Contributed By Divya Vattikuti
ఎన్ని కథలు ఎన్నెన్నో ఎమోషన్స్ ... మొదటి సారి ఫ్లైట్ ఎక్కి సప్త సముద్రాలు దాటి తన కొడుకు దగ్గరికి వెళ్ళబోతున్న బామ్మ గారు చివరి దశలో కాశియాత్రకి బయల్దేరిన తాతగారు ... ట్రీట్మెంట్ కోసం మన ఊరు మన బాషా కాకపోయినా బ్రతుకు మీద ఆశతో వెళ్తున్న ఒక పేషెంట్ ... ఈ ప్రమోషన్ వచ్చింది అని వెళ్ళటం తప్ప నాకు మిమల్ని పిల్లల్ని వదిలి వెళ్లాలని లేదండి అని బాధ పడుతున్న ఒక వర్కింగ్ వైఫ్ ...
ఐ విల్ మిస్ యూ మా, కాని జీవితం లో బాగా సెటిల్ అవ్వలాంటే ఈ MS చెయ్యాల్సిందే అని తన కలల ప్రపంచం వైపు అడుగులు వేస్తున్న మరో యువతి... ఇండియా గోప్పతనం తెలుసుకుని ఇండియా కి వచ్చి మరపులేని జ్ఞాపకాలని చేర వేసుకొని కెమెరా లో ఫోటోలతో ఆ జ్ఞాపకాలని తల్చుకుంటున్న ఆ విదేశీ జంట… బోర్డు సమావేశం కోసం ల్యాప్‌టాప్ లో ఎంతో వెగంగా ప్రపంచాన్నే మరిచిపోయినట్టు పని చేసుకుంటున్న ఆ మధ్య వయసు వ్యక్తి..
లేట్ గా వచ్చి ఫాస్ట్ ఫాస్ట్ గా బోర్డింగ్ పాస్ తీసుకుంటున్న సెలబ్రిటీ…. దుబాయ్ కి వర్కింగ్ వీసాతో వెళ్తున్న తన భర్త ఎన్ని సంవత్సరాలకి తిరిగి వస్తాదోడో తెలియక బుర్కాలో నుంచి కనిపిస్తున్న ఆమె కళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నాయి ... అమ్మ ఇంటి నుంచి ఆవకాయ పట్టుకెళ్తున్న అమ్మాయి ఆనందం ఒక ఎత్తు అయితే .. ఆమె పిల్లలు తమ అమ్మమ్మ గారి ఇంటి నుంచి నేర్చుకొని వెళ్తున్న విలువల వెల ఇంకో ఎత్తు ... ఇంత మంది మధ్యలో కూర్చున్న నాకు , నా జీవితం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మెరుపు వేగంలో నా కల్లకు కనిపించింది.
ఒక్కొక్కరిది ఒక్కో కథ . ప్రతి కథకి ఏదో మజిలీ. ఆ మజిలీని చేరాలన్నదే ప్రతి ఒక్కరి కాంక్ష. బహుశా ఆ మజిలీని చేరే ప్రయాణమే ఈ జీవితం ఏమో.. ఆ మజిలీ వైపు కి ఆ కథల్ని నడిపించే రంగస్థలం అయ్యింది ప్రస్తుతానికి ఈ Airport..