How A Phone Call Changed A Person’s Perspective Towards Suicide. A Short Story - Part 2

Updated on
How A Phone Call Changed A Person’s Perspective Towards Suicide. A Short Story - Part 2

Contributed By Masthan Vali Click here for PART - 1

ముఖం మీద నీళ్లు పడటం తో అతను ఉక్కిరిబిక్కిరౌతూ తేరుకున్నాడు. ఆ వెంటనే కారులోనుంచే బయటకు చూసి, గబగబా దిగి బిల్డింగ్ లోపలికి పరుగెత్తసాగాడు. డ్రైవర్ దగ్గరున్న తన వాలెట్ ను మర్చిపోయాడు, " సార్, మీ పర్సు " అని డ్రైవర్ అతను వెనక్కి తిరగడం కోసం ఎదురుచూశాడు. పరుగెడుతున్న అతను ఒకసారి నెమ్మదించి, జేబులు తడుముకుంటూ వెనక్కి చూసాడు. " ఇదిగోండి " అంటూ అతని అర్జెన్సీ తెలిసిన వాడిలా విసిరాడు. పర్స్ అందుకున్నాక డ్రైవర్ కి డబ్బులివ్వాలని గుర్తొచ్చి, పర్సు లో వెతుకుతుండగా... " సార్, అందులో రెండు వేలుంటే తీసుకున్నా... మీరు స్పృహ్ " ఇక డ్రైవర్ మాటలు విననవసరం లేనట్టు " థ్యాంక్ యూ " అని చెప్పేసి లోపలికి పరిగెత్తాడు. అతను వెళ్ళాల్సింది ఐదవ అంతస్థు. లిఫ్ట్ దగ్గర నిలుచున్నాడు. ' ప్లీజ్ క్లోజ్ ద డోర్ ' అని మొత్తుకుంటోదది. పైనెవరో లిఫ్ట్ సరిగ్గా క్లోజ్ చేయలేదు. మెట్లవైపు వెళ్ళాడు. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే తను ఇంతక మునుపు చావడానికి కొండెక్కుతున్న దృశ్యం బుర్రను కుదుపుతోంది. కాళ్ళు లాగదీసుకుంటూ అతి కష్టం మీద ఎక్కుతున్నాడతను. మొదటి ఫ్లోర్ చేరుకున్నాడు. లిఫ్ట్ ఆగిపోయిన ఫ్లోరదే. ' ప్లీజ్ క్లోజ్ ద డోర్ ' అని లిఫ్ట్ నుంచి కొనసాగుతోంది. లోపలికెళ్ళి 5 నొక్కాడు. లిఫ్ట్ పైకెళుతోంది. 2... 3... 4... టక్. . . ఉన్నటుండి ఆగిపోయింది. లోపలున్న లైట్ కూడా ఆరిపోయింది. కరెంటు పోయిందని అతనికి అర్థమయ్యింది. 5 వ ఫ్లోర్ కి కొన్ని అడుగుల దూరం లోనే ఆగిందది. బయటున్న మనిషి మోకాళ్ళ వరకు కనపడుతాయి. అతను డోర్ తీయయడానికి ప్రయత్నించాడు. సాధ్యపడలేదు. ప్రేమ్ రూమ్ లిఫ్ట్ పక్కనే. లిఫ్ట్ లోపల్నుంచి అరిస్తే వినబడే వీలుంది, " వివేక్, ప్రేమ్ ... రేయ్ వివేక్ " గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. చుట్టూర ఎవ్వరు కనిపించకపోవడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. లిఫ్ట్ డోర్ గ్రిల్స్ పట్టుకుని కుదిపేస్తూ, అరుస్తున్నాడు. తర్వాతా కాసేపు మౌనంగా కూలబడ్డాడు. అతనికి గాలి అందుతోంది. ఫోన్ తీసి చూసాడు. స్విచ్ఛాఫ్ అయ్యుంది! నెమ్మదిగా లేచి, " ఎవరైనా ఉన్నారా... I got stuck in the lift, please help me out " అంటూ తలని తలుపుకు ఆనించి, కళ్ళని రకరకాల కోణాల్లో పెడుతూ బయటకు చూడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. అలా అరుస్తూనే దాదాపు గంట సేపు విలవిల్లాడాడు. ఏడుపును ఆపుకోలేకపోయాడు. పిచ్చి పట్టినట్టు ఎగురుతున్నాడు. లిఫ్ట్ లోపల దద్దరిల్లిపోతోంది. అతనికి జీవితం అంటే తెలిసొచ్చినట్టు అనిపిస్తోంది, ' ఏంటి లిఫ్ట్ లో గంట సేపు చిక్కుకున్నందుకే ? ' అని అతనే ప్రశ్నించుకున్నాడు.

