన రహస్యం.ఎనిమిదవరోజు ఉదయం శ్రీదేవిభూదేవి సమేతుడు అయినా స్వామి రధోత్సవం లో కనువిందు చేస్తారు. మనస్సు అనే రధానికి సరైన కళ్లెం వేస్తే జీవితం సమస్యలు లేకుండా సాగుతుంది అని చెప్పడమే ఈ సేవ పరమార్ధం. కలియుగాంతం లో కల్కావతరంతో దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాను అని చెప్తూ శ్రీవారు అశ్వవాహనాన్ని అధిరోహిస్తారు.

చరణం-3: కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు | పెనచి పదోనాడు పెండ్లిపీట | యెనసి శ్రీవేంకటేశు డింతి యలమేల్మంగతో | వనితల నడుమను వాహనాలమీదను || చివరి రోజు అయిన తొమ్మిదవనాడు శ్రీవారు పల్లకి సేవ,తిరుచ్చి ఉత్సవంలో పాల్గొంటారు. ఇన్ని సేవలు చేయించుకుని అలిసిపోయిన ఆ దేవదేవుడు పుష్కరిణి వొడ్డున గల వరాహస్వామి సన్నిధిలో అభిషేకసేవలో సేదదీరుతారు.తన ప్రతిరూపం అయిన చక్రతాళ్వారుకి ఆ పుష్కరిణిలో స్నానం చేయించడం తో ఈ ఉత్సవాలు పూర్తి అవుతాయి.ఆరోజు రాత్రి ధ్వజావరోహణం చేసి దేవతలకు వీడ్కోలు పలుకుతారు. పూర్వకాలంలో శ్రీవారి కళ్యాణం బ్రహ్మోత్సవాల భాగంగా పదవరోజు జరిగేది. ఈ విధముగా అలమేలుమంగా సమేతుడయిన శ్రీ వేంకటేశ్వరుడు భక్తుల నీరాజనాలు మధ్య వాహనాలపై విహరిస్తూ మనల్ని కటాక్షిస్తాడు. ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద....