Contributed By Hari Atthaluri
నిద్ర లేని రాత్రి.. నిద్ర రాని రాత్రి.. వినటానికి ఒకేలా ఉన్నా.. వాటి మధ్య చాలా తేడా ఉంది.. తను ఉన్నప్పుడు నావి "నిద్ర రాని రాత్రులు" ఆగకుండా సాగిపోయే మా ఊసులు వినే ఓపిక లేక ఆ రాత్రే హాయిగా నిద్ర పోయేది, మేము ఎలాగూ మేల్కొనే ఉంటాం గా అని. తను లేనప్పుడు నావి "నిద్ర లేని రాత్రులు".. అందులో కన్నీళ్లు ఉండవు..కోపం ఉండదు.. బరువు గా ఉండే ఆలోచనలు.. భారం గా గడిపే క్షణాలు , ఇవి మాత్రమే ఉంటాయి..
ఈ రాత్రి ఎంత ఓదార్చినా.. ఏమార్చినా.. బలవంతంగా నన్ను నిద్ర పుచ్చినా.. కలలో కూడా తనే వస్తుంది కదా ! ఇంకెందుకు పడుకోవటం...!
ఈ లాక్ డౌన్ వల్ల తను మరింతగా గుర్తు వస్తుంది...పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది... అలా నాది కలో..నిజమో తెలియని మొన్న రాత్రి.. తను నాకు ఫోన్ చేసింది.. ఆరు సంవత్సరాల తన కోపం ఆవిరి అయ్యిందేమో, ఆపకుండా మాట్లాడుతుంది... ఆ మాటలు.. "నా గురించి ఇంకా ఆలోచిస్తున్నావా అని తను అడిగిన ప్రశ్న దగ్గర ఆగిపోయాయి " బదులు గా ఒకే ఒక్క మాట చెప్పా.. ఆలోచించటం మాత్రమే కాదు.. "అంతే ఆరాధిస్తున్నా అని"
ఫోన్ కట్ ఐయ్యింది.. చాలా రోజుల తర్వాత ప్రశాంతం గా నిద్ర పోయాను ఏమో, చాలా లేట్ గా లేచాను...
ఫోన్ చూస్తే call me when you are free అని ఓ మెసేజ్ ఉంది.. Call history చూస్తే నైట్ టైమ్ ఒక కాల్ ఉంది...
అప్పుడు అర్థం అయ్యింది.. అది కల కాదు అని.. నా భారం దిగబట్టే అంత ప్రశాంతం గా నిద్ర పోయాను అని..
ఇది అంతా నిజమా కాదా అన్నట్టు ఫోన్ చేసా.. As usual మొదటి రింగ్ కే ఎత్తింది. హమ్మయ్య ! లేచావా అని అడిగింది.. చాలా రోజుల తర్వాత బాగా నిద్ర పోయాను.. Sorry అన్నాను.. "పర్లేదు..ఎన్నో రోజులు నా గురించి వెయిట్ చేసి ఉంటావు... నీ కోసం ఈ కొంచెం సేపు వెయిట్ చేయలేనా అని నవ్వుతుంది"
అవును మేడం, రోజులు కాదు సంవత్సరాలు.. ఆ మాట నేను అనగానే నిశ్శబ్దం.. రెండు నిముషాల తర్వాత.. తనే మాట కలిపింది.. "ఒకప్పుడు నీ దగ్గర ఫుల్ గా వాగేసి.. తిట్టేసి..నేనే అరిచేదాన్ని కదా.. ఇపుడు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావటం లేదు...