' కాదు, అందుక్కాదు. ఎందుకో తెలీదు... నాకు కాస్త ధైర్యంగా అనిపిస్తోంది ? ' ' భయం విపరీతమైనప్పుడు, దాన్ని మనిషి తట్టుకోలేనప్పుడు, మనిషి తనతో తాను అబద్దాలాడుకుంటాడు.' ' నేనేం భయపడట్లేదు ' ' ప్రేమ్ కి ఏమైంటుందంటావ్ ? ' ' ...... ' ' ఇప్పుడు కూడా భయపడట్లేదా ' అతని మనసులో సంఘర్షణ అతనికి విలక్షణంగా, వికారంగా తోచింది. అతను నిశ్చేష్టుడని క్రమంగా అర్థమౌతోంది. ' నేనేం చేయలేనా ? నేను నిజానికి చేయాల్సిందేంటి ? ప్రేమ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని శవాన్ని చూడ్డానికి వచ్చానా ? చేసుకోబోతున్నాడని తెలిసి ఆపడానికొచ్చానా ? తను నిజంగా ఆత్మహత్య చేసుకునుంటే, నేను చేసేదేం లేదు... కానీ నాలాగా ప్రయత్నం మధ్యలో ఉండుంటే...'

అతను మళ్ళీ లిఫ్ట్ ను కుదపసాగాడు. తన శక్తినంతా ఉపయోగించాడు. తెరుచుకోలేదు. కాసేపటికి నాలుగో ఫ్లోర్ నుంచి లిఫ్ట్ డోర్ అలికిడి వినిపించింది. మరి కాసేపటికి " రేయ్ నువ్వెప్పుడైనా లిఫ్ట్ లో ఇరుకున్నావా... " దూరం నుంచి మాటలు వినిపించాయి. అంతే, అతను క్షణకాలం ఆలస్యం చెయ్యకుండా... " హెల్ప్... హెల్ప్... " అని అరవసాగాడు. " ఎవరో లోపల ఇరుకున్నట్టున్నారు " వినిపించిందతనికి. ఆ తర్వాత ' తప్... తప్... ' అని మెట్లెక్కుతున్న చప్పుడు కూడా. అతని మొహం మీద అదోలాంటి నవ్వు వికసించింది. అలా నవ్వుతూ కిందకు వాలిపోయాడు. తలుపును కదిలిస్తున్నాడు, తాను లోపలే ఉన్నానని చెప్తున్నట్టు.

తర్వాత బయటి నుంచి డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం మొదలైంది. ముగ్గురు బలంగా లాగితే, పూర్తిగా కాదు కానీ... ఇంచుమించు ఓ మనిషి అతికష్టమ్మీద దూరేంత తెరుచుకుంది. అతన్ని చెయ్యి పట్టుకుని కొద్ధికొద్దిగా లాగుతూ బయటపడేశారు. " ఎవరు భయ్యా మీరు, ఇందులో ఎలా ఇరుక్కున్నారు ? " " ఇక్కడెవరూ లేరెందుకని ? " వాళ్ళ ప్రశ్నని అతను పట్టించుకోలేదు. " దీన్ని రెనవేట్ చేస్తున్నారు... నిన్ననే ఇక్కడున్న వాళ్ళందర్నీ పక్క పిజి లోకి మార్చారు. " " నాకా పిజి చుపిస్తావా " ప్రశాంతంగా అడిగాడతను. " వివేక్ " ఆ బిల్డింగ్ లోకి అడుగుపెడుతూనే అడిగాడు అక్కడ కనిపించిన వ్యక్తి ని, శీను ని. శీను అతన్ని గుర్తుపట్టాడు, " సార్, ఏంటిలా అయ్యారు... ఏమైందండీ " ఆందోళనగా అడిగాడు. " శీను, వివేక్ రూమ్ ఎక్కడ ? " అతను నిమ్మళంగా అడిగాడు. అతని ప్రతి మాట వెనుకా ప్రేమ్ కి ఏం జరుగుండదనే ఆశ దాగుంది. " 302 సార్ " లిఫ్ట్ ఎక్కకుండా, మెట్ల వైపు వెళ్ళాడు. 302 ముందు ఆగాడు. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని, తలుపు తీసాడు. గదంతా పొగతో నిండుంది. పొగాకు పొగ. వివేక్ తో పాటు మరో ముగ్గురు కూర్చుని దమ్ము లాగుతున్నారు. వారితన్ని గమనించలేదు. నెమ్మదిగా ఆయాసపు అడుగులు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి చేరాడు.

