Oka Manchi Coffee Lanti Kadha: A Writer’s Beautiful Love Story About How He Fell In Love

 

Contributed By Sai Ram Nedunuri

 

డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది.

డైరెక్టర్: సర్, పాట అయిపోయిందా ?
నేను: చివరి చరణం ఒకటీ మిగిలుందండి.
డైరెక్టర్: తొందరగా కావాలండీ. వచ్చే వారం పాట షూట్ ప్లాన్ చేసుకున్నాము.
నేను:ఇచ్చేస్తానండీ రేపటికల్లా ..

అని చెప్పి, ఎప్పటిలాగే దగ్గరిలో ఉన్న కాఫీ షాప్ కి వెళ్లి భావానికి సరిపోయే పదాలు వెతికే పనిలో మునిగిపోయాను.
నన్ను చూడగానే, నేను ఎప్పుడూ తాగే కాఫీ ఫ్లేవర్ తీసుకొచ్చి ముందు పెట్టాడు కాఫీ షాప్ అబ్బాయి.

కాఫీ చల్లారిపోయి చాలాసేపయింది. నేను మాత్రం ఆలోచనల గనిని తవ్వుతూనే ఉన్నాను. పదాల నిధి దొరుకుతుందనే ఆశతో.

 

ఒక అమ్మాయి: Excuse me, if you don’t mind, నేను ఇక్కడ కూర్చోవచ్చా ?

ఒక్కసారిగా నా ప్రపంచంలో నుంచి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది ఆ స్వరం.

నేను: Ya yaa. Sure.

అప్పటిదాకా కాఫీ షాప్ లో పరిసరాలను పట్టించుకోని నేను, ఒకసారి చుట్టూ చూసాను. శనివారం కావడంతో కాఫీ షాప్ జనాలతో నిండిపోయి ఉంది. అందుకనే కాబోలు కూర్చోడానికి వేరే చోట స్థలం ఖాళీ లేదు కాబట్టి నేను కూర్చున్న టేబుల్ దగ్గరకి వచ్చి ఆ అమ్మాయి అడిగినట్టుంది.

నేను మళ్ళీ యధావిధిగా నా పదశోధన కొనసాగించాను. కొద్దిసేపటి తరువాత మళ్ళీ ఆ స్వరం వినిపించింది.

ఆ అమ్మాయి: హలో అండి.
నేను: Hi
అమ్మాయి: మీరు పాటలు రాస్తారు కదా ?
నేను: హా .. అవునండి.
అమ్మాయి: మిమ్మల్ని ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో చూసాను tv లో. మీరేనా కాదా అనుకున్నాను ఇప్పటి వరకు.

అప్పటిదాకా నేను మునిగిపోయి ఉన్న నా ఫోన్ తీసి పక్కన పెట్టాను.

 

నేను: నన్ను కూడా గుర్తుపడతారు బయట అని ఎప్పుడూ అనుకోలేదండీ. చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ లు ఎవరు చూస్తారు, ఒక వేళ చూసినా.. చిన్న సినిమా పాటలు ఎవరు వింటారు అనుకున్నాను.

అమ్మాయి: అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నారు ? మంచి సాహిత్యం ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తుంది.
మీరు ఆ సినిమాలో రాసిన పెళ్ళి పాట నాకు చాలా నచ్చింది.

నేను: బయటకి ఇలా ఉన్నాను కానీ, నిజానికి మీ మాటలకి లొపల మాత్రం గాల్లో తేలుతున్నాను తెలుసా ?

అమ్మాయి: అబ్బో .. మీ లాంటి వాళ్లు ఇలా కూడా మాట్లాడతారా ?

నేను: నేను ఎలాంటి వాడిని ? ఇప్పుడు ఎలా మాట్లాడానండీ ?

అమ్మాయి: ఆ విషయం వదిలేయండి. మీరు అంత నిజాయితిగా మాట్లాడేస్తున్నారు కాబట్టి, నేను కూడా నిజాయితీగా ఒకటి చెప్తాను. మిమ్మల్ని నేను పలకరించడానికి ఇంకొక కారణం కూడా ఉంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బయట వర్షం పడుతోంది. కొంచం మీ ఫోన్ లో మా ఇంటికి cab బుక్ చేస్కోవచ్చా ?

అదీ సంగతి ..!! లేకపోతే నా మొహానికి ఎవరు పలకరిస్తారు, అని నాలో నేను అనుకుని, బయటకి మాత్రం గట్టిగా నవ్వేసాను.
వెంటనే నా ఫోన్ తనకి ఇచ్చాను. Cab బుక్ చేస్కుని నా ఫోన్ తిరిగి ఇచ్చేసింది.

ఎంత మాట్లాడుతున్నా, నా ప్రతి ఆలోచన వెనక, రేపటికల్లా పాట పూర్తి చేయాలి అనే ఆలోచన మాత్రం దాగుడుమూతలు ఆడుతూనే ఉంది. దాదాపు నా ప్రమేయం లేకుండానే మళ్ళీ పదాలను వెతకడం మొదలుపెట్టేసాను.

