Contributed By Rohith Sai
ఆ రోజు వాడి పుట్టినరోజు, వాళ్ళమ్మ వీడిని కనడానికి, చావు అంచులు వరుకు వెళ్ళొచ్చిన రోజు. వాడికి అందుకే అది నచ్చని రోజు.
ఎప్పటిలానే వాడు సాగరతీరంలో, ఏకాంతంగ గడుపుతున్నాడు. సాయం సంధ్య వేళ, చల్లటి చిరుగాలి, నీడ పట్టున వాడు, వాడి ముందు ఈ దృశ్యం.
————————————————— ఒక చిన్నారి ‘అల’ పరుగెడుతూ వచ్చింది, అలిసిన ఆ తీరాన్ని ప్రేమతో స్పృశించింది. తీరం ఒక తల్లిలా మురిసిపోయింది, ‘అల’ తిరిగి సంద్రంలో కలిసి ’పోయింది’. ఆ తల్లి ముఖం మళ్ళి చిన్నబోయింది, ఇదంతా ఓ రెప్పపాటులో జరిగిపోయింది. —————————————————
మౌనంగా చూస్తుండిపోయాడు..... తీరంలో ‘అమ్మ’ని చూసాడు వాడు, ‘అల’లో వాడినే చూసుకున్నాడు. జ్ఞాపకాల దొంతరలు వాడి మనస్సు పొరల్లో కదులుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం....
వాడిది మధ్య తరగతి కుటుంబం, అవి ఎన్నెన్నో ఆశలు, ఏవేవో కలలతో పాటు, కొద్ధిగా బరువుని కూడా మోసే బ్రతుకులు. పగళ్ళు పరుగుప్రయాసలతో సాగిపోయినా... రాత్రిళ్ళు ప్రేమానురాగాలతో గడిచిపోయేవి.
భవిష్యత్తుకై సొంతూరుని విడిచాడు, వాడి కుటుబాన్ని వదిలాడు. ఎక్కడో వేరే పట్నంలో కొలువు, కుటుంబానికి దూరంగా నెలవు.
ఎప్పుడో పండక్కో, పబ్బానికో గాని ఇంటికి వెళ్ళేవాడు. ‘ఎందుకు అలా ?’ అని అడగోద్దు, వాడి దగ్గిర అప్పుడు సమాధానం లేదు. ఉద్యోగాదాయ-కాలచక్రాల్లో బంధి అయ్యాడు. వాడికప్పుడు ఆ ప్రవాహంలో పడి సాగిపోడమే తప్ప ఆగిపోడము చేత కాలేదేమో బహుశా!!
ఆనందంగా ఇంటికి, తన వాళ్ళ చెంతకి, చేరేవాడు, ప్రేమగా వెళ్ళి, వాళ్ళ అమ్మని వెనక నుంచి హత్తుకునేవాడు. అప్పటి వరుకు వాడిపోయిన వాళ్ళమ్మ శరీరం, వాడి స్పర్శతో వెయ్య వాట్లు బల్బ్ లా వెలిగిపోయేది.
మహా అయితే ఓ నాలుగు రోజులు ఉండేవాడు ఏమో, తిరిగి పట్నానికి పోయేవాడు. అమ్మ ముఖం మళ్ళి వాడిపోయేది, యాంత్రికం ఆమె జీవితాన్ని ఆవరించుకునేది.
కళ్ళమ్మట దారగ నీరు కారుతుంటే, వాడికి గతం గుర్తొచ్చింది. వాడికి ‘అమ్మ’ గుర్తొచ్చింది.
వాడి మనస్సు..... సూర్యుడు అస్తమించి, చీకటి పడుతున్న ఆకాశంలా ఉంది. ఉన్నట్టుండి వాడి జేబులో ఫోన్ మోగింది. బైటకి తీసి చూసాడు....
“అమ్మ calling....” సరిగ్గా ఇదిగో అప్పుడే.... రోడ్ ప్రక్కన దీపపు స్థంభాలన్ని ఒక్కసారిగ ఆ దారి పొడువునా వెలుగులు నింపాయి. వాడి పెదవులు విరిసాయి.... కళ్ళు విప్పారాయి.