This Story Of A Battle Between Arjuna And Hanuman Is A Lesson In Humility For All Of Us!

 

అర్జునుడు యుద్ధ విద్యలో ఆరితేరిన గొప్ప వీరుడు. తన ఆయుధాల ఆస్థిలో పాశుపతాస్త్రం కూడా ఉండాలని తపించి పరమేశ్వరుడి ద్వారా దానిని వరంగా పొందాలని పరమ పుణ్యస్థలమైన రామేశ్వరానికి వెళ్ళాడు. అదే సమయంలో ఒక గుట్ట మీద ఆంజనేయ స్వామి రామ నామాన్ని జపిస్తూ అనిర్వచనీయమైన ఆనందంలో మునిగిపోయాడు. అర్జునుడు ఆంజనేయ స్వామిని చూసి పరిహాసంగా ‘ఏ ముసలి కోతి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు’ అని అడిగాడు. దానికి హనుమా.. ‘శ్రీరాముడు లంకలో ఉన్న సీతమ్మ కోసం ఈ సముద్రాన్ని దాటడానికి బండరాళ్ళతో వారధిని నిర్మించి ఆ రావణుడిని వీరోచితంగా సంహారించారు, అదిగో ఆ మహా వీరుని సైనికుడిని, దాసుడిని నేను’ అని ప్రశాంతంగా బదులిచ్చాడు. దానికి అర్జునుడు ఒకింత హేళన స్వరంతో “ఓహో నీ రాముడు అంతటి వీరుడే ఐతే ఈ సముద్రాన్ని దాటడానికి బండరాళ్ళతో మీ అందరిని కష్టపెట్టి వారధిని నిర్మించడం ఎందుకు.? స్వయంగా ఆయనే బాణాలు సంధించి వాటితో వారధిని నిర్మించవచ్చుగా.”! అని వెకిలిగా మాట్లాడాడు. అప్పటి వరకు ప్రశాంతంగా సమాధానాలిచ్చిన హనుమంతుడు తన రాముడి గురించి అలా హేళనగా మాట్లాడేసరికి ఆగ్రహంతో.. “బాణాలతో వారధిని నిర్మిస్తే బలిష్టమైన వానర సైన్యం బరువుకి అది కూలిపోయే అవకాశం ఉంది, అందుకే మా శ్రేయస్సు కోసం నా రాముడు బాణాలతో వారధిని నిర్మించలేదు. ఐనా ఈ భూమండలంలోనే శాశ్వత వీరుడైన నా రాముడిని కించపరిచేంతటి స్థాయి నీకు లేదు, నువ్వు అంతటి వీరుడవే ఐతే ఇప్పుడే ఈ క్షణమే నీ బాణాలతో వారధిని నిర్మించు, నా కాలి బొటనవేలితో దానిని తునాతునకలు చేస్తా అంటూ కోపంతో హెచ్చరించాడు”.

దానికి మరింత కోపానికి లోనైన అర్జునుడు ‘హనుమా.. బాణాలతో నిర్మించిన వారధి కేవలం కోతుల బరువు కూడా మోయకుంటే ఇక ఆ వీరుడి గొప్పతనం ఏముంది’ అని వెకిళి నవ్వుతో పరిహసించి ‘ఈ పోటికి నేను సిద్ధం, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు చూస్తుండగానే వారధిని నిర్మిస్తాను నువ్వే దానిని పరిక్షించి చూసుకోవచ్చు’. అందుకు ఆంజనేయుడు ‘నా కాలి బొటనవేలు పడగానే నీ వారధి సముద్రంలో మునిగిపోతుంది, అదే జరిగితే నువ్వేం చేస్తావో చెప్పు అని అన్నాడు ధీమాగ’. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న అర్జునుడు ఆ మాటలు విని “ఒక కోతి కూడా మోయలేని వారధిని నిర్మించలేని నాకు ఇక బ్రతకడం అనవసరం.. నీ బొటనవేలుకే మునిగిపోతే నేను సజీవంగా అగ్నిప్రవేశం చేసి మరణిస్తా, మరి వారధి సముద్రంలో మునగకపోతే నువ్వేం చేస్తావో చెప్పు అని అడిగాడు’. దానికి హనుమా.. ‘వారధి మునగకపోతే రాముల వారికి యుద్ధంలో తోడు ఉన్నట్టుగానే నీకు తోడుగా ఉంటాను.. నీ రథం జెండాలో కొలువుతీరి నీ విజయానికి అవసరమవుతానని జవాబిచ్చాడు.

