A Heart Warming Encounter Between A Student & Watchman- A Short Story

 

Contributed By Nir Vaana

 

ఆరోజు ఆదివారం.ఎప్పటికన్నా తొందరగా హుషారుగా చాలా సంతోషంతో సూర్యుడితో పోటీ పడి లేచాడు సూర్య.రోజు లేచి కాలేజీకి వెళ్లాలి,కానీ ఈరోజు స్టేడియంలో క్రికెట్ కి వెళ్ళాలి.ఆడడానికి కాదు,స్నేహితులు ఆడుతుంటే చూడడానికి.మనం ఆడితే మన ఒక్కరి ఆటే,అదే చూస్తే మూడు నాలుగు మ్యాచులు చూడొచ్చు అనుకుంటాడు అతను!లేచి బ్రష్ చేసుకుని,వచ్చి స్నానం చేయొచ్చులే అని మొహం కడుక్కుని ఒక ముప్పై రూపాయిలు జేబులో వేసుకుని తన స్నేహితుడు చేతిలో బ్యాట్ తీసుకుని selfie అనగానే రెండేళ్ల పాప ఫోజులు ఇచ్చినట్టు బ్యాట్ తో విన్యాసాలు చేస్తూ నడుస్తూ స్టేడియంకి వెళ్లారు.ఫ్రెండ్స్ ని వెళ్లమని చెప్పి జేబులో ఇరవై రూపాయిలు తీసి ఆ స్టేడియం పక్కన ఒక వయసు పైబడిన అమ్మ అమ్ముతున్న ఎగ్ దోశ తిని,పది రూపాయిలు వచ్చేటప్పుడు లస్సీ తాగడానికి ఉంచుకున్నాడు.ఆ బండి మీద అమ్మ వేసే ఎగ్ దోశ అంటే సూర్యాకి ప్రాణం!

 

సమయం తొమ్మిది అయ్యింది.అప్పటికే స్టేడియంని చాలా వరకూ ఈ అభినవ టెండుల్కర్లు ఆక్రమించేశారు.అలా ఒక దగ్గర నిల్చుని తాటి చెట్టు మీద నుంచి కోడి పిల్లల కోసం వెతికే గద్దలా అలా దీర్ఘంగా చూస్తున్నారు,ఒక స్థలం కంట పడింది.అందరూ అక్కడికి వెళ్లి వికెట్లు పాతి,గ్రీజులు గీస్తూ ఉంటే సూర్య గోడ మీద కూర్చోడానికి ఎక్కడ నీడ ఉందో వెతుక్కున్నాడు!టీములు వేసుకుని మనిషి పది రూపాయిలు కూడగట్టి 22 మంది 220/- బెట్టు వేసుకున్నారు.మ్యాచ్ మొదలైంది.ఆడేవాళ్లకి ఎలా ఉన్నా, వాళ్ల వచ్చీ రాని ఆట చూసే వాళ్లకి మంచి కాలక్షేపం అవుతుంది.సూర్యకి కూడా అదే జరిగింది.మొదటి మ్యాచ్ అయిపోయింది,గెలిచిన టీము దగ్గర డబ్బు రాబెట్టడానికి రెండో మ్యాచ్,ముచ్చటగా మూడో మ్యాచ్!గొడవలు పడి ఇంకొక మ్యాచ్.టైమ్ మధ్యాహ్నం రెండు అయ్యింది.ఎండకి అందరూ శక్తిహీనులు అయిపోయారు.ఇక ఆట అపేసి తిరిగి హాస్టళ్లకు బయలుదేరారు….

 

వెళ్లి స్నానం చేసి, పొదున్నుంచి దేశం కోసం చాలా కష్టపడినందుకు విశ్రాంతికి ఒరిగారు.అలా మాట్లాడుకుంటూ అదిరా ఇదిరా,అది కాదురా ఇది కాదురా అని ఒక్కొక్కరుగా రాత్రికి గూటికి చేరుతున్న పక్షుల్లా నిద్రలోకి జారారు.మెల్లగా ఆరింటికి ఒక్కొక్కరు లేచి మొహం కడుక్కుని అలా బాగా అలవాటు పడిన పని అయిన సమయ వృధా చేసి రామ సేతు కట్టడానికి బయలుదేరిన వానర సైన్యంలా రోడ్డు మీదకు బయలుదేరారు.ఏం తిందాం రా,ఏం తిందాం రా అని అందరూ ఒక మాటకు వచ్చి నూడుల్స్ తినడానికి సమాయత్తం అయ్యారు.చాలా ఆకలితో,తొలకరి కోసం ఎదురు చూస్తున్న చకోరి పక్షిలా ఆతృతగా ఆ బండి దగ్గరకు వెళ్లారు.ఆ రోజు ఆ బండి పెట్టలేదు.అందరికీ మనసు విరిగిపోయింది.ఇంక ఎటూ వెళ్లాలి అనిపించలేదు,బద్ధకం చేసి వచ్చి కొంచెం నీళ్లు తాగి అలాగే ఆకలి కడుపుతో నిద్రపోయారు…..సమయం రాత్రి ఒంటిగంట.సూర్యాకి ఒక్కసారిగా మెలుకువ వచ్చేసింది,విపరీతమైన ఆకలి వేస్తుంది.రూంలో తినడానికి ఏమీ లేవు.బయటకి వచ్చి చూసాడు.రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి.

