These 20 Lines From The Collective Works Of Yandamuri Veerendranath Are Proof Of His Writing Prowess!

 

సహజ భావం, అణువు అణువు రమిస్తూ ఉబికివస్తున్న ప్రేమ, వారి బంధం మరణం లేని అమరత్వం సిద్దించాలని యండమూరి వీరేంద్రనాథ్ గారు వారి అక్షరాలతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వారిద్దరి మొదటి కలయిక 50 ఏళ్ళు పూర్తయ్యి శాశ్వితత్వం వైపు పయనిస్తోంది. ఒక్కచోట కూర్చుని మనసులో ఏ ఆలోచన లేకుండా నిశ్శబ్దంగా ఉండడం మెడిటేషన్ ఐతే యండమూరి గారి అక్షరాలు కూడా మెడిటేషన్ కు గురి చేస్తాయి.. యండమూరి అక్షరాలు వడ్రంగి వాని చిత్ర వలె పొడుస్తాయి, బాడిసె వలె చెక్కుతాయి. బహుశా వీరి కలయిక చైత్ర శుద్ధ నవమి శుభముహూర్తాన జరిగినట్టుంది అందుకే సీత రాముల వలె అజరామరమయ్యారు.

 

1. కొండవెనుక పురుడు పోసుకున్న ఆకాశం, మేఘాల పొత్తిళ్లలో తన బిడ్డని పడుకోబెట్టి పైకెత్తి చూపుతున్నట్టుంది సూర్యుడు పై కొస్తుంటే.
(ప్రేమ)

 

2. తలలో ఎంత పెద్ద పూదండ పెట్టుకున్నా ఆ పరిమళం, మెడ వెనక నుంచి పైకి పాకే నాసికకే పరిమితం చెయ్యడం కేవలం పురుషుడికి దేవుడిచ్చిన వరం.
(లేడీస్ హాస్టల్)

 

3. వద్దంటే వచ్చే కన్నీళ్లకూ…
పోనీ పోనిమ్మనే వ్యర్ధవైరాగ్యాలకూ,
కానీ కానిమ్మనే అసంబర్ధ నిర్లిప్తతకూ,
గోడ మీద రాలిపోతున్న కాలం ఏమి చెప్పదు.
(లేడీస్ హాస్టల్)

 

4. నా దుఃఖాశ్రువులు సముద్రం మీద వర్షంలా కురుస్తాయి. ఒక్కటైనా స్వాతి ముత్యమవుతుందేమోనని జీవిత కాలం ఎదురుచూస్తూ ఉండగా, ఇంటి ప్రాంగణంలో వృద్దాప్యం నిలబడి పరిహసించింది.
(థ్రిల్లర్)

 

5. నా యీ భావాన్ని నీకు చెప్పటం కన్నా, నాలో నేను దాచుకుంటేనే మనసు అంతరంగపు పొరల్లో అది నిక్షిప్తమై సంతోషాన్నిస్తుంది. చెప్పటం కన్న చెప్పకపోవటంలో ఎక్కువ సంతోషం ఉంది.
(వెన్నెల్లో ఆడపిల్ల)

 

6. ఊపిరిలోనికి వస్తున్నప్పుడు నువ్వు నాలోకి ప్రవేశిస్తున్న అనుభవమై హృదయం పొంగుతుంది. శ్వాస బయటికొస్తుంటే నువ్వు వెళ్లి పోతున్నావన్న బాధతో కడుపుతరుక్కు పోతుంది. ఈ ఉఛ్వాస నిశ్వాసల్లో కూడా నీవే నిండి ఉన్నావన్న ఆనందంతో గుండె నిండుతుంది.
(అంతర్ముఖం)

 

7. ఆనందం అనే త్రాసు, అనుభూతి అనే తులసీదళాలకి తప్ప మరి వేటికీ లొంగదనుకుంటా.
(వెన్నెల్లో ఆడపిల్ల)

 

8. ‘తొలిరాత్రి’ నిద్ర మేల్కోని కనులు విప్పగానే పక్కనే పురుషుడ్ని చూసి, తనెక్కడున్నదో తెలియక ఒక్కక్షణం తత్తరపడి, తానిప్పుడు వివాహితనని గుర్తు తెచ్చుకొని – రాత్రి విశేషాలు చురుక్కుమని గుర్తుకురాగా – నూతన వధువు మొహం ఎలా ఎర్రబడుతుందో పైకొస్తున్న సూర్యుడు అలా ఉన్నాడు.
(13-14-15)

 

9. రెండు హృదయాలు కలుసుకునేటప్పుడు నాలుగు పెదాలు ఇచ్చుకునే షేక్ హాండ్ ముద్దంటే.
(రక్తసింధూరం)