" ప్రేమ్ కేమైంది ? " అడిగాడతను. ఏం తాగుతున్నారో తెలీదు, ఆ మత్తులో అంత వరకూ అక్కడలేని మనిషి గొంతు వినేసరికి ఆ నలుగురూ కళ్ళు తేలేసి ఎవరా అని చూసారు. " వివేక్, ప్రేమ్ కేమైంది ? " వాళ్ళ చూపులనర్ధం చేసుకున్నట్టు మళ్ళీ అడిగాడు. పేరు పెట్టి అడగటం తో వివేక్ కి కాస్త తెలివొచ్చినట్టైంది. " రేయ్, ఎక్కడ చచ్చావ్ నువ్వు... నీ యబ్బ ఎన్ని ఫోన్లు.. ఎన్ని మెస్సేజ్లు... ఏంట్రా నీ అవతారం ఇలా ఉంది " అని మత్తెక్కిన గొంతుతో వాగుతూనే ఉన్నాడు. " ప్రేమ్ కేమైంది ? " అతనికే సమాధానం ఇవ్వకుండా అడిగాడు. " ఏమౌతుంది... " " ఎక్కడున్నాడు వాడు ? " " నిన్న ఢిల్లీ వెళ్లాడు, ఈ రోజు వస్తున్నాడు. ఫోన్లో చెప్పాను గా " పైకి లేస్తూ అన్నాడు. అతను మౌనంగా ఉన్నాడు. అతని మనసు కుదుటపడలేదు. " నువ్వెంట్రా ఇలా ఉన్నావ్... " వివేక్ కొనసాగించాడు. " ఢిల్లీ ఎందుకెళ్ళాడు ? " " గొప్ప ఫ్రెండ్స్ రా బాబు... ఒకరి జీవితాల్లో ఏం జరుగుతోందో ఇంకొకరికి తెలీదు " వెటకారంగా అన్నాడు. " ఢిల్లీ ఎందుకెళ్లాడ్రా ? " కోపంగా అడిగాడు. " ఏంట్రా అరుస్తున్నావ్ ? వాడికి ఆమ్స్టర్డ్యామ్ లో సీట్ కన్ఫర్మ్ అయ్యింది... ఆ పని మీదే ఢిల్లీ వెళ్ళాడు. ఫోన్లో చెప్పాను గా నీ యబ్బ... " అంతే... ఆ మాటలు వినగానే సోఫాలో కుర్చున్నాడు. అతనికి కన్నీళ్లు ఆగట్లేదు. వివేక్ అతని పక్కకు చేరాడు. " ఎందుకురా ఏడుస్తున్నావ్ ? " నెమ్మదిగా అడిగాడు. అతను వివేక్ ను కౌగిలించుకున్నాడు. " సారి రా వివేక్... " అతనెందుకు ఆ ' సారి' చెబుతున్నాడో వివేక్ అర్థం చేసుకోవాలనుకోలేదు, ధైర్యం చెబుతున్నట్టు కేవలం అతని భుజం తడుతన్నాడు. గది లో ఉన్న మిగతా ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. వివేక్ ఫోన్ మోగింది. ఫోన్ తీస్తూ... " ప్రేమ్ రా " అన్నాడు. " చెప్పరా... ఎక్కడా ? " ఫోన్లో అన్నాడు. అవతల ప్రేమ్ ఏం బదులిచ్చాడో తెలీదు… " దా మరి, అన్నట్టు నీ జిగిరి కూడా వచ్చేసాడు... పార్టీ కుమ్మేద్దాం..." హుషారుగా ఫోన్ కట్ చేసాడు. " ఇప్పుడే ఫ్లైట్ దిగాడంట్రా... వస్తున్నాడు, ఏడ్వకింక..! " ప్రేమ్ కోసమే ఏడుస్తున్నాడనట్టు సరదాకన్నాడు వివేక్. అది నిజమేనని ఏడుస్తున్న అతనికి మాత్రమే తెలుసు.

