2015 అక్టోబర్ ట్రైనింగ్ అకాడమీలో దేశ భద్రతను తమ బాహువులపై మోసేందుకు 250 మంది కాబోయే ఆర్మీ జవానులకు ట్రైనింగ్. 250 మందిలో 30 మంది మహిళలు. అందులో భావన కస్తూరి ఒకరు. ప్రతిరోజు 50 కిలోమీటర్ల రన్నింగ్, వుషింగ్స్, ఫైరింగ్ ఇలా ట్రైనింగ్ లో పురుషులకు ధీటుగా, చాలా సార్లు వారిని అధిగమంచి వేగంగా బుల్లెట్ లా దూసుకుపోతుండడం చూసి ఆర్మీ ఆఫీసర్లు సైతం ఆశ్చర్యపోయేవారు. పై ఆఫీసర్లు ఏ పనిని అప్పగించినా గర్వపడేలా పూర్తిచెయ్యడంతో చిన్న వయసులోనే లెఫ్ట్నెంట్ ఆఫీసర్ స్థాయికి చేరుకుని 2019 రిపబ్లిక్ వేడుకలలో 144 పురుష సైనిక దళానికి మహిళ కమాండర్ గా నడిచి చరిత్ర సృష్టించింది మన హైదరాబాదీ అమ్మాయి.
మల్టీ టాలెంటెడ్: 2010లో ఢిల్లీలో జరుగుతున్న రిపబ్లిక్ వేడుకలకు భావన వెళ్ళింది. అక్కడ సైనికుల పరేడ్, శకటాలు, సైనిక వందనాలు, వారి డ్రెస్సింగ్, క్రమశిక్షణ.. తనలో లక్ష్య నిర్మాణానికి కారణమయ్యాయి. అప్పుడే అనుకుంది ఏదో ఒకరోజు యూనిఫామ్ వేసుకుని ఇదే గ్రౌండ్ లో కవాతు చెయ్యాలని ఆర్మీ ఆఫీసర్ కావాలని.. అమ్మ శశిరేఖ సింగిల్ పేరెంట్. కార్మిక న్యాయస్థానంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తుంటారు. జీతం పరంగా హద్దులున్నా జీవితంలో ఏ హద్దులను అమ్మ విధించలేదు. కూతురి ఇష్టాలను కాదనలేదు, అందుకే భావన వివిధ కళలలో బెస్ట్ అనిపించుకుంది. ఐదు సంవత్సరాల వయసులోనే కూచిపూడి మొదలుపెట్టి మనదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ప్రదర్శనలిచ్చారు.
భావన కస్తూరి హైదరాబాద్ చిక్కడపల్లి అరోర కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎన్.సి.సి లో జాయిన్ అయ్యారు.. అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా బెస్ట్ క్యాడేట్ గా మెడల్ కూడా అందుకున్నారు. అలాగే భావన కర్ణాటక సంగీతంలో మంచి ప్రావీణ్యురాలు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుండి సంగీతం, నాట్యంలో డిప్లొమా పూర్తిచేసింది, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, రాకెట్ లాంచింగ్, హార్స్ రైడింగ్ మొదలైన రంగంలోనూ భావన ఉన్నతురాలు.
ప్రతి యుగంలోను కాలంలోనూ అప్పటివరకూ ఉన్న సత్యాలను మార్చివేయడానికి అసంఖ్యాకంగా జన్మిస్తునే ఉన్నారు. ఆర్మీలో పనిచేయడానికి అబ్బాయిలే జంకుతారు, భావన ఆర్మీ అంటే భయపడలేదు, ఎప్పుడెప్పుడు సెలెక్ట్ అవుతానా ట్రైనింగ్ లో ఎప్పుడు పాల్గొంటానా, ఎప్పుడు దేశానికి సేవ చేస్తానా అనే ఉత్సాహం చూపించింది. అమ్మ కూడా ఏ అనుమానాలను తనకు ఇవ్వకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. భావన భర్త ఇండియన్ ఆర్మీలోనే డాక్టర్ గా పనిచేస్తుంటారు. "యూనిఫామ్ వేసుకుంటే బలమైన శక్తి వస్తుంది, నరనరాల్లోనూ దేశభక్తి ప్రవహించి ఉద్వేగానికి లోనవుతాను, అసలు భారత దేశ సైన్యం గురుంచి వివరించడానికి తనకు మాటలు కూడా రావని భావన అంటారు.