Written by Alamuru Sowmya On Facebook
ఈడియట్ లు, పోకిరి లు, భుక్తి కోసం ఏం పీకుతారో తెలీకుండా హీరోయిజం చూపించే లోఫర్ల మధ్య ఒక phd చేసే హీరో ట!! మళ్ళీ, phd-కెరీర్ కోసం ప్రేమని కాస్త పక్కకు పెట్టే హీరో ట!! We don't know what life throws at us. When it is decent enough then accepting it with dignity and making it a life is the best solution to be happy అనుకునే బలమైన హీరోయిన్ ట! దానికోసం హీరోని convince చెయ్యాలనుకుంటుందిట!! ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ ఉంటుందిట!
జీవితభాగస్వామితో ఫార్మాలిటీకి కూడా అబధ్ధం చెప్పని, మనసున్న, MBA చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తున్న రెండో హీరోట! హేవిటిది...అర్థంపర్థం ఉందా!! వెర్రా, పిచ్చా హీరో చదువుకోవడం ఏమిటి, విడ్డూరంగా!! హీరోయిన్ , హీరో కన్నా బలంగా ఉండటమేంటి!! అసలు మన ఇంట, వంట ఉందా ఇలాంటిది!! హవ్వ నవ్విపోతారు పక్క రాష్ట్రాలవారు వింటే!! ఒకసారి ప్రేమిస్తే తండ్రినయినా ఒరేయ్ గిరేయ్ అనాలి, కాబోయే మామ ని ఈకని పీకేసినట్టు పీకేయాలిగానీ, వాళ్ళ మాటలకి గౌరవం ఇవ్వడం ఏమిటి!! కెరీర్ లో నిలదొక్కుకోవాలి లాంటి వెర్రిమొర్రి ప్రయత్నాలేమిటి!!
తాళిబొట్టు మెడలో పడగానే పసుపు-కుంకం యొక్క పచ్చదనం-ఎర్రదనాల గురించి మాట్లాడాలిగానీ, జీవితం దాని గొప్పతనం, ఆనందంగా ఉండడం, ఒడిదుడుకులొచ్చినప్పుడు నిలబడి మన జీవితానికి సెకండ్ ఛాన్సు ఇవ్వడం లాంటి పిచ్చిమాటలేమిటి!! ఫారిన్ పిల్ల తగిలితే ఎగేసుకుపోవాలిగానీ, బెస్టుఫ్రెండు అనుకోవడం ఏమిటి! ఆ అమ్మాయి మానసికస్థితిని బాగుచేయాలనకోవడం ఏమిటి!! వీడెవడో మరీ వెర్రిమాలోకం!!
వంశం, ప్రతిష్ట, పరువు-గిరువు అంటూ వీరంగం ఆడాలి గానీ కూతురు-భర్త-ప్రేమికుడు ఈ సంబంధాల గురించి ఆలోచిస్తూ పిల్లల సుఖసంతోషాలు కోరుకునే తండ్రా!! బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉందా అసలు!! 'నిన్ను కోరి'...అసలు ఆ పేరేంటి! అంత కష్టంగా, అర్థంపర్థం లేకుండా! "నీకు నాకు డ్యాష్ డ్యాష్' అంటే సులువుగా అర్థమవుతుంది, జనాల మధ్యకి తేలికగా వెళుతుంది. హేవిటో!! బొత్తిగా బుర్రే వాడని సినిమా! కొంపదీసి తెలుగు సినిమా నిజంగానే మారిపోతోందా ఏమిటి!! నో..నో..నేనలా జరగనివ్వను, రెండోసారి చూసి ఫ్లాపుకి నావంతు సహాయం అందిస్తా!!
నాని, నివేద, ఆది, మురళీశర్మ ...ఇంకెప్పుడూ ఇలాటి సినిమాలు చెయ్యకూడదు, ఇంత పిచ్చిగా పాత్రల్లో జీవించకుండా వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూసి తీరాలి ఈ సినిమా! అప్పుడే వాళ్ళకి బుద్ధొస్తుంది!! ఆ!!