మన సాంప్రదాయక వంటలు మనకు కేవలం రుచిని మాత్రమే ఇవ్వదు ఎంతో ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అందుకే ఎన్ని సంవత్సరాలైనా కాని వాటి విలువ తగ్గడం లేదు, ఒకవేళ వాటి విలువ ఒక్కోసారి తగ్గినా కాని మళ్ళి ఒక చక్రంలా తిరిగి అలాంటి ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం చదువుతున్న అంబాజీపేట పొట్టిక్కలు రుచి విషయంలో మాత్రమే కాదండి ఆరోగ్యానికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.
మిగిలిన ఫుడ్ దొరికినట్టు ఈ పొట్టిక్కలు మరేచోట అంతగా దొరకవు. మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న లంక గ్రామాలలో వీటిని ఎక్కువ తయారుచేస్తారు. మరీ ముఖ్యంగా అంబాజీపేటలో వీటిని అధికంగా తయారుచేస్తారు. మన తెలుగువారే మొదట తయారు చేసిన వంటలలో "అంబాజీపేట పొట్టిక్కలు" కూడా ఒకటి అని గర్వంగా చెప్పుకుంటారు అక్కడి ప్రజలు. ఇవి కూడా కొంచెం ఇడ్లీలానే కనిపిస్తాయి, వండడం కూడా ఇడ్లీలానే వండుతారు. కాని ఇడ్లీ రుచికి పోట్టిక్కల రుచికి చాలా తేడా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఆవిరితో ఉడికిస్తారు, మరికొంత మంది డైరెక్ట్ గా మంట మీదనే వండుతారు.
పనస ఆకులను ఓ చిన్ని బుట్టగా తయారు చేసి అందులో ఇడ్లీ పిండి వేసి నీటి ఆవిరితో వీటిని ఉడికిస్తారు(కొంతమంది అరటి ఆకులలో ఉడికిస్తారు). పనస ఆకులో వీటిని ఉడికించడం వల్ల రుచి అద్భుతంగా ఉండడంతోపాటు, పనస ఆకులో శరీరంలోని వేడిని తీసేసే లక్షణం ఉండడం వల్ల పొట్టిక్కలు అటు రుచికి, ఇటు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇక వీటికి ఉన్న అభిమానుల గురించి చెప్పాలంటే ఒక్కసారి పొట్టిక్కలు రుచి చూస్తే కేవలం ఆ పొట్టిక్కల కోసమే కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఊరికి వచ్చేసే భోజన ప్రియులు కూడా ఉన్నారు.