 

అమ్మాయి: రచయిత అంటే అందరికీ కలం కాగితం గుర్తొచ్చేస్తాయి, కానీ దానికి భిన్నంగా, ఫోన్ లో మునిగిపొయారేంటండీ ? ఇలా అడిగేసినందుకు ఏమీ అనుకోకండి.

నేను: అయ్యో అలాంటిదేమీ లేదండి. సాంకేతికత పెరిగిపోవడం వలన మనకి అన్ని పనులు ఫోన్లోనే జరిగిపోతున్నాయి. నా పాటల రచనతో సహా…. ఈ తరం లో పుట్టడం వలన అనుకుంట, నాకు కలం కాగితం కంటే, ఫోన్లో పాటలు రాసుకోవడం ఎక్కువ అనువుగా అనిపిస్తుంది.

అమ్మాయి: తప్పులేదులెండి. పూర్వపు ఆచరణలని విమర్శించకుండా, కొత్త సాంకేతికతను మంచికి వాడినంత కాలం, సాంకేతికతలో మార్పులు మన మంచికే అని నా అభిప్రాయం.

అరె, అచ్చం నా ఆలోచనే ఈ అమ్మాయిది కూడా, అని నాలో నేను అనుకుని, పైకి మాత్రం తల ఊపాను.

అమ్మాయి: So, ఏం పాట రాస్తున్నారు రచయిత గారు ? మేము కూడా తెలుసుకోవచ్చా ? లేదా సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదు అంటారా ?

నేను: అయ్యో ఎంత మాట, సినిమాలో హీరో హీరోయిన్ ఒకరికి ఒకరు ఎందుకు నచ్చారో చెప్తూ సాగే పాట. అంతా బాగానే కుదిరింది కానీ, రెండో చరణంలో చివరి పంక్తులు రాయడానికి రెండు రోజులుగా ఆలోచిస్తున్నాను.

అమ్మాయి: ఏం పర్లేదు, రాసేయగలరులెండి మీరు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా ?

నేను: తప్పకుండా అడగండి.

 

అమ్మాయి: ఇద్దరు వ్యక్తులు జంటగా మారి సంతోషంగా ఉండాలంటే, ఏ విషయాలు ముఖ్యం అంటారు ? మీరు రాసిన పెళ్ళి పాట, మీరు ఇప్పుడు రాస్తున్న పాట సందర్భం తెలిసాక ఎందుకో ఈ ప్రశ్నకి మీ జవాబు తెలుసుకోవాలనిపించింది.

నేను: నేను రాసిన పెళ్ళి పాటలో సాహిత్యం విన్నారు కదా, దాదాపు అదే నా సమాధానం అనేసుకుని, మీ ప్రశ్నకి మీరు చెప్పచ్చు కదా సమాధానం.

అమ్మాయి: ఎంత రచయిత అయితే మాత్రం ఇలా దౌర్జన్యం చేయడం దారుణమండి. నా ప్రశ్నకి నన్నే సమాధానం చెప్పమంటారా ?

నేను: మీరు మాటి మాటికి రచయిత అనకండి. ఆ పదానికి నేను సరీపోను అని నా అభిప్రాయం. మీ సమాధానం తెలుసుకోవడానికి అడుగుతున్నాను అనుకోండి.

అమ్మాయి:
ఇద్దరు వ్యక్తులు జంటగా మారాలంటే, ఎక్కువ విషయాలు మీద వాళ్ల అభిప్రాయాలు కలిసైనా ఉండాలి, లేదా ఇద్దరికి ఒకళ్ళ అభిప్రాయాల మీద ఇంకొకళ్ళకి గౌరవమైనా ఉండాలి. కానీ ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చకపోతే మాత్రం జంటగా ఉంటూ సంతోషంగా ఉండడం కష్టమే అని నా భావన.
రోజులు గడుస్తున్న కొద్దీ ఒకళ్ళ స్వభావం గురించి ఇంకొకళ్ళు తెలుసుకోవడానికి పెద్దగా ఎమీ మిగలదు. అలాంటపుడు ఒకరి స్వభావం ఇంకొకరికి అలవాటైపోవడం లో తప్పు లేదు కానీ, చిరాకు మాత్రం తెప్పించకూడదు. జంటగా ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు, ఎదుటి వారి భావాలు అభిప్రాయాలు పూర్తిగా నచ్చినప్పుడే ఇలా భవిష్యత్తులో చిరాకులు లేకుండా సంతోషంగా ఉండగలరని నా అభిప్రాయం.

అద్భుతంగా చెప్పింది కదా. ఇందులో చాలా విషయాలు నా అభిప్రాయాలే. నేను రాసే పాటలలో ఎక్కడో అక్కడ నేను చెప్పాలనుకున్నవే,
అని నాలో నేను అనుకుని, కొంచం సేపు తనని అలా చుస్తూ ఉండిపోయాను.

