Meet Sandesh, A 5th Class Qualified Person Who Feeds Animals With His Own Money

Updated on
Meet Sandesh, A 5th Class Qualified Person Who Feeds Animals With His Own Money

తినడానికి తిండి లేని పరిస్థితి నుండి నెలకు రూ.50,000 సంపాదించిన రోజులను చూశాను. నాకు ఏది ఇవ్వలేని తృప్తి మూగజీవాలకు కడుపు నింపిన తర్వాత కలుగుతుంది - సందేశ్ గారు.

ఎద్దు వ్యవసాయంలో భాగమైనా తనంతట తాను వ్యవసాయం చెయ్యలేదు, చెట్ల కొమ్మలపై వాలే పక్షులు కానీ, కోతులు కానీ మరే ఇతర ప్రాణులు కాని మొక్కలను నాటలేవు, వాటిని పెంచలేవు. వీటన్నిటిని చేయగల ఒకే ఒక ప్రాణి మనిషి!! అందుకే మనిషి జన్మ గొప్పది అని అంటారు. కానీ మనం ఏమి చేస్తున్నామో తెలుసుకదా. గొప్ప చదువులు, విజ్ఞానం, అభివృద్ధి, మహా పురుషులు, లీడర్లు, నాతో సహా మనలో చాలామంది చెయ్యలేని సేవను పేదరికం నుండి వచ్చి, కేవలం ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న సందేశ్ గారు చేస్తున్నారు. మనకు 100 రూపాయలు వస్తే అందులో 10 రూపాయలు సమాజానికివ్వాలని పెద్దలంటారు, వారానికి 7 రోజులుంటే కనీసం ఒక్కరోజైనా మూగ జీవాలకు వెచ్చించాలనంటారు సందేశ్ గారు.

సందేశ్ గారు అన్నపూర్ణ ఫౌండేషన్ ను కూడా నడిపిస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆరోజు వారింట్లో భోజనం వండరు. అలాంటి వారి దగ్గరికి వెళ్లి సుమారు 50 మందికి సరిపడా అన్నదానం చేస్తుంటారు.

ఆకలి బాధను చూడలేక పోయాను: కళ్ళు ఉన్నందుకా మనం అదృష్టవంతులమైనది.? కన్నీళ్లు వస్తున్నందుకు, చూస్తున్నందుకు కదా అదృష్టవంతులమైనది!!! 2004 సంవత్సరంలో నిర్మల్ కు బస్ లో వెళ్తున్నప్పుడు బైపాస్ రోడ్డు పక్కన చాలా కోతులు బక్కచిక్కిపోయి, అనారోగ్యంతో ఉండడం చూశారు సందేశ్ గారు. కోతుల వెనుక చెట్లు, అడవి ఉంది కానీ అక్కడ ఆహారం లేకనే కదా అవి ఇలా రోడ్డు పక్కకు వచ్చాయి. ఈ పరిస్థితిని చూసి చలించిపోయి, మరోసారి అదే మార్గంలో వచ్చేటప్పడు రూ.100 తో పండ్లు కొని వాటికి వేశారు, బస్ లో ప్రయాణం చేస్తున్న వారందరూ సందేశ్ గారు చేస్తున్న మంచి పనిని మెచ్చుకున్నారు. సందేశ్ గారికి ఈ అనుభవం తనని తాను కనుగొనడానికి ఉపయోగపడింది. 2004 నుండి వీలు చిక్కిన ప్రతిసారి పండ్లు వేశారు, ఐతే 2014 నుండి Friends animal trust ద్వారా పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

నేను పెళ్లి చేసుకోను!! చేసుకుంటే గనుక ఇంత సమయాన్ని మూగ జీవాలకు కేటాయించలేను. - సందేశ్ గారు.

నాన్న పండ్లు అమ్ముతారు: సందేశ్ గారిది చాలా పేద కుటుంబం, నాన్న నాగభూషణం గారు తోపుడు బండి ద్వారా మంచిర్యాలలో అరటిపండ్లు అమ్ముతుంటారు. సందేశ్ గారు ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకుని చిన్నతనం నుండి అడపా దడపా కుటుంబానికి సహాయంగా పనులు చేసేవారు. మొదట ఇలా జంతువులకు పండ్లు, మంచి నీటిని అందిస్తున్నప్పుడు సందేశ్ గారిని వద్దని వారించినా తర్వాత అమ్మ నాన్నలు అర్ధం చేసుకుని ఇప్పుడు తమవంతుగా సహాయాన్ని కూడా అందిస్తుంటారు.

ప్రతివారం నాకు రూ.2,200 వరకు ఖర్చు అవుతుంది, వీటిలో ఎక్కువ శాతం నా ఇంటి నుండే జమచేస్తున్నాను.

రూ.45,000 బిజినెస్ ను వదులుకుని: పేదరికంలో అనుభవించిన కష్టాలకు లొంగి ఏనాడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు, సందేశ్ గారు మందు తాగరు, స్మోకింగ్ చెయ్యరు, టైం వేస్ట్ చేసే వాటిని కూడా పట్టించుకోరు. కొంతకాలం క్రితం డ్రై ఫ్రూట్స్ బిజినెస్ ప్రారంభించారు, నెలకు రూ.45,000 వరకు లాభం పొందారు కూడా. ఐతే డబ్బు సంపాదనలో మునిగిపోతే తెలియకుండానే ఈ సేవా కార్యక్రమాలకు దూరం అవుతానని డ్రైఫ్రూట్స్ వ్యాపారాన్ని ఆపేశారు. పూర్తిగా 100% తన సమయాన్ని సేవకు కేటాయిస్తూ రెండు రకాల NGO లను మంచిర్యాల పట్టణంలో నడిపిస్తున్నారు.

ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక్క రూపాయి వెచ్చించినా ఎన్నో ప్రాణాలు బ్రతుకుతాయి.

ప్రతి ఆదివారం: కొండగట్టు, గోదాం జెనరం, కోర బుగట్టి జైపూర్ లాంటి ప్రాంతాలలో కోతులు ఎక్కువ సంఖ్యలో జీవిస్తున్నాయి. ప్రతి శనివారం పండ్ల షాపుల దగ్గరికి వెళ్లి ఆదివారం కావాల్సిన పండ్ల ఆర్డర్ ఇస్తారు. ఇక ఆదివారం ఉదయమే ఓమ్ని వ్యాన్ ద్వారా మూగజీవాలు ఉన్న ప్రదేశాలకు వెళుతుంటారు. ఆవులు, విధి కుక్కలు, పక్షులు, కోతులు ఇలా అన్ని రకాల జంతువుల ఆకలిని తీర్చడమే సందేశ్ గారి పని. మాములు రోజులో అరటిపండ్లు, దానిమ్మ, బత్తాయి అలాగే వేసవి కాలంలో పుచ్చకాయలు, కీర దోసకాయలు లాంటి పండ్లను మిత్రుల సహాయంతో అందిస్తుంటారు.

సందేశ్ గారి కార్యక్రమాలకు డోనేట్ చెయ్యాలనుకున్నా, నేరుగా మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి: 99662 29891