ఏ హీరో ఐనా నా పక్కనే నటించారు కాని నేను ఎవ్వరి పక్కన నటించలేదు - భానుమతి. ఇలా ఎంతమంది చెప్పుకోగలరండి.. చెప్పుకోవాలంటే గొప్ప నటనను ఒలికించాలి, అందుకుతగ్గట్టుగా నిజాయితీతో కూడిన బలమైన వ్యక్తిత్వం ఉండాలి ఇవన్నీ మన భానుమతిగారికి సొంతం.. ఇప్పుడంటే మనం లేడి అమితాబ్ గా విజయశాంతి, అనుష్క అని అనుకుంటున్నాం కాని ఎప్పుడో 50 సంవత్సరాల క్రితమే బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే గుర్రపుస్వారీ చేస్తు కత్తి పట్టి యుద్ధం చేసి(పల్నాటియుద్ధం1966) హీరోయిన్ అంటే సౌమ్యురాలు, సున్నిత మనస్కులు అన్న భావన చెరిపేశారు మన బంగారు భానుమతి గారు. తన గొప్పతనం గురుంచి మరింతగా తెలుసుకుందాం..
ప్రకాశం జిల్లా ఒంగోలులో 1925లో భానుమతి గారు జన్మించారు. అమ్మ నాన్నలు సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు అలా చిన్నతనం నుండే సంగీతం నేర్చుకుని 9 సంవత్సరాల నుండే పాడటం మొదలు పెట్టారు. "నా కుతురిని నటించడానికి నేను ఒప్పుకుంటున్నా కాని తనని ఎవరు తాకరాదు అన్న షరతు మీద భానుమతి తండ్రి నటనకు ఒప్పుకున్నారట" అలా వరవిక్రయం(1939) లో మొదటిసారిగా నటించారు. అందులో ఒక బాల్యంలో ఉన్న అమ్మాయిని ఒక ముసలివాడు పెళ్లిచేసుకోవాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకునే పాత్ర.. అంతటి బలమైన పాత్రను అవలీలగా చేసిన భానుమతిని చూసి ఇండస్ట్రీ గర్వించింది. నటించిన మొదటి సినిమా నుండే భానుమతి గారు పాడటం ప్రారంభించారు.
ఇండస్ట్రీకొచ్చిన తొలిరోజుల్లనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రామకృష్ణను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు, ఆ తర్వాత ఇద్దరు కలసి వారి కుమారుని పేరుతో సంస్థను ప్రారంభించి భరణి పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు నిర్మించారు. నవరసాలైన శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హస్యం, భయనకం, భీబత్సం, రౌద్రం, శాంతం వీటిలో ఎంత పర్ఫెక్ట్ గా నటించగలరో గాయనిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా, సంగీత దర్శకులుగా, రచయితగా, స్టూడియో ఓనర్ గా, ఎడిటర్ గా ఇలా సినిమాకు అవసరమయ్యే ముఖ్యమైన రంగంలో తనదైన ముద్ర వేయగలరు. ఒక హీరోయిన్ గా పరిశ్రమలోకి వచ్చి ఇన్ని రంగాలలో బెస్ట్ అనిపించుకున్న భానుమతి లాంటివారు తెలుగులోనే కాదు మరే ఇతర భాషలో ఉండరు కావచ్చు. ఒక్క తెలుగులోనే కాదు తమిళ మళయాలీ, కన్నడ, హింది లాంటి భారతీయ భాషలన్నింటి లోను 200పైగా సినిమాలలో నటించి దేశమంతా అభిమానుల ప్రేమను పొందారు.
భానుమతిగారు 9సినిమాలకు దర్శకత్వం అందించారు, 15 సినిమాలు తన సొంత బ్యానర్ లో నిర్మించారు, 10 సినిమాలకు సంగీతం అందించారు తను నటించి సంగీతం అందించిన 'అంతా మనమంచికే ' సినిమాకు నేషనల్ అవార్ఢు అందుకున్నారు. మన తెలుగు ప్రజలు భానుమతి గారిని మంచి నటిగా ఎంతలా ఇష్టపడుతారో గాయనిగా కూడా అంతే స్థాయిలో ఇష్టపడతారు ఎం.ఎస్ సుబ్బలక్ష్మీకి ఏకలవ్య శిష్యురాలైన భానుమతి గారు పాడిన పాటలలో ఓహోహో పావురమా(స్వర్గసీమ), మనసున మల్లలూగెనే(మల్లీశ్వరి), ఉయ్యాల జంపాల(చక్రపాణి), ప్రేమే నేరమా(లైలామజ్ను), ఓ బాటసారి(బాటసారి), శ్రీకరకరుణాల వాల(బొబ్బిలియుద్ధం), నేనె రాధనోయి(అంతామన మంచికే) లాంటి ఎన్నో మరుపురాని పాటలతో తెలుగు ప్రజల అభిమానాన్ని అందుకున్నారు. సినిమా పాటలే కాకుండా ప్రైవేట్ అల్బమ్స్ కూడా చేశారు అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, సుభాషితాలు లాంటి వెన్నో ప్రైవేట్ అల్బమ్స్ రూపొందించారు.
భానుమతిగారు చిన్నతనం నుండే నటించడం మొదలుపెట్టి 50 సంవత్సరాల సినీ జీవితంలో అన్ని వయసుల పాత్రలలో నటించారు. మల్లీశ్వరి సినిమాలో ఎంత అందంగా కనిపించారో తాతమ్మ కల, పెద్దరికం, బామ్మమాట బంగారు బాట, మంగమ్మ గారి మనవడు సినిమాలో బామ్మగా కూడా అంతే చక్కగా నటించారు. రచయితగా కూడా భానుమతి గారు తెలుగు సాహిత్యం మీద ఉన్న పట్టు చూపించారు. 13 సంవత్సరాల వయసులో మొదటిసారి 'మరచెంబు' అనే కథ నుండి మొదలుకొని భానుమతి కథలు, అత్తగారి కథలు, అత్తగారు నక్సలైట్, నాలోనేను(ఆత్మకథ) లాంటి ఏన్నో కథలు రాశారు. తను రాసిన నాలోనేను ఆత్మ కథకు కేంద్ర ప్రభుత్వం నుండి 'స్వర్ణకమలం' అందుకున్నారు. తన కుటుంబం, తనవారు అని మాత్రమే ఆలోచించుకోకుండా భానుమతి గారికి ఎంతో ఇష్టమైన పేద పిల్లల కోసం పాఠశాలను స్థాపించి ఆరోజుల్లో విద్యను అందించారట.
భానుమతి అందుకున్న పురస్కారాలు:
కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ(1966) ఆంధ్రయూనివర్సిటీ నుండి డాక్టరేట్(1975) తమిళ రాష్ట్రం నుండి కలైలామణి(1984) నాలోనేను(ఆత్మకథ) పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం నుండి స్వర్ణకమలం(1984) శ్రీ వేంకటేశ్వరవర్సిటీ నుండి డాక్టరేట్(1985) రఘుపతి వెంకయ్య పురస్కారం(1986) ఎన్.టి.ఆర్ జాతీయపురస్కారం(2000) కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషన్ గౌరవం(2000)
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.