Here's How This Warangal Techie's NGO Is Providing Quality Education To Underprivileged Children!

Updated on
Here's How This Warangal Techie's NGO Is Providing Quality Education To Underprivileged Children!

ఆరోజు స్కూల్ లో పరీక్ష జరుగుతుంది.. క్వశ్చన్ పేపర్ లో "మీకు నచ్చిన నాయకుని గురించి వివరించండి" అనే ప్రశ్న ఉంది. మూడవ తరగతి చదువుతున్న హర్షిత 24సంవత్సరాల మనోజ్ కుమార్ అన్న నా అభిమాన నాయకుడు, తను ఇంకా వారి టీం వల్లనే ఈరోజు నేను స్కూల్ లో ఏ ఇబ్బందులు లేకుండా చదువుకోగలుగుతున్నానని ఉద్విగ్నంగా వర్ణించి ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంది. ఇది ఆనందమే కదా.. నిజమైన సంతోషంలో చిరునవ్వుతో పాటు కన్నీరు కూడా వచ్చేస్తుంది. ఇలాంటి నవ్వులను 1500 మంది విద్యార్ధులలో పూయించిన మనోజ్ కుమార్ మరియు అతని టీం వారు సాగిస్తున్న సేవా ఉద్యమం గురించి మరింత తెలుసుకుందాం.

కష్టాలు చెబితే అర్ధం కావు అనుభవించితే తప్ప. మనోజ్ కుమార్ ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. వరంగల్ జిల్లా తొర్రురు మండలం చర్లపాలెం అనే గ్రామంలో నాన్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తుండేవారు. ప్రభుత్వ పాఠశాలకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళుతూ, కొన్ని సార్లు పస్తులు ఉంటూ, ఎన్నో ఆర్ధికపరమైన ఇబ్బందులను ఎదుర్కుని చదువును కొనసాగించాడు. "కాలం మనకు ఏనాడు శిక్ష వేయదు శిక్షణ ఇస్తుంది" అని మనోజ్ ఈ పరిస్థితుల ద్వారా స్పూర్తిపొంది ఉన్నత మార్కులతో చదువుతూ హైదరాబాద్ సి.బి.ఐ.టి లో ఇంజినీరింగ్ పూర్తి క్యాంపస్ సెలెక్షన్ లో మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు.

"నాన్న నా జీతంలో ఎక్కువ భాగం సమజానికి ఇవ్వాలని అనుకుంటున్నాను.. నేను చిన్నప్పుడు చదువుకోసం పడ్డ కష్టాలు కొంతమందైనా పడకుండా చేయాలని భావిస్తున్నాను" అని అమ్మనాన్నల అనుమతితో శ్రావణి కో ఫౌండర్ గా ఉద్యోగంలో చేరిన మొదటి నెలలోనే "100 Smile" (http://www.100smiles.org/) సంస్థను స్థాపించాడు. ఒకరోజు ఉద్యోగం వచ్చిన మొదటి నెలలో తన ఊరికి వెళ్ళాడు. ఆ గ్రామంలోని కొంతమంది విద్యార్ధులు చెప్పులు లేకుండా మళ్ళబాటలో నడుస్తూ స్కూల్ కి వెళ్తున్నారు. మనోజ్ కి తన గతం జ్ఞాపకమొచ్చింది, ఆ విద్యార్ధులలో తనని తాను చూసుకున్నాడు. వెంటనే పాఠశాలకు వెళ్ళి స్కూల్ లో ఉన్న విద్యార్ధుల పాదాల సైజ్ తెలుసుకుని 182మందికి స్కూల్ షూస్ అందించాడు. పిల్లలందరూ వారి కాళ్ళను మరోసారి ఆనందంగా చూసుకున్నారు, వారి బరువును షూస్ మోస్తున్నాయని సంబరపడ్డారు. మనోజ్(90521 01615) వారిని చూసి అనీర్వచనీయమైన ఆనందానికి లోనయ్యాడు..

ఎలా పనిచేస్తుంది.? మనోజ్ లక్ష్యం తనతో మొదలై ఉద్యమంగా మారడానికి పెద్దగా సమయం పట్టలేదు.. మొదట ఒకరు ఇద్దరు 50 మందితో కొనసాగిన ఈ సంస్థ సంవత్సరం తిరగకుండానే కోర్ టీం వరూణ్ రాజ్, సుధీర్, రామ్ ప్రసాద్, శిరీష, మధుకర్, రాకేష్ తో 300 మంది సభ్యులకు చేరింది. ఇందులోని ప్రతి సభ్యుడు నెలకు కేవలం 100 రూపాయలు డొనేట్ చేస్తుంటారు. ఇందులో నుండి ప్రతి ఒక్క రూపాయి విద్యార్ధి ఉన్నతి కోసం ఉపయోగించబడుతుంది.

365రోజులు 1500 మంది విద్యార్ధులు: మన తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా వెనుకుబడిన పాఠశాలలనే కోర్ టీం మొదట ఎంపిక చేసుకుంటారు. ఇందుకోసం కోర్ టీం పనిచేస్తుంది. చిన్నానగ్రామం(మహబూబాబాద్), జాజా పూర్ పాఠశాల(మహబూబ్ నగర్), గరుకూర్తి పాఠశాల(సంగారెడ్డి), మల్కీజ్ గూడ పాఠశాల(రంగారెడ్డి), చర్లపాలెం(మహబూబాబాద్), ఉట్నూర్ పాఠశాల(నల్గొండ) లలో 100 స్మైల్స్ పాఠశాల పూర్తిగా కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చివేసింది. డిజిటల్ లైబ్రైరీ, ప్రొజేక్టర్, ఆట వస్తువులు, లైబ్రరీ, యోగా మెడిటేషన్ కొరకు ప్రత్యేక కోచింగ్ తదితర అన్నిరకాల సౌకర్యాలతో ఉపధ్యాయులు ఊహించనంత మెరుగైన సౌకర్యాలతో మార్చివేశారు. ప్రస్తుతం మరో 20 స్కూల్స్ ను సమూలంగా మార్చడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఒక వ్యక్తి తలుచుకుంటే దేశంలో ప్రతి ఒక్క విద్యార్ధిని, ప్రతి ఒక్క పాఠశాలను మర్చగలడు అవును.. ఒక వ్యక్తి చేస్తున్న పనిలో నిజాయితీ, నిబద్ధత ఉంటే ఒకడిని చూసి మరో పది మంది మారుతారు వారిని చూసి మరో వందమంది.. నాకెందుకు అని ఒక్కడు అనుకుంటే ప్రపంచం మారే అవకాశం ఉందా.?