These 3 Incidents In YSR Gari Life Described By Undavalli Arun Kumar Are A Must-Know For Every Telugu Person

 

(ఈ పుస్తకం కావాలనుకునే వారు ఆర్టికల్ చివరన ఉన్న లింక్ క్లిక్ చెయ్యగలరు.)

గమనిక: ఈ ఆర్టికల్ ఉద్దేశం ఒకరిని పొగడడానికో, మరొకరిని కించపరుచడానికో, లేదంటే కీర్తించడానికో కాదు. ఒక వ్యక్తిలోని ప్రత్యేకమైన వ్యక్తిత్వం మూలంగా నాయకుడిగా ఎలా ఎదిగారనే అంశంతో ఈ వ్యాసం రూపుదిద్దుకున్నది. ఒక వ్యక్తిలో అన్ని రకాల పార్శ్యాలు ఉంటాయి, వైయస్సార్ గారిలోనూ మీ జీవితానికి ఉపయోగపడే లక్షణాలు ఉన్నాయి.. OpenMind తో వాటిని గ్రహిస్తారని ఆశిస్తూ..

వైయస్ చాలా మంచివాడు, ఏ చెడూ లేనివాడని నేను చెప్పలేను గానీ, నా విషయంలో మాత్రం వైయస్ కేవలం మంచివాడే! అందుకే ఈ బుక్ లో నాకూ ఆయనకూ మధ్య జరిగిన కొన్ని సంఘటనలను, ఇంకెవ్వరికీ ఇబ్బంది కల్గించని విధంగా ప్రస్తావించే ప్రయత్నం చేశాను. ఇది చదివాక, ఆయన ఎలాంటి వాడని మీకనిపించినా అది మీ ఇష్టం! నా విషయంలో మాత్రం ఆయన కేవలం మంచివాడే గాదు.. అంతకు మించిన వాడు!
-ఉండవల్లి అరుణ్ కుమార్ గారు.

 

పై మాటల ద్వారా ఉండవల్లి గారు నాకు కాస్త పనిభారం తగ్గించారు.. ఐతే పై మాటలకు కొనసాగింపుగా కొంత చెప్పాలని ఉంది. తన హృదయంతో పాటు, ఆత్మీయుల తపన మూలంగా
<strong>వైయస్సార్ తో… అనే పుస్తకాన్ని ఉండవల్లి గారు ఈ మధ్యనే జ్ఞాపకాలను, అనుభవాలను, సంఘటనలను తెలుగు అక్షరంలో నిక్షిప్తం చేశారు. ఈ పుస్తకం కేవలం కీ.శే. వైయస్ రాజశేఖరరెడ్డి గారి అభిమానులకే కాక కొత్తగా రాజకీయాలలో అడుగుపెడుతున్న యువ నాయకులకు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలనుకునే వారిపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరీ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారితో అనుబంధం ఉన్న వ్యక్తులు ఎందుకు అంతలా వారిని ప్రేమిస్తారనే విషయం తేటతెల్లమవుతోంది. 

పుస్తకం గురుంచి ఆహా ఓహో అని వర్ణించడం కన్నా పుస్తకం రుచిని రచయిత ద్వారానే తెలియజేస్తే పాఠకులకు పూర్తి అవగాహన వస్తుందని ఉండవల్లి గారి మూడు అనుభవాలను, వారి రాతలోనే ఇక్కడ పొందుపరుచడమైనది.

 

1. ఖమ్మం జిల్లాలో ఫైరింగ్ జరిగింది. సిపిఎం కార్యదర్శి రాఘవులు టివి9 క్వశ్చన్ అవర్ ప్రోగ్రామ్ లో కూర్చుని పోలీసులను, రాజశేఖర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. “రాఘవులు గారు చాలా తీవ్రంగా ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయింది” అంటూ చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. నేను టివి9 చూపిస్తున్న నెంబర్ కు కాల్ చేశాను.

“నేను ఉండవల్లి అరుణ్ కుమార్ అండి” అని పరిచయం చేసుకున్నాను. రాఘవులు గారు ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు. ‘ఆ ఏంటి చెప్పండి’ అన్నారు.

