Contributed By: వి.ఆర్. కర్ణ మద్దులూరి
సముద్రపు ఒడ్డున నిలబడి ఉన్నాడు ముర్తి. తన మనసు దీర్ఘంగా, తన కళ్ళు తదేకంగా ఆ సముద్రానే చూస్తున్నాయి. మూర్తి వెనక్కి తిరిగి వచ్చి బల్లపై కూర్చున్నాడు. పక్కనే ఉన్న సరళని చూసి... "తీరం పొడవునా అలలు సృష్టించే సందడి ఎంత జోరుగా ఉంటుందో... నడి సముద్రం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది." అని తన చేతిని దగ్గరకి తీసుకున్నాడు.
మూర్తి నువ్వు నన్ను మొదటి సారి ఎప్పుడు చూసావో గుర్తుందా? అని సరళ అడిగింది. తపన లాంటి తన ప్రశ్నకి " ఇదే సముద్రపు ఒడ్డున నిలబడి నేను... ఇదే బల్ల మీద కూర్చొని నువ్వు ! ఆ రోజు... మనసుకి పరిచయం లేని భావంతో నిన్నే చూస్తూ నిలబడి పోయాను." అన్నారు మూర్తి.
సరళ : అవును నువ్వు నేను కూర్చున్న బల్ల చుట్టే తిరుగుతూ... నేను చూస్తుంటే నువ్వు దూరంగా వెళ్లడం, చూడకపోతే దగ్గరగా రావడం. మూర్తి: హా !! అప్పుడేగా నేను దొంగ అనుకోని నువ్వు గట్టిగ అరిచావు. సరళ : ఆ అరుపుకె గా తూర్ర్ మంటూ వెళ్లిపోయావు. మూర్తి: సరళ ఆ తరువాత నీ కోసం రోజు ఇక్కడే తిరిగే వాడిని. నిన్ను దూరంగా చూస్తూ... మనసుకి సర్ది చెప్పుకొని వెళ్లే వాడిని.
సరళ మూర్తి వైపు చిన్నగా రాబోతున్న నవ్వుతో... భలేవారు... మీ కోసమేగా రోజు మూడు మైళ్ళ దూరం నుంచి వచ్చింది. ఇద్దరు తమ తొలి పరిచయాలను తలుచుకొని బయటికి వస్తున్న బాధని ఆపుతూ... సరళని హృదయానికి హత్తుకున్నాడు. మూర్తి హృదయాపై వాలిన సరళ " అవును... నీ ప్రేమ పరితపిస్తుంటే... నా ప్రేమ ప్రశ్నించింది. ఏం చేశావో ఏమో సమాధానంగా వచ్చావు."
ఆ రోజు పెళ్ళి కూతురిగా నువ్వు నడుచుకుంటూ వస్తుంటే. ఎదురుగా వచ్చి నిన్ను ఎత్తుకొని మండపంలో నా పక్కన కూర్చోబెట్టుకోవాలి అని లేవబోయాను. ఇంతలో ఏంటా వేసం అని తొడ బెల్లం పెట్టాడు ఆ పంతులు. ఆ మాటలు విన్న సరళ ఈ సారి కొంచెం మెల్లగా నవ్వింది. మన పెళ్ళి అయ్యాక మీరు తీసుకెళ్లిన మొదటి సినిమా "సాగర సంగమం ". ఆ రోజేగా సరళ నీ పుట్టిన రోజు. నీకు ఇచ్చిన మొదటి బహుమతి ఏంటో గుర్తుందా సరళ.... హా.. నాకు ఇచ్చిన బహుమతి మీరే. అంతకు మించి నాకే బహుమతి వద్దు అన్నాను. కావాలని కూడా నువ్వు అడగలేదు సరళ.
ఆ రోజు గుర్తుందా మామగారు పెట్టిన బండి పై ఇద్దరం రాత్రి వరకు తిరిగాము. హా...నాకు ఐస్ క్రీం ఇష్టమని అర్ధరాత్రి తీసుకెళ్లి మరి ఇప్పించారు. ఈ సారి సరళ కళ్ళలో నీళ్లు తిరిగాయి... వాటిని తుడుస్తూ పిచ్చి పిల్ల ఎందుకు !! అని సరళ ని ఇంకా దగ్గరగా తీసుకున్నాడు. సరళ మసకబారిన కళ్ళతో మూర్తి వైపు చూసి... ఈ షర్ట్ నేను మీ పుట్టినరోజు తెచ్చింది కదా ! హా... సరళ నేను ఇంట్లో సరుకులకు ఇచ్చే డబ్బులతో కొంత దాచిపెట్టి... నాకు చెప్పకుండా ఎండలో వెళ్లి కొనుకొచ్చావు. మగాడు తన సంతోషాని ఎక్కడో వెతుకుతుంటాడు కాని తన పక్కనే ఉన్న సంతోషాని కనిపెట్టలేకపోతాడు.