Six years, long time in anyone's Life.. Sorry for everything " "నీ కన్నా నాకు writing career యే ఎక్కువ ఇష్టం" అని నువ్వు అనగానే నాకు చాలా కోపం వచ్చింది " నీకోసం నేను అంత చేస్తే నా ప్రేమ ని నువ్వు తక్కువ చేశావ్ అనిపించింది.. కానీ చిన్నగా నా తప్పు అర్ధం అయ్యింది.. నువ్వు ఎప్పుడూ నన్ను నా ఇష్టం కే వదిలేసావు.. నేను మాత్రం అది కాదు..ఇది కాదు అని నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను.. కానీ నువ్వు ప్రతిదీ నవ్వుతూ ఒప్పుకున్నావు.. అలా అని నాకోసం నీ passion కూడా మార్చుకో అని అడగటం నా తప్పే అని అర్థం అయ్యింది.. కానీ అప్పటికే చాలా లేట్ ఐయ్యింది.. ప్రతి రోజూ నీ ఆలోచనల కన్నా తప్పు చేసా అని గిల్టీ ఫీలంగ్ యే ఎక్కువ ఉండేది... ఇలా కాదు అని నా కెరీర్ మీద నేను ఫోకస్ చేసా... ఆలోచనలు ఏం రాకుండా ఉండటానికి వీకెండ్ కూడా ఎదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నా.. అలా అలా నాకు తెలియకుండానే.. ఇలా 6 సంవత్సరాలు అయిపోయాయి... కెరీర్ ఐతే సెట్ ఐయ్యింది కానీ నేనే ఇంకా సెట్ అవ్వలేదు అని అర్థం అవుతుంది... నోటీస్ పీరియడ్ లో ఉన్నా, లాక్ డౌన్ వల్ల హైదరాబాద్ లోనే ఉండిపోయా ఒక్కదాన్నే... ఈ ఒంటరి తనం చాలా నేర్పిస్తుంది రా! చాలా గుర్తు చేస్తుంది! మన ఉనికి ని.. మన పరుగుని.. ఇన్ని రోజుల మన జర్నీ ని.. మనకి రివైండ్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది రా! ఈ కరోనా వచ్చి ఇన్ని రోజులు నేను దూరం పెట్టిన ఒంటరితనం ని మళ్లీ నాకు పరిచయం చేసిందిరా, అవును నువ్వు లేని ఆ ఒంటరితనం ని మళ్లీ నాకు పరిచయం చేసింది.. నీ గురించి మళ్లీ ఆలోచించేలా చేసింది.. నా చుట్టూ, నా కాంటాక్ట్ లిస్ట్ లో ఇవాళ ఎంత మంది ఉన్నా, ఇలా ఒంటరి గా కూర్చుంటే మళ్లీ నువ్వే గుర్తు వస్తున్నావురా ! ఆలోచిస్తే... అమ్మ కి నాన్న ఉన్నాడు.. అక్క కి బావ ఉన్నాడు.. వాళ్ళ ప్రపంచం ఇవాళ వాళ్ళ పక్కనే ఉంది.. అలా నాకు అంటూ ఎవరు అనుకుంటే నువ్వు తప్ప నాకు ఇంకొకరు కనిపించట్ల.. నా ప్రపంచం కి దూరం గా.. ఇన్ని రోజులు వేరే ప్రపంచం లో నా ఆనందం వెతుక్కుంటూ ఒంటరి తనంని దాచేసి బ్రతుకుతున్నా అనిపించింది ! అలా నేను పరిగెత్తిన ప్రపంచం ఇవాళ ఆగిపోయింది.. ఎక్కడ వాళ్ళని అక్కడే ఆపేసింది.. ఎవరిని ఎవరినీ కాకుండా చేసింది.. అందులో ఉన్న వాళ్ళకి ఇన్ని రోజులు నా అవసరం కొంత వరకే, ఇప్పుడు అది కూడా లేదు అని అర్థం అయ్యింది..
