A Short Story About Why ‘All The Women Should Be Respected Equally’

 

Contributed by Masthan Vali K

” ష్ అరవకన్నానా..? అమ్మకు వినపడుతుంది చిన్ను. తర్వాత surprise లేదు ఎం లేదు, అంతా waste అయిపోతుంది. ” Gift Wrap చేస్తున్న చిన్నూ వాళ్ళ మావయ్య గుసగుసగా అన్నాడు.

“మీ అమ్మకా, మా అమ్మకా మావయ్య ” సెల్లో టేపు అందిస్తూ ముద్దు ముద్దుగా అడిగింది చిన్ను.

“ఇద్దరికీను, మీ అమ్మ లాగే నువ్వు చెయ్యదన్న పనే చేస్తావే…” అదే పనిగా పేపర్ నలుపుతూ కావాలనే శబ్దం చేస్తోన్న చిన్నూ చేతుల్లోని పేపర్ ని లాక్కుంటూ అన్నాడు.

“దేనికి మావయ్య ఈ Gift , నేనెప్పట్నుంచి అడుగుతున్నా నాకు బార్బీ కొనివ్వమని. వాళ్లకి మాత్రం… ” అంటూ గొంతు పెంచేస్తోంది తను.

“ఓర్నాయనో, బాబోయ్ అరవకే తల్లి నువ్వు అంటే వినవేంటే….” అంటూ దాని నోరు మూసాడు. కాసేపటికి వదిలేసాడు.

మావయ్య ఇంక దొరికిపోయాడు అని తెలిసొచ్చింది చిన్నూ కి.

“Gift ఎందుకంటే చెప్పవే ” చేతనైనంత గట్టిగా అరిచింది.

” ఓసి ని, అందరు పనుకుంటే నీకు మాత్రం నిద్ర రావట్లేదా…?”

“ముందు నేనడిగింది చెప్తావా లేదా… ఎందుకా Gift లు వాళ్లకి…?” ఏ మాత్రం తగ్గేలా లేదు పిల్ల రాక్షసి.

“దేవుడా”, అంటూ దాని నోరు నొక్కి ఎత్తుకుని అమ్మా చెల్లి

పడుకునున్న గది దగ్గరికెళ్లి తొంగి చూసాడు వాళ్ళు లేచారేమో ఈ అరుపులకని.

ఎటూ కదలకుండా శాంతంగా పడుకునే ఉన్నారు. “హమ్మయ్య” అనుకుంటూ తన గదిలోకొచ్చి, “వాళ్ళు గాని లేచుంటే నీకుండేది “చేయలా నొక్కి పెట్టుంచే అన్నాడు. పిల్లది గబుక్కున కొరికేసింది. ” పిల్ల దయ్యానివే నువ్వు, Gift ఎందుకో చెప్తాను, నువ్వు అరవకూడదు… ” తట్టుకుని చేయి తీయకుండానే అడిగాడు.

“ఊ ఊ” అంటూ తలాడించింది తను.

“రేపు Women’s Day కదా అందుకే ఈ Gifts… ఇది మీ అమ్మకి, ఇది అమ్మమ్మకి” అని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ చెప్పాడు.

Women’s Day అంటే తనకేం అర్థం కాలేదని దాని ముఖం చూస్తే నాకర్థం అయింది.!

“అంటే, ఆడవాళ్లందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్ లాగా… అర్థమయ్యిందా…” అంతకంటే ఎక్కువ చెప్పినా అనవసరం అనిపించింది అతనికి.

అది వినగానే దాని కళ్లు పెద్దవయ్యాయి.

“ఏంటే అలా చూస్తున్నావ్… చెప్పానుగా Gift ఎందుకో ఇప్పుడు గాని అరిచావో, నీకుంటది” బెదిరించాడు. ఆ పిల్లది మాత్రం అలానే చూస్తోంది

“ఏంటిది ఇలా చూస్తోంది” అని మనసులో తెగ ఆలోచించేస్తున్నాడు.

” మరి నా Gift ఏది ? ” నా ఒళ్ళోంచి లేచి మరీ అడిగింది.

“ఓసి అదా నీ చూపుకర్థం, చంపేసావ్ కదే ! నీ Age 7 Years.. నువ్వు చిన్న పాపవి కదా, అంటే నువ్వింకా Baby వి. వాళ్ళు నీకంటే పెద్ద, అంటే Women, అందుకే వాళ్లకు మాత్రమే Gifts సరేనా…” తనకి అర్థమయ్యేలా చెప్పాననుకున్నాడు.

“చిన్న దాన్నైనా పాపనే కానీ బాబుని కాదు కదా… నాకెందుకు తేలేదు మరి Gift…?”

“బుడంకాయ్ ది, Logic లు మాట్లాడుతోంది. దీంతో ఈ టైం లో గొడవ అవసరమా ” అనుకుని,

“సరే తల్లి, రేపు నిన్ను బయటికి తీసుకెళ్ళి నీక్కావల్సింది కొనిపిస్తాను. Okay నా. ఇప్పుడు అరవకు. నాకు నిద్రొస్తోంది పడుకోనివ్వు ”

అంటూ Compromise అయ్యాడు.