ఏవండీ ఆ రోజు... అంటూ సగంలో ఆపేసింది సరళ. మూర్తికి సరళ చెప్పదలచుకున్న విషయం అర్ధమై సరళ భుజం నిమురుతూ ఓదారుస్తున్నాడు. మీరు మన బాబుని చూసారా అని మెల్లగా అడిగింది. ఆకాశం వైపు చూస్తూ... చూసాను ! మరణాని జయించి వచ్చాను నాన్న అని చెప్పేలోపే... అందనంత దూరంగా వెళ్ళిపోయాడు సరళ. ఈ సారి మూర్తి కళ్ళలో నీటి చుక్క సరళ చెంప మీద పడింది. చెంప మీద తుడుస్తూ.... సరిగ్గా మూడు సంవత్సరాలకు మనకి అమృత పుట్టింది. కాలికి కట్టిన పట్టి లతో పాప ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే... చూసి చాలా మురిసి పోయేదాన్ని. నేను కూడా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి పాపని చుస్తే చాలు " అప్పటివరకు భుజాలపై ఉన్న బాధలు, కష్టాలు గుమ్మం దాటి లోపలికి వచ్చేవి కాదు."
చూస్తుండగానే అమ్మాయి పెద్దది అయిందా అనిపించేలా కాలేజీ వైపు అడుగులు వేసింది. చదువు ఒకటే కాదు... నా తో బ్లడ్ డొనేట్ చేయించి మరొకరికి భవిష్యత్తుని ఇచ్చిందిగా. ఆ క్షణమే నా కూతురులో అమ్మని చూశాను. ఇంట్లో నేను అమృత కాలేజీ కి వెళ్ళగానే తిరిగి వచ్చే వరకు భయం భయం గా చూసేదాన్ని... ఎందుకంటే అమ్మాయి కదా రోడ్ మీద ఎన్నో కళ్ళు వేటాడుతుంటాయి. అమ్మగా అంతకన్నా ఎక్కువగా బయపడేదాన్ని. సరళ కళ్ళలో కొద్దిగా భయం, ప్రేమ, ఆనందము బయటికి రావడానికి ప్రయత్నించాయి.
అమ్మాయికి పెళ్ళి వయసు వచ్చిందని... నువెవరినైనా ఇష్ట పడ్డావా అని తనని అడిగితే ఏముందో తెలుసా. మీరు చూపించే ప్రేమ ముందు నన్ను ఎవరి ప్రేమని దగ్గరకి రానివ్వలేదు నాన్న ! అనగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి సరళ. అవునండి ఆ రాత్రి మీ సంతోషాని ఈ కళ్ళలో చుశానుగా. ఏవండీ !! అల్లుడు అమ్మాయిని బాగానే చూసుకుంటాడుగా. పిచ్చిది ఏం జరిగిన మన దాకా రానివ్వదు... తనలోనే తను నచ్చచెపుకుంటుంది. అమ్మాయి కదా సరళ... అల్లరి అయితే నలుగురు నాలుగు రకాలుగా నిందిస్తుంటారు. సర్దుకుపోతుంటేనే సమస్యకి సమాధానం చెప్తున్నటే !!
దూరంగా ఉన్న ఐస్ బండిని చూసాడు మూర్తి... సరళ ఐస్ తీసుకొస్తా ఉండు అని చేతి కర్ర తీసుకొని 65సంవత్సరాల మూర్తి వెళ్ళాడు. సరళ తన చేతిలో దాచుకున్న లెటర్ ని చూస్తుంది ఆ లెటర్ చివర్లో ఇట్లు అమృత అని ఉంది. చుట్టూ వర్షం వచ్చే ముందు వీచే గాలి, దుమ్ము చేరాయి. మూర్తి ఐస్ క్రీం తెచ్చి సరళకి ఇచ్చాడు. ఏవండీ ఈ ఐస్ లాంటిదేగా జీవితం కరిగిపోతున్న ఐస్ ని చూసి.
మేఘాల శబ్దంతో వాన మొదలయింది... సరళ చేతిలో ఐస్ పూర్తిగా కరిగిపోయింది. మూర్తి సరళ దగరికి వచ్చి తన షర్ట్ ని తల తడవకుండా పట్టుకున్నాడు. సరళ మూర్తిని కౌగిలించుకుంది. "నా కళ్ళకు కన్నీళ్లు కూడా వస్తాయి అని ఎదురుగా నిన్ను ఇలా చూసే వరకు తెలియదు సరళ " అంటూ
మూర్తి సరళ తలపై వాలి ఏడుస్తున్నాడు. ఏ తల్లి బిడ్డలో... ప్రేమగా దగ్గరై... భార్యభర్తగా ఒకటై ఈ తెలియని జీవన ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నారు.