అందరూ ఒక రోజు ఫోన్ చేసి ఆగిపోయారు, ఎలా ఉన్నావు అని ! ఎదో formality అన్నట్టు.. మళ్లీ ఓ మెసేజ్ కూడా లేదు.. ఆ ప్రపంచం లో మెషిన్ లు.. మెషిన్ లోనే మాటలు.. మెషిన్ లాంటి మనుషులు మాత్రమే ఉన్నారు.. అందులోనూ.. మనసు నుంచి వచ్చే మాటల కన్నా.. ఆశ పడే కళ్ళు, అవకాశం కోసం చూసే చేతలే ఎక్కువ
వాళ్ళందరికీ నిన్ను చూపించి... ఇదిగో నేను వీడికే సొంతం.. వీడికి మాత్రమే సొంతం..అని గట్టిగా అరవాలి అనిపించేది"
ఎవ్వరినీ ఎవ్వరికీ కాకుండా చేసిన ఈ టైమ్ నన్ను ఒక question వేసింది ! నేను ఎవరికి అవసరం.. నాకు ఎవరు అవసరం అని?? రెండిటికీ ఆన్సర్ నువ్వే... అవును... నువ్వే.. ఇన్ని రోజులు నేను నాకోసం బ్రతికా.. ఏం సాధించా అంటే ఏమో అర్దం కావాట్ల.. "బ్యాంక్ లో దాచుకున్న మనీ కి ఇంట్రెస్ట్ వస్తుంది కానీ నాకే దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది.. ఇవాళ ఇంట్లో కూర్చున్న చాలా మందిది ఇదే పరిస్థితి..ఉండటానికి ఉన్నారు.. కానీ హ్యాపీగా ఉన్నారా అంటే ఆన్సర్ ఇవ్వరు"
Writing కూడా ఒక కెరీర్ యేనా ఆ రోజు నిన్ను అన్నా.. కెరీర్ అంటే డబ్బు ఇచ్చేదే కాదు.. మనసుకు నచ్చేది, హ్యాపీనెస్ తెచ్చేది అని నిన్ను చూశాకే అర్దం అవుతుంది...
అక్షరం కి ఇంత విలువ ఉందా అని ఇప్పుడు అర్దం అవుతుంది.. నువ్వు రాసే ఈ మాటలకి ఇవాళ నీ కంటూ అభిమానులు ఉన్నారు. నీకు దూరం గా ఉన్నా.. నువ్వు రాసినవన్ని చదువుతూ నీకు దగ్గర గా ఉన్నా.. నాకు ఎవ్వరూ ఇవ్వని ధైర్యం.. నువ్వు రాసే మాటలు ఇస్తున్నాయి రా.. ఇవి చదువుతుంటే నువ్వే మాట్లుడుతున్నట్టు ఉంది..నీతోనే ఉన్నట్టు ఉంది..
నీ దగ్గరకి చాలా సార్లు వచ్చేద్దాం అనుకున్నా.. అహం కానీ. మొహమాటంగానీ.. నేను చేసిన తప్పు వల్ల కానీ.. నీ దగ్గర తక్కువ ఐపోతాను ఏమో అనీ.. "వంద ఆలోచనలు కలిసి ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా చేశాయి" నీకు నాకు దూరం ఒక ఫోన్ కాల్ అంతే ఐనా, నా ప్రాణం ఆ ఒక్క ఫోన్ కాల్ లోనే ఉంది అని తెలుసుకోవటానికి నాకు ఆరేళ్లు పట్టింది.. ఐనా ప్రాణం దగ్గర పంతం ఏంటి ? నా పిచ్చి కాకపోతే ! ప్రేమ లో పంతాలు ఉండాలి, కానీ ఆ ప్రేమ నే దూరం చేసుకునే అంత పంతం ఉండకూడదు కదా! చచ్చే లోపు నీకు ఈ మాటలు నీకు చెప్తానో లేదో అనుకున్నా.. కానీ ఈ కరోనా.. దాని వల్ల వచ్చిన చావు భయం. రెండూ కలిసి. ఈ మాటలు నీకు చెప్పేలా చేశాయి..
Infact నీ మాటలే నన్ను ఇలా మాట్లాడేలా చేస్తున్నాయి.. చావు కన్నా ప్రేమ గొప్పది కదరా అని తను చెప్తుంటే తన మాటల్లో ఏడుపు వినిపిస్తుంది..