అలానే బెడ్ పై వెనక్కు వాలి పోయాడు. వెంటనే చిన్నూ కూడా మావయ్య పై పడింది. ఇద్దరూ అలానే పడుకున్నారు.
తర్వాతి రోజు ఉదయం.
చిన్నూ వాళ్ళ అమ్మ ఆఫీసుకు రెడీ అవుతోంది. అమ్మమ్మ కిచెన్ లో ఉంది.

” మా, ఇలా రా… ” అంటూ అమ్మను హాల్లోకి రమ్మని పిలిచాడు అతను. “ను వెళ్ళి మీ అమ్మను పిలుచుకు రా ” అని చిన్నుకి సైగ చేసాడు.

ఇద్దరు వచ్చారు. “అమ్మమ్మ కళ్ళు మూసుకో, అమ్మా ను కూడా ” అని ఇద్దర్ని సోఫా పైన కూర్చోబెట్టింది “ఏంట్రా ఇది, ఆఫీసుకు లేటవుతోంది నాకు” అని లేచి వెళ్ళబోయింది చిన్నూ వాళ్ళమ్మ, “ఇప్పుడు వెళితే తర్వాత ఫీలవుతావు, నీ ఇష్టం అని లాక్ చేసాడు అతను. వెంటనే కూర్చుంది తను.

“ఏరా ఏంటి Special ఈ రోజు, Surprise plan చేసావ్ ” మహా తెలివైంది అమ్మ అని నాకు అప్పుడప్పుడు అనిపించేది ఇందుకే.

“Special ఆ, ఓ ఈ రోజు women ‘s Day కదా ” అప్పుడు గుర్తొచ్చింది చిన్నూ అమ్మకి.

“అరేయ్ తొందరగా కానీ” అంది .

“సరిపోయింది, Surprise అని తెలిసాక ఏంటి surprise, చాలులెండి. ఇక కళ్ళు తెరవండి .” అని గిఫ్ట్ ప్యాక్ లు వాళ్ళ చేతిలో పెట్టి “Happy Women’s Day” అన్నాడు .

చిన్నూ ఏం చెప్పలేదు. అలానే చూస్తూ ఉంది.

“థాంక్స్ రా, ఏంటిది… ఎప్పటినుచో అడుగుతున్నా గా Watch అయ్యుంటుంది” అని కరెక్ట్ గా గెస్ చేసింది.

“ఎందుకు రా ఇవి” అని ఏంటా అని ఆతృతగా కవర్ తీసింది అమ్మ. ముత్యాల హారం. అది చూసి అమ్మ మొహం విచ్చుకుంది. అచ్చం తన చిన్నపుడు వేసుకున్న దానిలానే ఉంది డిజైన్. తనకెంతో ఇష్టమైనది.

ముగ్గురు అలా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉండగా, చిన్నూ లోపలికెళ్లింది .

ఓ రెండు నిమిషాల తర్వాత, పరిగెత్తుకుంటూ వచ్చి….

” లక్ష్మి ఆంటీ ” అని పిలిచింది.

“ఏంటి చిన్నూ” అని కిచెన్ లో సామాన్లు కడుగుతున్న పనిమనిషి హాల్లోకి తొంగి చూసింది .

ఇలా రా అంటూ చేత్తో సైగ చేసి పిలిచింది.

లక్ష్మి తో పాటు మిగతా ముగ్గురు ఎందుకు పిలిచిందా అని చూస్తున్నారు.

లక్ష్మి రాగానే, చిన్నూ తన చేతుల్లో వెనుక దాచి పెట్టిన బార్బీ బొమ్మని ఆవిడకిస్తూ , ” Happy Women’s Day ఆంటీ ” అంది.

లక్ష్మి ఎటువంటి చలనం లేకుండా చిన్నూని చూస్తోంది. అక్కడున్న మిగతా వాళ్ళు కూడా.

“తీస్కో ఆంటీ… ” అని బొమ్మను ఆవిడ చేతికి తాకించింది. ఆవిడ తేరుకుని అందుకుంది. “థాంక్స్ చిన్నూ ” అంటూ పాపని హత్తుకుంది లక్ష్మి. ఆవిడ కళ్లలలో నీటిపొరలు తిరుగుతున్నాయి. తుడుచుకుంటూ లోపలికెళ్ళిపోయింది.
అది చిన్నూ తల్లికి మొదటి సారి కూతురి పైన గర్వం కలిగిన క్షణం.
అది చిన్నూ అమ్మమ్మకి ‘తానెందుకు లక్ష్మి గురించి ఆలోచించలేదు’ అని ఏడేళ్ల పసితనం 60 ఏళ్ల అనుభవాన్ని ప్రశ్నించిన క్షణం.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: ,