అర్ధం లేని ఆలోచనలు ఎంత ఆలోచించిన దొరకని సమాధానాలు మనసులో రేగెనే ఎన్నో ప్రశ్నలు నిద్రలేని రాత్రులు కునుకు తీస్తే నీ కలలు అంతులేని ఎదురు చూపులు ఎదొరొస్తే పెరిగాయి గుండె చప్పుడ్లు ఇవేనా ప్రేమకు సంకేతాలు ఆ భావన లోనే గడిపాను ఇన్నాళ్లు భయం, బాధను దాటుకుంటూ ఈ క్షణం నీ ఎదురుగా నించున్నాను ఎలా మొదలు పెట్టాలో తెలియక పదాలు పేర్చుకుంటున్నాను
"వచ్చి అరగంట అయింది. ఇలా మాట్లాడకుండా కూర్చోటానికేనా హైదరాబాద్ నుండి వచ్చింది"
"సారీ..సారీ.. ఇక్కడ కాఫీ బాగుంటుంది అంట.. ఆర్డర్ చేద్దాం"
"అదేదో అక్కడే తాగొచ్చుగా కాఫీ తాగటానికి ఇక్కడ దాకా రావాలా?"
"కాఫీ ఉన్నా.. నువ్వు ఉండవుగా"
"మాటలు బానే నేర్చావ్ అభి"
"రైటర్ ని కదా ఆ మాత్రం కూడా రాకపోతే కష్టమే"
"ఎలా ఉంది లైఫ్?"
నువ్వు లేకుండా కష్టంగా ఉంది. చుట్టూ ఎంత మంది ఉంది ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది. ముఖంలో చిరునవ్వు ఉన్నా నువ్వు నాతో లేవు అనే బాధ నా గుండెను బరువెక్కిస్తుంది. నా కథల్లో ఉండే ఆనందం నా జీవితంలోకి ఎపుడు వస్తుంది అనిపిస్తుంది. ప్రతి పేపర్ లో, ప్రతి కథలో, ప్రతి పదంలో, ప్రతి అక్షరంలో నీ మీద ఉన్నా ప్రేమను, నువ్వు నాతో లేవు అనే బాధను గుర్తుచేస్తుంది.
ఇవన్నీ నీతో చెప్పాలని ఉన్నా మౌనం నా బాధను కప్పేస్తుంది.
"ఏదో అలా నడుస్తుంది.. "
"మంచి మంచి వీడియోలు చేస్తున్నావ్. మంచి క్రేజ్ తీస్కొచుకున్నావ్.. ఏదో నడుస్తుంది అంట.. "
"ఎన్ని రోజులైందో కదా ఆయేషా, మనం ఇలా కూర్చుని మాట్లాడుకుని?"
"రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా ?"
"ఏమో నీతో ఇలా ఎదురుగా కూర్చుని మాట్లాడుతుంటే ఈ క్షణం ఇలానే pause అయిపోతే బాగుండు అనిపిస్తుంది."
"రైటర్ గారు మీరు కొంచెం మీ ప్రపంచం నుండి బయటకు రండి.."
తనే నా ప్రపంచం అని చెప్పాలని ఉంది. అది తనకి కూడా తెలుసేమో అని అనిపిస్తుంది . కానీ ఏదో భయం నాలో ఇంకా వెంటాడుతుంది. చూడగానే ప్రేమించి, నచ్చగానే ఐ లవ్ యు అని చెప్పే ఈ రోజుల్లో, ప్రేమ అనే పదానికి విలువలు తగ్గుతున్న ఈ కాలంలో, తనను నేను ప్రేమిస్తున్నా అని చెప్పటానికి నా మనసు సందేహించింది.
"హలో ... అభి గారు కొంచెం మీ ఆలోచనల నుండి బయటకు రండి."
" నా ప్రపంచం నుండి బయటకు రమ్మన్నావ్ కదా కొంచెం టైం పట్టింది."
ఇంతలో
"సర్ .. కాఫీ"
వచ్చి ఇంత సేపు అయినా ఇంకా తనతో ఏమి మాట్లాడమని వచ్చానో అది మాత్రం మాట్లాడలేదు. ఒక లవ్ లెటర్ రాయటానికి సినిమాల్లో అన్ని పేపర్లు ఎందుకు చింపుతారో ఇపుడు అర్ధం అయింది. లోపల ఎంతో మాట్లాడదామని ఉన్నా బయటానికి మాత్రం ఒక్క అక్షరం కూడా రావట్లేదు. ఇప్పుడు కాకపోతె మరలా నాకు ఈ ఛాన్స్ దొరుకుతుందో తెలీదు. ఎలాగన్న తనకు నా ప్రేమను ఇప్పుడు ఈ క్షణం చెప్పాలి.. చెప్పి తీరాలి... అలా గుండెల్లో ధైర్యం నింపుకుంటూ తన వైపు చూసాను.
"అయేషా. I just want to tell you something ."
"చెప్పు అభి.."
"I ......"
ఇంతలో ఫోన్ రింగ్ అయింది...
"ఎదుటా నీవే.. ఎదలోనా నీవే .... ఎటు చూస్తే అటు నీవే మరుగైన కావే.. ఎదుటా నీవే.. ఎదలోనా నీవే..."
To be continued...