‘ఫైరింగ్ జరిగినందుకు రాజీనామా చేయాలని అంటున్నారు. ఈ రూలు ఆంద్రప్రదేశ్ కే వర్తిస్తుందా అండి లేదంటే పశ్చిమబెంగాల్ నందిగ్రామ్ లో జరిగిన కాల్పులకు కూడా అక్కడి ప్రభుత్వం కూడా రాజీనామా చేయాలా?’ అని అడిగా. రాఘవులు గారికి చాలా కోపమొచ్చింది. చాలా తీవ్ర స్వరంతోటి ‘ఇలాగే వచ్చి డైవర్ట్ చేస్తారు సబ్జెక్టులు’ అన్నారు. అనగానే నేను ‘ఏమీ లేదండి నాదొక్కటే సింపుల్ ప్రశ్న, ఎక్కడైనా పోలీసు కాల్పులు జరిగినప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి అనడం ఓన్లీ ఆంద్రప్రదేశ్ కేనా ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందా?

ఆ రోజు ప్రోగ్రామ్ చూసిన కాంగ్రెస్ వాళ్ళందరు వెంట వెంటనే ఫోన్లు. ఎవరెవరైతే చూశారో ఎమ్మల్యేలు, మంత్రులు చాలామంది నాకు ఫోను చేసి ‘చాలా మంచి ప్రశ్న లేపావు’ అని అభినందించారు. వైయస్ గారు టివి అంతగా చూడరు. నేను మాట్లాడిన తీరు వైయస్ గారికి చేరుకుంది. నన్ను పిలిపించుకున్నారు.. ‘ఏమయ్యా నిన్న రాఘవులతో గొడవ ఏమిటి’ అని అడిగారు. గొడవ ఏమిటి సార్ “గవర్నమెంట్ కు సపోర్ట్ గా మాట్లాడాను” అన్నాను. ‘గవర్నమెంటుకు సపోర్ట్ గా మాట్లాడావులే కానీ, కమ్యూనిస్టులకు నీవంటే ఇష్టమయ్యా, నీకు వాళ్ళతో గొడవలెందుకు? నువ్వు కూడా మాలాంటి వాడివే ననుకుంటారు. వాళ్ళతోటి ఎందుకు గొడవ’ అన్నారు.

వైయెస్ కు ఈ విషయం చెప్పిన వాళ్ళందరూ నా గురుంచి పొగుడుతూనే చెప్పి ఉంటారు. నన్ను కూడా మెచ్చుకోవడానికే పిలిచారనుకున్నా. ఇప్పుడివన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే అనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తితో కనెక్ట్ అయ్యింతరువాత రాజశేఖర్ రెడ్డి అనే మనిషి ఆ వ్యక్తికి నష్టం కలుగకూడదు అనే ఆలోచిస్తారు తప్ప దాంట్లో తనకెంత లాభం జరిగింది, దాని ఫలితం ఏమిటొచ్చింది వంటివి ఆలోచించరు. ఆ వ్యక్తికి మంచి జరగడం తప్ప ఆయానకింకేమి అవసరం లేదు. అందుకే ఒక మనిషిని తన వాడనుకున్న తర్వాత వాడికోసం, ఎంతవరకైనా వెళ్ళిపోతాడు. ఒక్కసారి వీడు నావాడు అనుకుంటే వాడు మంచి చేయనీ, చెడు చేయనీ వాడికోసం ఏమైనా చేస్తాడు. 

2. 2005లో మా అన్న రవికుమార్ హఠాత్తుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో నిమ్స్ లో జాయిన్ అయ్యారు. సుమారు 10రోజులపాటు ICUలో ఉన్నారు. ఎందరో మిత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చూడటానికి రావటంతో నిమ్స్ డాక్టర్లకీ, స్టాఫ్ కు VIP సిండ్రోమ్ ఆవహించింది. అంటే పలుకుబడి గలవారి పట్ల కలిగే ఒకరకమైన ఆందోళన! దాంతో నా మిత్రులందరికీ రావద్దని చెప్పేశాను. కెవిపికి ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తూ ఉండేవాడిని.