 

10. నేనేమో మౌనంగా ఉంటాను. నిన్ను చూడడం కోసం నక్షత్రాలు వరుసగా నిలబడతాయి. ఆకాశం కూడా మేఘాలు తీసివేస్తుంది.
(రుద్రనేత్ర)

 

11. సూర్యుడు సిగ్గుతో ఎర్రబడ్డ మొహాన్ని భూదేవి వృక్షోజాల మధ్య దాచుకోవటానికి కొండల మధ్యకి చేరుకుంటున్నాడు.
(నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య)

 

12. రాత్రంతా నిద్రలేకుండా ఆలోచించి, ఆ విషయం మర్చిపోవాలని ఓ నిర్ణయానికొచ్చి – మళ్ళీ తెల్లవారగానే ఏం మర్చిపోవాలో జ్ఞాపకం వచ్చి…
ఇదేనా విరహమంటే.
(ప్రియురాలు పిలిచే)

 

13. పుట్టుకతో వచ్చిన ఊరువులు, పెదవులు మామూలుగానే ఉంటాయి. కానీ యవ్వన కాలంలో వంటి మీదికి వచ్చి చేరిన నుగారు మాత్రం నడి మంత్రపు సిరిలాంటి పాలిండ్లతో కలిసి అతిశయాన్ని ప్రదర్శిస్తుంది.
(ప్రేమ)

 

14. ఒక సాయంత్రం నుంచి మరొక సాయంత్రానికి చేరుకోవాలంటే చీకటి వాకిటి తలుపులు తెరిచి ఓ ఉదయాన్నీ, ఓ మధ్యాహ్నాన్ని దాటాలట. ఒక కోయిల పాట వినాలంటే అయిదు ఋతువుల్ని దాటాలట.
(లేడీస్ హాస్టల్)

 

15. పాంచజన్యమేలా? చేతమురళి ఉండగా.
యుద్ధవాంఛ ఏల కృష్ణా? చెంత రాధ నిలుచుండగా.
యుద్ధమే ‘పురుష’ లక్షణం అని నువ్వనుకున్న మరు క్షణం బృందావనమవ్వదా మరో కురుక్షేత్రం.
(రాక్షసుడు)

 

16. మంచుతో తడిసిన పుష్పాన్ని నాకంటి చివర భాష్పం చేసి.. మేఘరాగంతో తడిచినుకు పాట చేసి.. మౌనరాగంతో గుండె తూట్లుగా పొడిచేసి మమ్మల్నోదిలేసి అందుకే వెళ్లిపోయావా?
(ఆఖరిపోరాటం)

 

17. అర్ధరాత్రి – లోకరహస్యాల్ని విప్పుతూన్న కవిలా – తల వంచుకుని వ్రాసుకు పోతుంటాను. ప్రపంచం నలు మూలల్లోకి, దిగంతాల శూన్యంలోకి పయనించి, ఎక్కడెక్కడి నుంచో భావాల్ని ఏరికూర్చి మాలలల్లి తెస్తాను. నువ్వు మాత్రం నా పక్కనే అల్లుకుపోయి, విశ్వరహస్యాల్ని విప్పుతావు.
(13-14-15)

 

18. గ్రామపు పొలిమేరల్లో, గుడిసె ముంగిట్లో, రాట్నం ముందు కూర్చుని ఈ లోకపు బాధలతోనూ, వ్యధలతోనూ నిమిత్తం లేకుండా నూలువడికే వృద్ధురాలి మొహంలో కనిపించే ఆనందాన్ని ఏ రచయిత వర్ణించగలడు. శబరి వణికే చేతులు, జటాయువు విరిగిన రెక్కలు ‘సేవ’లో ఉండే ఆనందాన్ని తెలుపుతాయి.
(ఆఖరిపోరాటం)

 

19. ఓ గాలీ – నువ్వు బలంగా వీచకు! కనీసం బుడిదనైనా ఆ ఆకృతిలో చెదరకుండా ఉండనీ. ఈ బూడిద ఎగిరి ఏ ధాత్రి నలంకరిస్తుందో.. అక్కడ చిరుపొద మొలుస్తుంది. ఆవెదురు, కుంచెగా మారి ఒక గుర్తు తెలియని చిత్రకారునలంకరిస్తుంది. ఒక రస రమ్య చిత్రానికి అది ఆకృతినిస్తుంది. అదే అసంతృప్తిలో సంతృప్తి.
(వెన్నెల్లో ఆడపిల్ల)

 

20. కాసింత చిరునవ్వు, కాసిని కన్నీళ్లు.. ఇదేనా వీడ్కోలు అంటే?
(ఆనందో బ్రహ్మ)

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,