అమ్మాయి: సరేనండీ ..!! క్యాబ్ వచ్చేసింది. మీతో ఇలా మాట్లాడినందుకు, మీరు పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. And Thank You so much క్యాబ్ బుక్ చేసుకోవడానికి మీ ఫోన్ ఇచ్చినందుకు.

అని చెప్పి వెళ్లిపోయింది.

 

ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి మాటలే నా చెవిలో వినిపిస్తున్నట్టు అనిపించింది. అభిప్రాయాలు కలిసే అమ్మాయి తోడుగా ఉంటే ఎంత బావుంటుందో అనుకునే వాడిని, అలాంటిది తను కూడా ఒక జంటకి కావాల్సింది భావాలు కలవడమే అంది కదా.
నేను అనుకునే మాటలే తను అంది.
నా భావాలే తనవి కూడా
వెంటనే నేను రాయాల్సిన పాటకి పంక్తులు కూడా తట్టేసాయి.

నా మాటలు నీ నోట పలికెనే
నీ భావాలు నాలోన నిలిచెనే

నీ ఊహలు నావై తోచెనే
నా అడుగులు నీ వెనక సాగెనే

ఆ అమ్మాయిని ఎందుకో మళ్ళీ కలవాలని అనిపించింది. నా ఫోన్లో తను క్యాబ్ బుక్ చేసినపుడు ఇచ్చిన అడ్రస్ ఉన్నా సరే ఎందుకో ధైర్యం చేయలేకపోయాను.

నేను పాట రాసిన సినిమా విడుదలయ్యి, అదృష్టవశాత్తు హిట్ అయింది. నేను రాసిన పాట కూడా జనంలోకి బాగా వెళ్లింది. ఒక టీవీ ఛానల్ వాళ్లు వాళ్ల స్టూడియోలో, ప్రేక్షకులతో ఫోన్లో మాట్లాడే ప్రోగ్రాంకి పిలిచారు.

ఆ ప్రోగ్రాంకి ఆ అమ్మాయి ఫోన్ చేసింది.

అమ్మాయి: రచయిత గారు, సినిమాలో హీరో హీరోయిన్ ఒకరికి ఒకరు ఎందుకు నచ్చారో చెప్తూ సాగే పాట చాలా అద్భుతంగా రాసారండి.

నాలో ఉన్న ధైర్యం అంతా కూడకట్టుకుని

నేను: ఆ రోజు మీతో మాట్లాడిన సంభాషణే, నాకు ఆ పాటలో రెండవ చరణంలో పంక్తులు రాయడానికి స్ఫూర్తినిచ్చాయి. మిమ్మల్ని కలిసి ధన్యవాదాలు చెప్పాలని ఉంది.

ఒక పది క్షణాలు మౌనం తరువాత

అమ్మాయి: మనం మొదట కలిసిన ప్రదేశంలోనే కలిసి మాట్లాడుకుందాంలెండి.

అని ఫోన్ కట్ చేసేసింది.

లైవ్ ప్రోగ్రాంలో నేను అన్న మాటలు తనని ఇబ్బంది పెట్టాయేమో అని భయం వేసింది. ఆ భయంతోనే ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ కాఫీ షాప్ కి వెళ్లాను. ఈ సారి నా కంటే ముందే వచ్చింది తను.

 

అమ్మాయి: హలో రచయిత గారు, మిమ్మల్ని మళ్ళీ ఇలా కలుస్తాను అనుకోలేదండి. ఏది ఏమైనా నా భావాలు ఆ పాట రాయడానికి స్ఫూర్తిని ఇచ్చాయంటే, నాకు చాలా ఆనందంగా ఉందండి.

నేను: నావి కూడా అవే భావాలండీ. బహుసా అందుకనేనేమో వాటిని మీరు గుర్తుచేయగానే ఆ పంక్తులు రాయగలిగాను.

అమ్మాయి: మీ పాటలు వింటేనే అర్ధం అయిపోతాయి మీ భావాలేంటో. మీరు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

చల్లటి AC ఉన్న కాఫీ షాప్ లో నా నుదిటి మీద పడుతున్న ముచ్చెమటలు తుడుచుకుంటూ నేను ధైర్యంగా చెప్పేసాను.

నేను: ఒకటే భావాలు కలిగిన మనం ఒక జంట గా మారడానికి ఒప్పుకుని, అవధులు లేని నా ఆనందానికి కారణం అవ్వగలరా ?

ఒక రెండు నిమిషాల పాటు నా గుండె చప్పుడు నాకు స్పష్టం గా వినిపించింది.

అమ్మాయి: అయితే ఇకనుంచి, సినిమాలలోని సాహిత్యం అందరి కంటే ముందు వినగలిగే అదృష్టం నాదే అన్నమాట.

అని నవ్వేసింది.

నేను: మీరు ఇప్పుడు నవ్విన నవ్వు, మీకు కేవలం నవ్వు మాత్రమే అయ్యుండొచ్చు. నాకు మాత్రం ఒక జీవిత కాలపు జ్ఞాపకం.

అమ్మాయి: లైన్ అదిరిపోయింది. మీ next పాటలో వాడేయండి.

అని మళ్ళీ నవ్వేసింది.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,