 

అసలే ఆకలికి ఉండలేడు సూర్య.దగ్గరలో ఉన్న IN&OUT 24X7 కి వెళ్లి ఏమైనా కొనుక్కుని తినాలని నిర్ణయించుకుని బయలుదేరాడు.ఈరోజు అతని అదృష్టం ఏమీ బాలేదు.అది కూడా మూసేసి ఉంది.చాలా నిరాశతో వెనుదిరిగాడు.కడుపు పట్టుకుని తిరిగి రూముకి వస్తున్నాడు.మధ్యలో ఒక గోల్డ్ షాపుకి సెక్యూరిటీ గార్డులా పనిచేస్తున్న బక్కగా పలచబారిన శరీరంతో అరవయ్యేళ్లకి పైబడిన ఒక వ్యక్తి “ఏయ్ బాబు!” అని పిలిచి ఆపాడు.కొంత విసుగుగా ఆగాడు సూర్య.మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ సూర్య దగ్గరికి వస్తున్నాడు అతను.ఈలోపు సూర్య మెదడులో ఎన్నో సందేహాలు!తిన్నగా నడవలేకపోతున్నాడు చూడ్డానికి గాలోస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు ఈయన సెక్యూరిటీ గార్డ్ ఏంటి అనుకున్నాడు సూర్య!

 

సూర్య దగ్గరకి వచ్చిన అతను ఒక చిన్న అమాయకపు బోసి నవ్వుతో ,” ఏమైందిబాబు?? అటు వెళ్లడం చూసాను,ఏదైనా సమస్యనా “అని అడిగాడు. సమాధానం  చెప్పే ఇష్టం లేకపోయినా వయసుకి మర్యాద ఇచ్చి ఏం లేదండీ షాపుకి వెళ్ళా తీసి లేదు అని దిగాలుగా చెప్పాడు సూర్య! “ఈ టైంలో షాపుకి ఏంటి బాబు??”అడిగాడు అతను.అబ్బా ఈయనేంటి ఇలా తగులుకున్నాడు అని మనసులో అనుకుని ఆకలేస్తుంది అండి చాలా,కడుపు తర్రుక్కుపోతుంది అని బదులిచ్చాడు సూర్య.”అయ్యో!ఇప్పుడు కనీసం టీ షాపులు కూడా ఉండవే”అని గడ్డం మీద చేతితో పాముతో తల కిందకి దించి దేశ రక్షణకు ప్రణాళిక వేస్తున్నట్టు దీర్ఘంగా ఆలోచించి ఉండు బాబు వస్తా అని వెనుదిరిగాడు ఆ వాచ్ మ్యాన్.ఇప్పటికీ చిరాకుగా ఉంది అంటే ఈ ముసలోడి చేదస్తం ఏంటిరా బాబు అనుకున్నాడు సూర్య!

 

అతను తన కుర్చీ దగ్గరకు వెళ్ళి “రామచంద్ర!” అంటూ మెల్లగా కిందకు వంగి ప్లాస్టిక్ కవర్లో ఒక బాక్సు తీసుకుని సూర్య వైపు వస్తున్నాడు.అప్పటివరకు విసుక్కున్న సూర్య ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు.ఆ వాచ్ మ్యాన్ మెల్లగా నడుచుకుంటూ సూర్య దగ్గరకి వచ్చి కొంచెం బిడయం,కొంచెం నాముషితో కూడిన నవ్వు నవ్వుతూ”బాబు,మరేమీ అనుకోకు,పేదోళ్ళం,నాకు సుగరుంది,అందుకే రాత్రి తినమని నా పెద్ద కోడలు రోజు రెండు చపాతీలు బాక్సులో పెట్టిస్తది.చాలా బాగా చేస్తది. నాకు ఒక్కరోజుకి లేకపోయినా పర్లేదు.పాపం ఆకలి అని కడుపు పట్టుకుంటున్నావు,ఆ నొప్పి నాకు తెలుసు బాబు,యివ్వి తిను బాబు”, అని చాలా సిగ్గుగా మొహమాటంగా బాక్సుని సూర్య చేతుల్లో పెట్టాడు అతను.ఒక్కసారిగా సూర్య ఆకలి మాయమైపోయింది.ఆ ఆకలి నొప్పంతా నీటి రూపంలో కళ్లలో చేరింది.కళ్లు చెమర్చాయి.అతన్ని విసుక్కునందుకు ఒకింత తనలో తాను తనని అసహ్యించుకున్నాడు.అతనికి ఏం చెప్పాలో,ఎలా చెప్పాలో సూర్యకి అర్థం కాలేదు.కృతజ్ఞతతో అతడి కడుపు నిండిపోయింది. వద్దండి!నేను వెళ్తా అని చెప్పి బయలుదేరుతుండగా వాచ్ మ్యాన్ ఆపి,”బాబు! మా పెద్ద కొడలుకి చాలా పట్టింపులు,నీటుగా ఉంటాది,అందులో ఎలాంటి డవుటులు పెట్టుకోకండి” అనేసరికి సూర్యకి చాలా నాముషిగా అనిపించింది.సరే అండి!రెండు ఉన్నాయి అన్నారు కదా,ఒకటి మీరు ఒకటి నేను తిందాం అన్నాడు అతనితో.మొదట ఆయన ఒప్పుకోకపోయినా,సూర్య బలవంతం చెయ్యడంతో ఒప్పుకున్నాడు.ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ అవ్వీ తిని,మనస్ఫూర్తిగా అతనికి థాంక్స్ చెప్పి రూముకి వెళ్ళిపోయాడు సూర్య!

 

అక్కడ నుంచి వాళ్లు ఆ ఏరియాలో ఉన్నంత కాలం ఆయనకి నైట్ డ్యూటీ పడినప్పుడు రాత్రి 12-1 సమయంలో రూంలో అందరూ కలిసి ఏదైనా తినడానికి ఆయన దగ్గరకి పట్టుకెళ్లి అన్ని విషయాలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసి వచ్చేవాళ్ళు…

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,