Contributed By Masthan Vali
" భయం... భయాన్ని దాటి ఒక్క అడుగు ముందుకు వేస్తే గెలుపు నీదే. " చిన్నప్పుడు నాన్న చెప్పిన మాటలు అతడి చెవుల్లో ప్రతిధ్వనించాయ్. కానీ అతడా మాటలను ఈ పని చేయడానికి సాయంగా వాడుకుంటాడని తెలిసుంటే భయాన్ని, గెలుపుని అతని తండ్రి మరోలా నిర్వచించేవాడెమో. " నాకు తెలుసు, నేను చేస్తున్నది తప్పని... దాని శిక్ష నా అనుకున్న వాళ్ళందరూ అనుభవిస్తారని... " అతని అంతరాత్మ అంటోంది. చేతికున్న వాచ్ వైపు చూసాడు, సమయం మధ్యాహ్నం 02:30 కావస్తోంది. " ఎప్పుడు బయటికెళ్లినా నువ్వు ఈ వాచ్ మాత్రమే కట్టుకోవాలి, లేదంటే... " ఆ వాచ్ ను అపురూపంగా తడుముతుండగా దాన్ని చేతికి కడుతూ చెల్లెలన్న మాటలు గుర్తొచ్చాయి.
నిర్మాణుష్యమైన ఆ ప్రాంతంలో కొండ అంచున నిలుచుంటే చాలు, ఎవరూ తోయకుండానే పడిపోయేంత బలంగా గాలులు వీస్తున్నాయి. చివరిసారిగా ఇంటికి ఫోన్ చేయడానికి అక్కడ నెటవర్క్ కూడా లేదు. ఒక్క ' సారి ' అయినా చెప్పాలనిపించింది అతనికి. బ్రతుకు మీద ఆశలేక, బ్రతకాలనే కారణం కనిపించక ఇంతవరకూ వచ్చాడు. అడుగులో అడుగు వేసుకుంటూ కొండ అంచుకు చేరుకున్నాడు. కాస్త ముందుకు వంగి తొంగి చూసాడు. అతనికి గుండె ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. భయపడుతున్నాడు, కానీ అతని బాధ ముందు భయం చిన్నబోయింది. బాధని దిగమింగలేక భయాన్ని ఎదురించడానికి సిద్ధపడ్డాడు. కంటి ధార ఈదురు గాలికి నేల రాలకుండానే మాయమౌతోంది. మెదడు పొరల్లోని తన 25 సంవత్సరాల జ్ఞాపకాలన్నీ కలగలిసి చివరి ప్రయత్నంగా అతన్ని బతకమని వేడుకున్నాయ్. వాటిలోని ఒక జ్ఞాపకం మాత్రం... అతని తొలి, చివరి, విఫల ప్రేమ తాలూకు జ్ఞాపకం, స్వప్న... " ఇంకెందుకు ఆలస్యం, వినేవారికి పెద్ద కారణం కాకపోవచ్చు... కానీ భరించేందుకు వల్లకాని భావన, బాధ జీవితాంతం వెంటాడుతుంటే, ఇలా చస్తూ బ్రతకడం కంటే ఒక్కసారిగా చావడం సుఖం " అని అతన్ని ఇంకొక అడుగు ముందుకేసేలా చేసింది.
అంతే, కళ్ళు వాటంతట అవే మూసుకు పోయాయ్, పిడికిళ్లు రెండు తెలీకుండానే బిగుసుకుపోయాయ్, తల ఆకాశం వైపుగా ఉంది. పడమటిగా వాలుతున్న సూర్యుడు మబ్బులోకి దూరి కళ్ళు మూసుకున్నాడు. ఈ లోకాన్ని వదిలెళ్లే ఆఖరి అడుగు వేయడానికి అతని కాలు గాల్లోకి లేచింది. ఒక్కఉదుటున వెనుక నుండి ఎవరో తోసినట్టు ముందుకు పడిపోతుండగా, జ్ జ్ జ్ జ్ అని జేబులోని ఫోన్ వైబ్రేట్ అయ్యింది. మనసులో ఎదో మూలాన మిగిలున్న చావుభయం ఆ ఫోనేంటో చూడమన్నట్టు అతని కళ్ళు తెరుచుకున్నాయ్, పిడికిళ్లు వదులయ్యాయ్, సంయమనం చూపినట్టు అందాక అతన్ని ముందుకు తోస్తున్న గాలి కాసేపు శాంతించింది. అప్పటివరకున్న ఒంటికాలుకి మరో కాలుని ఊతమిచ్చి, శరీరాన్ని అదుపులోకి తెచ్చి, వెనక్కొచ్చి పడ్డాడు. ఇదంతా ఫోన్ వైబ్రేట్ అయిన తర్వాత రెప్పపాటుకంటే తక్కువ సమయంలో జరిగినట్టు అనిపించిందతనికి. విచిత్రంగా అతని ముఖం లో తాను చేయబోతున్న కార్యానికి భంగం వాటిల్లినందుకు ఏ మాత్రం విచారం కనిపించట్లేదు. పైపెచ్చు చావనందుకు లోలోపల చిన్నపాటి ఆనందం అదే ముఖం లో ఓ మూలన తొంగిచూసింది. కానీ, అన్నిటికి సంసిద్ధమై అతను తీసుకున్న నిర్ణయం తాలూకు ఒకరకమైన అహం, అతన్ని ఇంకా చావమనే చెబుతోంది. అలా అతని మనసులో అంతర్యుద్ధమే జరుగుతోంది. ఇన్నిటి మధ్య ఆ ఫోన్ చేసిందెవరో అని చివరగా బుద్ధి నిద్రలేచింది.
