This Painful Open Letter From A Weaver Explaining How His Profession Is Being Neglected Will Hit You Right In The Feels!

బ్రాండ్లు , కంపెనీలు అని తిరిగే ఈ కాలంలో ఇంకా మగ్గాన్ని నమ్ముకుని , గిరాకీ లేకున్నా తమకు బ్రతుకు నేర్పిన వృత్తి కి గౌరవం ఇస్తున్న చేనేత మనసులోని లోని మాట !!!
ఇన్ని బ్రాండెడ్ దుస్తులున్నాయి కదా ఇంకా ఖాదీ చొక్కాలు ఎవడు కొంటాడు అని ఈ తరం వారందరూ అనుకుంటారు. జీవించటానికి జీతాలు కావాలి కానీ జీతం కోసం జీవించకూడదు. బ్రతుకు తెరువు కోసం పుట్టెడు అన్నం పెట్టిన వృత్తిని బజారు కీడ్చే బతుకులు కావు మావి. ఈ శ్వాస ఎప్పుడు ఆగుతుందో తెలీదు, ఈ రోజు ఈ క్షణం నాకు కడుపు నింపే ఈ వృత్తి ని వదులుకోలేను, వదులుకోను కూడా. మార్పు అందరు కోరుకుంటారు కానీ ఆ మార్పు ఓ వనిత ని వేస్య లా తయారుచేస్తుంది. ఒక చీర కట్టు భారతీయ సంస్కృతిని , భారత స్త్రీ లోని అందాన్ని ప్రతిబింబిస్తుంది. కంచి పట్టు , ఉప్పడ పట్టు ఇలా చెప్పుకుంటూ పోతె ఎన్నో మరెన్నో. కాలం మారినంత మాత్రాన కళలు కాలగర్బంలో కలసిపోవు.రాత్రి కనే కలకు పగలు ప్రాణం పోసేవే ఈ కళలు.
మనసుకు నచ్చే మనసులు మెచ్చే ఈ కళను నేను వదులుకోలేను దానితో నాకున్న అనుబందం అలాంటిది. మనసును చంపుకొని మనుషులని వాడుకొని బ్రతికే రాజకీయ నేతలం కాము మేము .. “చేనేతలం”… కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు కానీ ఈ కాలం లో కోటి కోసం కడుపు నింపిన విద్యలను అణచివేస్తున్నాం. కరములు కదిలితే కానీ కడుపులు నిండవు. రోజంతా చెమటోడ్చి పని చేసిన చేతికి వచ్చేది 50 రూపాయలు. కూడు , గుడ్డ , పిల్ల జల్ల అందరు ఆ 50 తోనే జీవించాలి. నేతలు మా దరికి రారు, దరిద్రం మా దరి నుండి పోదు. రాట్నం ఆడించాలి , మరాస తిప్పాలి , మగ్గం కదిలించాలి ఒక బట్ట వెనక ఉన్న కష్టం , అది నేసే వాడి దారిద్యం ఎవరు చూడరు చూడాలని అనుకోరు.
కష్టాలు అలవాటయి పోయాయి.. కన్నీరు ఇంకి పోయాయి.. బ్రతుకులే భారమై పోయాయి.. అయిన గుండెలో బలం చేతిలో నైపుణ్యం అవసరమే ఆయుధం .. చీకటి కమ్మిన,తొలకరి తాకినా ఈ ” పడమటి సూరీడు ” మళ్ళి ఉదయిస్తాడు. అలాగే కనుమరుగవుతున్న ఈ కళలకు మళ్ళి వెలుగులోకొచ్చే రోజు ఎప్పుడు వస్తది. మనిషి బ్రతకటానికి కావలిసినవి మూడు ముఖ్యమైనవి – తిండి ,గుడ్డ , ఇల్లు – కాపు కోయాల్సిన రైతు గొంతు కోసుకుంటున్నాడు , గుడ్డ కొట్టాల్సిన ఈ చేనేత రాళ్లు ఎత్తే స్థితి కి ఒచ్చాడు . టెక్నాలజీ యుగం అని చెప్పుకు తిరిగే ఈ కాలం కుర్రోలారా , మార్పు తేవాల్సింది పట్టణాల్లో కాదు పల్లెల్లో , సమస్య వెతకాల్సింది బద్దకస్తులు ఇళ్ల లో కాదు మా బతుకుల్లో . ఇంటి ముందుకి కారు , నోటి దగ్గరకి అన్నం తీసుకొచ్చేంత ఎదిగిన మీ టెక్నాలజీ , అడుగంటిన మా కళను మాత్రం అడుగునే ఉంచేసింది .. మీరు తీసుకొచ్చే పరిష్కారాలు మనిషికి బద్ధకాన్ని ఇస్తున్నాయి, బ్రతుకుల్ని కాదు.
మా వైపు ఓ సూపు సూడండి సారూ !!
If you wish to contribute, mail us at admin@chaibisket.com