" అన్నట్టు, నేరుగా ఇక్కడికెలా వచ్చావ్, అదేదో రెనవేట్ చేస్తున్నారట ఆ బిల్డింగ్... నిన్ననే ఇక్కడికి మారాం. నీకు చెబ్దామనుకున్నా మర్చిపోయా " అతను మర్చిపోయిందాన్ని గుర్తు చేసాడు. తన భావాలన్నింటిని దిగమింగుకొని... " అక్కడికెళ్తే, ఇక్కడికి మార్చారని చెప్పార్లే... " టేబుల్ వైపు నడుస్తూ అన్నాడు. అతనికి జరిగిందెవ్వరికి చెప్పాలనిలేదు. టేబుల్ పైనున్న సిగరెట్ నోట్లో పెట్టి వెలింగించాడు. ఒక దమ్ము గట్టిగా లాగి, గాల్లోకి వదిలాడు. ప్రేమ్ కోసం అతనింత ఉరుకులు పరుగులుగా ఇక్కడికి రావడానికి గల పరిస్థితులు మనసులో మెదులుతున్నాయ్.. ' సంధ్య విషయంలో అప్సెట్ అయ్యాక, మూడ్రోజులుగా నా వైపు నుండి ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో అందరూ " కాల్ బ్యాక్, అర్జెంటు " అని మెసేజ్ చేశారు. ప్రేమ్ ఆమ్స్టర్డ్యామ్ వెళ్తున్నాడు, వాడు నన్ను మిస్ అవబోతున్నాడు... అదే మెసేజ్ చేసాడు. వీటన్నింటిని, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను కనుక, ప్రేమ్ కూడా అదే పని చేస్తున్నాడని తెలీకుండానే రిలేట్ చేసుకున్నాను ! ' ఇంకో సిగరెట్ అందుకున్నాడు. అన్నిటికి మించి," ప్రేమ్ ఆమ్స్టర్డ్యామ్ వెళుతున్నాడు " అన్న మాటను అతనర్థం చేసుకున్న తీరుకు నవ్వుకుంటున్నాడు. తన ఆత్మహత్య ప్రయత్నం వల్ల చిన్నబోయినట్టు అనిపించినా, తనిప్పుడు బతికున్నందుకు ఆనందిస్తున్నాడు.

' యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డ్యామ్ లో మాస్ కమ్యూనికేషన్స్ చేయాలనేది వాడి కల. నాతో చాలా సార్లు చెప్పాడు. అదే విషయాన్ని వివేక్ నాతో ఫోన్లో చెప్పినప్పుడు, నేనెలా అపార్థం చేసుకున్నాను? కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కన్నా... అపార్థం చేసుకోవడమే మంచిది! ' గాల్లో సిగరెట్ పొగ గింగిర్లు తిరుగుతోంది, అతని ఆలోచనల్లా! "నా స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడేమో అనే పిచ్చి ఆలోచనకే వొళ్ళు తెలియకుండా ఎన్ని అడ్డంకులైన పట్టించుకోకుండా ఇక్కడివరకు వచ్చిన నన్ను నన్నుల ప్రేమించే, అర్థం చేస్కునే ఇంతమంది ఉన్నప్పుడు నేను ఎందుకు ఆత్మా హత్య చేసుకుందామనుకున్న?".ఆలోచన మొదలయ్యింది. THE END.