ఒళ్ళు దులుపుకుంటూ లేచి, ఫోన్ తీసి చూసాడు. 12 మిస్డ్ కాల్స్, లెక్కలేనన్ని మెసేజ్ లు. అంతా తన స్నేహితులే. కాల్ బ్యాక్ చేద్దామంటే నెట్ వర్క్ పోయింది. మెసేజ్ లు చదవసాగాడు. అన్నిటి సారాంశం ఒక్కటే, " తొందరగా ఫోన్ చెయ్... చాలా అర్జెంట్ ". కానీ ఒక్క మెసేజ్ మాత్రం అతని ముఖాన్ని తీవ్రంగా మార్చింది, " ఐ విల్ మిస్ యు రా " అని ప్రేమ్ పంపిన మెసేజ్ అది. అతనికి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది.
" ప్రేమ్... ఆత్మహత్య... చేసు... " అప్రయత్నంగా తన నోటినుండి వచ్చిన మాటలను అతను పూర్తి కానివ్వలేదు. " ఓ మై గాడ్, ప్రేమ్... " అంటూ కొండ అంచుకు చేరుకొని మొబైల్ ని వీలైనంత పైకి చాచి సిగ్నల్ కోసం ప్రయత్నించాడు. చావాలనుకుంటున్న అతనికి ఫోన్ చేసి ' నేను చస్తున్నా ' అన్నవాడికోసం ఇంత తాపత్రయపడటం అర్థం లేనట్టు తోచినా, అతని 25 ఏళ్ళ జ్ఞాపకాల్లో 17 ఏళ్ళు ప్రేమ్ తో, అతని స్నేహంతో నిండినవి అని తెలిసాక ఆశర్యం అనిపించదు. ఆ తాపత్రయం తోనే మరొక్కసారి కొండ అంచుకి చేరుకున్నా, ప్రయోజనం లేకపోయింది. సిగ్నల్ అందలేదు. అతనే మాత్రం ఆలస్యం చేయకుండా సిటీ వైపు పరుగు తీసాడు.
ఎక్కేటప్పుడు తొందరగా సాగిన అతని ప్రయాణం... ఇప్పుడు వేగంగా పడుతూ లేస్తూ పరిగెడుతున్నా ఎంతో ఆలస్యంగా అనిపిస్తోంది. " ప్రేమ్ " అనే ఒక్క మనిషి ముఖమే అతని మనసులో మెదులుతోంది. పరుగెడుతూనే ప్రేమ్ కి ఫోన్ కలపడానికి ప్రయత్నించాడు. నెట్వర్క్ ఇంకా అందట్లేదు. వేగం పెంచాడు. కను చూపు మేరలో మనిషి గాని, రోడ్డు గానీ కనిపించేట్లేదు. అతనీ ఆయాసాన్ని ఎంతో సేపు తట్టుకోలేడని తెలుస్తోంది, కాసేపు ఎక్కడైనా కూలబడాలి...తెలీకుండానే అతని కాళ్ళు నెమ్మదించాయ్, ఇంకాసేపటికి నిలిచిపోయి పక్కనున్న బండరాయి మీద పడ్డాడు. ఆయాసంతో రొప్పుతూ గస తీసుకుంటున్నాడు. " వాడికి చనిపోయేంత కష్టమేమొచ్చింది, నాకు తెలియకుండా ఏం దాచాడు ? " అనుకున్నాడు. వెంటనే, తాను కూడా ప్రేమ్ కి తెలియకుండా దాచిన తన ప్రేమ విషయం గుర్తొచ్చింది. అతని ముఖం లో మళ్ళీ విషాదం తొంగి చూసింది. మనసంతా ఉక్కిరిబిక్కిరైంది. తన ప్రేమను తలచుకున్న ప్రతిసారి ఇంత యాతనను తట్టుకోలేకే ఆత్మహత్యకు పాలబడ్డాడు. కానీ అదే ఆత్మహత్యకు తన ప్రాణ స్నేహితుడు సిద్ధమవుతున్నాడని తెలుసుకుని తట్టుకోలేకపోయాడు! కాసేపు విచిత్రంగా అనిపించింది. అప్పటికి తాను విశ్రాంతి తీసుకొనబట్టి 30 సెకండ్లు అయ్యింది. మనసు ఎంత వేగంగా, సంక్లిష్టంగా ఆలోచిస్తుందో. అతను లేచి నడవసాగాడు. రెండడుగులు వేశాడో లేదో, అతని జేబు లో ' జ్ జ్ జ్ ' అని ఫోన్ వైబ్రేట్ అయ్యింది. ఠక్కున బయటికి తీసి, ఆన్సర్ చేసాడు.