ఒకరోజు కెవిపి ఫోన్ చేసి CM గారు చూడటానికి వెళ్దాం అంటున్నారని చెప్పారు. వెంటనే నాకనుమానం వచ్చింది ‘క్రిటికల్’ ఆ అని అడిగాను. కేసు ముందు నుంచి క్రిటికల్ కాదు, సీఎం గారు చూసి వెళ్లారంటే ఇక బ్రతకడెమోనని భయమేసేస్తుంది సార్.. ఇప్పుడెందుకు రావడం అన్నాను. కానీ ఆ మర్నాడే కెవిపి, సీఎం గారు వచ్చేశారు. పేషేంటును చూశాక, డాక్టర్లతో చాలా సేపు మాట్లాడారట! నేనా సమయానికి అక్కడ లేను!! మా అమ్మని, వదినని ఇతర కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పి వెళ్లిపోయారు.

ఆ సాయంత్రం ఆయన్ని కలిసినప్పుడు ఆయన నాతో అన్న ఒకే ఒకమాట. ‘మీ అమ్మ గారిని చూస్తుంటే మా అమ్మని చూసినట్లే ఉందయ్యా’ అన్నారు. ఇది వైయస్ మార్కు ప్రత్యేకమైన కామెంట్! ఇది గుండెల్లోంచి వస్తుంది. మనల్ని ఆనందపర్చాలని అనే మాట ఎంత మాత్రం కాదు. తను ఆనందపడటానికి అనే మాట. అందుకే ఓకే ఒకసారి చూసినా మా అమ్మా, మా వదినా వైయస్ మరణవార్త విని రోజుల తరబడి ఏడుస్తూనే ఉన్నారు. 

3. నేను వైయస్ కు మరింత దగ్గరవటానికి ప్రధాన కారణం కె.వి.పి! కె.వి.పి పైకి చాలా సీరియస్ గా కన్పిస్తారు గానీ ‘హ్యూమర్’ ని చాలా ఎంజాయ్ చేసేవారు. పైకి నవ్వుతూ ఉండే వైయస్ చాలా సీరియస్ మనిషి. నేను వేసిన జోక్ కెవిపి కి నచ్చితే, అది వైయస్ కి చెప్పటం ఆయన మళ్ళీ నన్ను కలిసినప్పుడు అరుణ్ అదేదో జరిగిందట. మళ్ళీ ఒక్కసారి చెప్పు అని చెప్పించుకుని నవ్వుకోవడం చాలాసార్లు జరుగుతూ ఉండేది.

వైయస్ తండ్రిగారిని హత్య చేశారు. అంత్యక్రియల తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆయన వస్తున్నారని తెలుసుకుని ‘పరమర్శకు’ నేను హైదరాబాద్ చేరుకున్నాను. నాతోపాటు అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. గదినిండా జనం నేనో మూలకి నిలబడిపోయాను. కొందరు గట్టిగా ఏడుస్తూ, కొందరు రాజారెడ్డి గారిని పొగుడుతున్నారు. 5నిమిషాల తర్వాత నేను కూడా “నమస్కారం సార్” అని అన్నాను. ఊ.. ఊ అంటూ బిజీ అయిపోయారు. మరో పదినిమిషాల తర్వాత జనప్రవాహం ఆగిన సమయంలో “అరుణ్ కొన్ని ఫేసులు సీరియస్ గా ఉంటే అస్సలు బావుండవు.. నీ ఫేస్ కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది” అంటూ నా భుజం గట్టిగా చరిచారు.

సెప్టెంబర్ 4, 2009 వైయస్ భౌతికకాయం పక్కనే నిలబడ్డ నాకు, ఏడుపు రాలేదు..! గుర్తుపట్టడానికి వీలులేని స్థితిలో, ఛిద్రమైన ఆయన శరీరం ఒక పెట్టెలో పెట్టి తెచ్చారు. శవపేటిక నుంచిన వేదిక మీద వైయస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ లతో సహా ప్రముఖులందరూ వరుసలో వచ్చి శవపేటికను చూసి నమస్కరించి వెళ్తున్నారు. శవపేటిక, మరో పక్క నన్ను నిలబెట్టారు కెవిపి! ఎందరో అగ్రశ్రేణి నాయకులు ఒక్కరొక్కరుగా నా ముందు నుంచే వెళ్తున్నారు. పక్కనే గుర్తించటానికి కూడా ఆనవాళ్లు దొరకని ఛిద్రమైన స్థితిలో వైయస్ మృతదేహం మూసివేయబడిన పెట్టెలో ఉంది.

బహుశా అప్పుడు నా ఫేస్ తప్పకుండా బాగుండి ఉండదు!! 

For Book: https://www.telugubooks.in/products/ysr-tho-undavalli-arun-kumar


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,