ఎలా ప్రారంభమయ్యింది.?
సుధాకర్ రెడ్డి గారు చిన్నతనం నుండి బ్రిలియంట్ స్టూడెంట్. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం అనే గ్రామంలో పుట్టి పెరిగినా కాని ఆలోచనలకు పరిధి లేదు, ప్రపంచస్థాయిలో ఉండేవి ఆలోచనలు. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం చెన్నై జీఈ కంపెనీలో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా జాబ్ చేస్తున్నారు. అమ్మ నాన్నలను కలుసుకోవడానికి గుంటూరు వచ్చే ప్రతిసారి బస్ ఏజెంట్ల మోసాలకు ఇబ్బంది పడేవాడు. డబ్బు విషయం కన్నా తెలిసి తెలిసి ఒకరి ద్వారా మోసాగింపబడడమే మరింత ఇబ్బందికి గురిచేసేది. పోనీ ఆన్ లైన్ లో ప్రయత్నిద్దామంటే టికెట్స్ దొరికేవి కావు. వారితో మాట్లాడుదామంటే ఒక్క ఏజెంట్ అనే కాదు దాదాపు ఏజెంట్లందరూ అలాగే ఉన్నారు. ఇంటర్నెట్ వాడకం అప్పుడప్పుడే పెరుగుతుంది ఇదే మంచి సమయం అని అభిబస్ స్థాపించాలనే ఆలోచన మొదలయ్యింది.
ప్రారంభంలో కష్టాలు:
అందరూ వెళ్ళే దారిలో వెళితే కొత్తది ఏది బయటకు రాదు. అలాగే ఆ దారిలో అందరి కన్నా మొదట వెళ్ళే వ్యక్తి మీద వ్యతిరేకత కూడా ఉంటుంది. వీటన్నిటిని సుధాకర్ గారు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అభిబస్ కాన్సెప్ట్ చెప్పగానే నాన్న రామలింగారెడ్డి గారు అస్సలు ఒప్పుకోలేదు. కొంతకాలానికి సుధాకర్ గారి ఆలోచనల మీద నాన్నకు సానుకూలత ఏర్పడింది. నాన్న పెట్టుబడి కోసం ఇచ్చిన 10 లక్షలతో యుద్ధభూమిలోకి దిగారు. 2008 మే 9న అప్పటి రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మి నారాయణ గారు ప్రారంభించారు. ప్రారంభమయితే అయ్యింది కాని మొదటి 3 నెలల వరకూ ఒక్క బుకింగ్ కూడా జరగలేదు. దీంతో మరో 5 లక్షలు అప్పుచెయ్యాల్సి వచ్చింది. మొదట 10 ఆ తర్వాత 5 వెరసి పెట్టుబడి పూర్తిగా 15 లక్షలయింది. ఆపరేటర్లు ఎవ్వరూ ముందుకు రాకపోవడం, అసలు బుకింగ్స్ లేకపోవడంతో కంపెనీ మూసివెయ్యాల్సిన పరిస్థితికి వచ్చేసింది
ఓటమిని ఓడించాడు:
ఈ పరిస్థితిలో మరో సంస్థలో రూ.40,000 శాలరికి జాబ్ లో జాయిన్ అయ్యాడు. అభిబస్ ను మనస్పూర్తిగా నమ్మి ప్రారంభించారు, కాని ఉద్యోగాన్ని మాత్రం మనస్పూర్తిగా "ఇదే నా జీవితం" అని జాయిన్ కాలేదు. అందుకే కేవలం జాయిన్ ఐన రెండు రోజులకే రాజీనామా చేసి తిరిగి అభిబస్ అఫీస్ కు వచ్చేశారు. అప్పుడున్న ఆపరేటర్ల దగ్గర సాఫ్ట్ వేర్ లేదు. తను తయారుచేసిన సాఫ్ట్ వేర్ ను వారికి రెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదటినెల రూ. 50,000 ఆదాయం వచ్చింది. అలా నెమ్మదిగా జరుగుతున్న పెరుగుదలతో సంవత్సరం తర్వాత నాన్న పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇచ్చేశారు. ప్ర్తెవేట్ ఆపరేటర్లతో పాటు 2012లో APSRTC నుండి కూడా కాంట్రాక్టు రావడంతో అసలైన గెలుపు ప్రయాణం మొదలయ్యింది.
సక్సెస్ రేట్:
2013 నుండి ఆన్ లైన్ లో టికెట్లు అమ్మడం మొదలయ్యింది కాని అంతకు ముందు వరకు కూడా బస్ ఆపరేటర్లకు సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీగానే కార్యక్రమాలు సాగాయి. ఇంతకుముందు ఆపరేటర్ల దగ్గరికి వెళ్లి టికెట్లు బుక్ చేసుకునేవారంత ఇప్పుడు నేరుగా తమ స్మార్ట్ ఫోన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ లో ఈ మార్పుల వల్ల అభిబస్ మంచి ప్రగతిని సాధిస్తుంది. అభిబస్ ప్రతిరోజూ 30,000 కు పైగా టికెట్లు అమ్ముతుంది(పండుగ రోజుల్లో ఎక్కువ ఉండొచ్చు), మూడు కోట్లకు పైగా యాప్ డౌన్ లోడ్స్, ఇప్పటివరకు 5 కోట్లకు పైగా టికెట్ల అమ్మకాలు జరిపింది. 15 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన అభిబస్ ప్రస్తుత టర్నోవర్ రూ.600 కోట్లకు చేరుకున్నది.
అభిబస్ కు పోటీగా 20 కి పైగా వివిధ కంపెనీలు వచ్చాయి. కాని అవ్వేమి అభిబస్ ను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం బస్ ఆపరేటర్లకు సాఫ్ట్ వేర్ అందించే విభాగంలో 40% వాటా ఆక్రమించుకుంది. సుధాకర్ రెడ్డి గారు అభిబస్ లోనే విప్లవాత్మక మార్పులు చేశారు. భారతదేశంలో మరెక్కడా లేనివిధంగా అభిబస్ లో మొదటిసారి ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ను కూడా ప్రవేశపెట్టారు. విజేతలు కేవలం ఒకే ఒక్క గెలుపుతో సంతృప్తి చెందరు. ఒక్క గెలుపుకే సంతృప్తి చెందితే Update కాలేరు. "ఒక్కో ఆలోచన ఒక్కో కష్టం ఆశిస్తుంది, ఒక్కో పథకం ఆశిస్తుంది దానిని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత దగ్గరిగా ఉంటుంది గెలుపు" అని అనడానికి అభిబస్ సక్సెస్ ప్రస్తుత ఉదాహరణ.