" హలో, రే.... " అవతలి నుంచి వినబడింది. " వివేక్, చెప్పు రా, ఏమైంది ? " " నీ మాట.... విని....డున్నావ్ ను.... " నెట్వర్క్ సరిగా లేదు. అవతల వివేక్ చెప్తున్న మాటలు సరిగ్గా వినిపించట్లేదు. " వివేక్, రేయ్ నీ మాటలు సరిగ్గా వినిపించట్లేదు రా " " హలో, ప్రేమ్.... ఎక్.... చ్చేయ్ " వివేక్ వైపు నుండి మాటలు సగం సగమే వినిపించడం కొనసాగింది. " ప్రేమ్ కేమైంది రా ? " ఆ సగం మాటల్లో ప్రేమ్ అనే పేరు వినిపించగానే అడిగాడు. " ....ట్నుంచి ..... ప్రయ్.... డ... చ్చావ్ " " ఏమంటున్నావ్ రా, అర్థం కావట్లేదు " అంటూ పక్కనున్న బండరాయి పైకెక్కాడు సిగ్నల్ కోసం..! " ప్రే... ఆ... డు " అని వివేక్ మాటలు ముక్కలుముక్కలుగా వినబడ్డాయ్. కానీ అందులోనే విషయం అర్థమైనట్టు అనిపించింది. కాసేపు మౌనంగా ఉండి, " ప్రేమ్ కి ఏం కాలేదు కదా రా ? " అని ధృవీకరించుకోడానికి మరోమారు అడిగాడు వివేక్ ని. " ప్రేమ్ ఆ... న్నాడు...నిమే...ల్లి...డు...రోజు... ర్టీ... తీసి చావ్... కుమ్.. స్తావ్ " వివేక్ నుండి అస్పష్టమైన మాటలు కొనసాగాయి. ఫోన్ కట్ చేసి
" ప్రేమ్ ఆత్మహత్య... ఎలా రా నువ్వు " అని గద్గదంగా గొణుక్కుంటూ వేగం పెంచి పరిగెత్తాడు. రెండు సార్లు కిందపడి దొర్లాడు. అతని ఒళ్ళంతా దుమ్ము లో స్నానమాడినట్టు ఉంది. " ప్రేమ్ కి ఏమయ్యుండదు...ఏమయ్యుండదు " అనుకుంటూనే అడుగులు వేస్తున్నాడు. కాస్త దూరం తర్వాత రోడ్డు కనపడటంతో అతని లో ఉత్తేజం కలిగింది. రోడ్డుపక్కన నిలబడి సిటీ వైపు వెళ్తున్న బండ్లను ఆపడానికి ప్రయత్నించాడు. అతడి వాలకం చూసి వాహనాలు వేగం పెంచి మరీ అతన్ని లెక్కచేయకుండా దూసుకెళ్ళసాగాయ్. ఖాళీగా వెళ్తున్న ఒక టాక్సీ మాత్రం ఆగింది. ఎక్కడికి, ఏమిటి అని అడక్కుండా చటుక్కున లోపలికెక్కేసాడు. టాక్సీ డ్రైవర్ అతని అవతారాన్ని చూసి కాస్త కంగారు పడ్డా, తర్వాత నీళ్ల బాటిల్ అందించాడు. రెండు గుటకలు వేసుకుని, ఆయాసంగా... " గచ్చిబౌలి " అంటూ... తన వాలెట్ తీసి డ్రైవర్ కిచ్చి, సొమ్మసిల్లి పడిపోయాడు. డ్రైవర్ కారు దిగి చుట్టుపక్కల చూసి, అతనిచ్చిన వాలెట్ తీసి చూసాడు. అందులో ఉన్న ఒక విజిటింగ్ కార్డు లో గచ్చిబౌలి అడ్రెస్స్ ఉంది. రెండు వేలు డబ్బులున్నాయి. ఆ డబ్బులు తీసుకుని, అందులోని అడ్రెస్స్ వైపు బండి కదిలించాడు. ట్రాఫిక్ ను దాటుకుని వచ్చేసరికి, దాదాపు రెండు గంటల ప్రయాణం. దారి మధ్యలో ఎక్కడా స్పృహలోకి రాలేదతడు. సమయం ఆరునర్ర కావస్తోంది. ఒక బిల్డింగ్ ముందు కారాపి, కార్డు లోని అడ్రెస్స్ అదేనని కన్ఫర్మ్ చేసుకుని, వెనుక సీట్లో అలాగే పడున్న అతన్ని లేపడానికి ప్రయత్నించాడు. లేవకపోవడంతో ముఖం మీద నీళ్లు చల్లాడు
TO BE CONTINUED