మనం కొత్త ఇల్లు కట్టినప్పుడు ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు తప్పక సత్యనారాయణ స్వామి పూజ చేస్తుంటాం ఎందుకంటే ఆ స్థలంలో ఎటువంటి దోషాలు కాని, ఏ శని ఉన్నాకాని భవిషత్తులో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ సత్యనారాయణ స్వామి దీవెనలతో మాయం అవుతాయని నమ్మకం.. అంతటి మహీమన్విత సత్యదేవుని ఆలయం మన తెలగు రాష్ట్రంలో ఉంది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి నగరానికి 80కిలోమీటర్ల దూరంలో శ్రీ సత్యనారాయణుడు కొలువై ఉన్నాడు.
ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో తిరుపతి తరువాత అన్నవరంకు అంతటి ప్రాముఖ్యత ఉంది.. స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండ గా మారుతాడు. ఈ కొండమీదనే అన్నవరం ఆలయం ఉంది.
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు. మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన ప్రతిష్టించారు.
ఇక్కడి పంపానది అత్యంత మహిమమైనదిగా పరిగనిస్తారు. భక్తులందరు దర్శనానికి ముందు స్నానాలు చేసి దర్శించుకుంటారు.. ఇక ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అన్నవరం ప్రసాదం.. ప్రసాదం మాత్రం మామూలుగా ఉండదు భక్తులు ఎలా చెప్తారంటే ప్రసాదంతో పాటు ఆకుకూడా తినాలనిపిస్తుందనంటారు.. అమృతం అంటే అన్నవరం ప్రసాదం అని చెప్పుకుంటారు.. ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదనం జరుగుతుంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి. బస్ ద్వారా కూడా గుడికి చేరుకోవచ్చు కాని ఇక్కడ చాలా మంది భక్తులు నడక మార్గాన మెట్లు ఎక్కి దర్శించుకుంటారు.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తులు ఇక్కడ పూజలందుకోవడం మరో గొప్ప విశేషం.
Annavaram Satyanarayana Swamy!Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.