నేను వెంటనే ఏంటి ఏం అయ్యింది అన్నా ?? ఏం లేదు..ఒక్క నిముషం అని ఫోన్ పక్కన పెట్టి తను ఏడుస్తునే ఉంది.. నాకు ఆ ఏడుపు మాత్రమే వినిపిస్తుంది.. తను ఏడవటం నేను ఇప్పటి వరకు చూడలేదు. అసలు అక్కడ ఏం అవ్తుంది నాకు అర్దం కావటం లేదు... ఇంతలో ఎవరో ఫొన్ ఎత్తి మేడం ఏడుస్తున్నారు.. మళ్లీ చేయండి అంది.. తను ఎక్కడ ఉంది, మీరు ఎవరు అని అడిగా.
మేడం isolation ward లో ఉన్నారు అని... నేను మేడం కి ట్రీట్మెంట్ ఇస్తున్న నర్స్ ని అని... షాక్ కొట్టినట్టు ఉంది ఆ ఒక్క మాట కి ఫస్ట్ టైమ్ నా ప్రాణం పోతున్నట్టు ఉంది.. అది నాకు తెలుస్తుంది..
నా గుండె నా కోసం ఒక్కసారే కొట్టుకుని మిగతా అన్ని సార్లు తన కోసమే కొట్టుకుంటుంది ఏమో నాకు ఊపిరి కూడా అందటం లేదు... ఎప్పటికి ఐనా తను వస్తుంది అనుకున్నా కానీ ఆ రోజు ఇలా వస్తుంది అని ఎప్పుడూ అనుకోలా.. కరోనా వల్ల కలిశాం అని అనుకునే లోపు.. ఈ కరోనా వల్ల శాశ్వతం గా ఒకరికి ఒకరం దూరం అయిపోతామా అనే ఊహే ఊపిరి ఆపేస్తుంది...
చావు మన దాకా వస్తె అది భయం... మనం ప్రేమించిన వాళ్ళకి వస్తె మాత్రం ఓ మినీ సైజ్ నరకం.. ఇన్ని రోజులుగా తను ఎంత ఒంటరి తనం చూసి ఉంటుంది.. ఎన్ని సార్లు ఏడ్చి ఉంటుంది.. ఈ ఆలోచనల మధ్యే మళ్లీ ఫోన్ చేసా తనకి... నా మాటల్లో మాత్రమే ధైర్యం ఉంది,నాలో లేదు.. గొంతులో వణుకు తను గుర్తు పట్టకుండా
"ఏం కాదు బుజ్జి.. నీకు నేను ఉన్నా.. నువ్వు నవ్వుతూ వస్తావు.. ఆ నవ్వు , నేను నీకు ఇంక ఎప్పటికీ దూరం అవ్వం.. నాలుగు నెలల్లో మన పెళ్లి అవ్తుంది.. నాలుగు ఏళ్ల లో మనమిద్దరం నలుగురం అవుతాం.. ఇంకో నలబై యేళ్లు మనం కలిసే ఉంటాం ఇందాక నువ్వు అన్నట్టు ఇది నీ ప్రాణమే కాదు.. నాది కూడా.. జాగ్రత్తగా చూస్కో"
అవును మన పిల్లలకి మంచి పేర్లు వెతికావా లేదా నువ్వు చెప్పిన ఆ పాత పేర్లే ఫిక్స్ ఆ అని.. నేను మార్చను...అవే ఫిక్స్ అని గట్టిగా అంది.. నవ్వుతుంది.. అలా తన మూడ్ డైవర్ట్ చేయటానికి రోజూ ఫోన్ చేసి ఎదో ఒకటి చెప్తూనే ఉన్నా.. తనని నవ్విస్తూనే ఉన్నా..
ఆరేళ్లుగా ఏడవని నేను... ఆపకుండా అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను.. తనకి ఫోన్ చేసిన టైమ్ లో మాత్రమే ధైర్యం గా ఉన్నట్టు నటిస్తున్నాను.. ఆ పాత మధురాలే తిరిగి వస్తాయన్న నమ్మకం తో..