ఇక ఏమి మాట్లాడకుండా ఆంజనేయుడిని ఓడించాలని మనసులో అనుకుని అర్జునుడు తన ఆయుధంతో బాణాలను సంధించి వారధిని నిర్మించాడు. ‘ఇప్పుడు పరీక్షించుకో అని రాబోయే విజయాన్ని ముందుగానే అనుభవించి ఒక్క సైగా చేశాడు అర్జునుడు. హనుమంతుడు కొన్ని క్షణాలపాటు రాముడిని భక్తితో తలుచుకుని వారధి వైపు నడిచాడు. కాస్త దూరం ఉండగానే ఆంజనేయుడు పరుగున ఎగిరి ఒక్కసారిగా ఆ వారధిపై బొటనవేలితో అదిమేల దూకాడు. రెప్పపాటు కాలంలోనే పేకమేడలా ఆ వారధి కూలిపోయింది. ఇప్పుడు ఏమంటావు అన్నట్టుగా అర్జునుడి వంక చూసాడు. అర్జునుడి గర్వం అలాగే కూలిపోయింది. అర్జునుడిని ఓటమి విపరీతంగా బాధపెట్టింది. ఎంత మొండిగా వ్యవహరించాను.. అని అదే బాధలో తను ఇచ్చిన మాట ప్రకారం సజీవంగా అగ్నిలో ప్రవేశించాలని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఆంజనేయుడు వద్దని ఎంత వారించినా గాని మాట వినడం లేదు.

‘ఇన్నాళ్ళు నేను వీరుడుని, శూరుడిని అని భ్రమపడ్డాను కాని నేటితో నా శక్తి ఎంతో తేలిపోయింది. నా మీదే ఆశలు పెట్టుకున్న నా అన్న ధర్మరాజు నా మరణంతో ఎంత విలపిస్తాడో’ అని మధనపడుతు అగ్నిప్రవేశానికి సిద్ధపడుతుండగా హఠాత్తుగా మారు వేషంలో శ్రీకృష్ణుడు ఒక బ్రహ్మచారిగా అక్కడికి చేరుకున్నాడు. అగ్నిప్రవేశం చేయబోతున్న అర్జునుడిని ఆపాడు. ‘నీవు అర్జునుడివి కదా.. నీవు మహా వీరుడువి అని నేను విన్నాను కాని ఎందుకు ఇలా అగ్నిప్రవేశం చేయబోతున్నావు’ అని అడిగాడు. అర్జునుడు జరిగినదంతా అతనికి వివరించాడు. ఆ బ్రహ్మచారి ఒక చిన్న నవ్వు నవ్వి ఈ పోటి న్యాయంగా లేదు.. ఏ పోటికి ఐనా న్యాయనిర్ణేత అవసరం, ఇంతకు ముందు జరిగిన పోటిలో న్యాయనిర్ణేత లేడు. ఇప్పుడు నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాను. మరల తిరిగి ప్రారంభించండని అన్నాడు. ఆ బ్రహ్మచారి మాటల్లో నిజం ఉందని భావించి అర్జునుడు, ఆంజనేయులు పోటికి మరోసారి సన్నద్ధమయ్యారు. ఈసారి అర్జునుడు తన మార్గదర్శి ఐన శ్రీకృష్ణుడిని మనసులో తలుచుకుని బాణాలను సంధించాడు. బ్రహ్మచారి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు తన చక్రాయుధాన్ని వారధి మధ్యలో నిలిపి ఉంచాడు. అప్పటికే విజయ గర్వంతో ఉన్న హనుమంతుడు మరలా వారధిని కూల్చడానికి పయనమయ్యాడు.. ఒక్కసారిగా వారధి మీద బోటనవేలు అదిమేల పైనుండి దూకాడు.. ఆశ్చర్యం.!

ఆ వారధి కూలలేదు.. రెండు కాళ్ళతో మరలా ప్రయత్నించాడు.. పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఈసారి తన విశ్వరూపంతో బలంగా వారధి మీద దూకాడు కాని వారధి చెక్కు చెదరలేదు. హనుమంతునికి తాను ఓడిపోయానని అర్ధం అయ్యింది. తన ఓటమిని అంగీకరిస్తూ ఒక్క ఉదుటన ఆ బ్రహ్మాచారి, అర్జునుడి ముందర దూకాడు. అలా దూకిన వెంటనే ఆ బ్రహ్మాచారి రాముడిగా, శ్రీ కృష్ణుడిగా దర్శనమిచ్చాడు. ఆంజనేయుడు అపరభక్తితో శ్రీ కృష్ణుడుని పాదాల మీద పడి వినమ్రంగా నమస్కరించాడు. శ్రీ కృష్ణుడు హనుమంతుడిని ఆత్మీయంగా గుండెలకు హత్తుకుని హానుమా.. నేనే రాముడిని, నేనే శ్రీ కృష్ణుడిని నన్ను వేరు వేరుగా ప్రార్ధించే వారిని ఇలా ఒక్క చోటుకు తీసుకురావాలనే ఈ కార్యం. అర్జునుడు మొదట నా గురించి హేళనగా మాట్లాడి వారధిని నిర్మించాడు కాని నువ్వు నన్ను భక్తితో వేడుకున్నావు. రెండవసారి అర్జునుడు నన్ను మనస్పూర్తిగా ప్రార్ధించాడు కాని విజయ గర్వంతో నేను ఉండే చోటికి అహాన్ని తీసుకువచ్చి నన్ను మరిచావు, అందుకే నువ్వు రెండవసారి ఓటమి పాలయ్యావు. అర్జునుడిని, హనుమంతుడిని చూస్తూ.. ఎవ్వరైనా ఎంతటి శక్తి వంతులైనా గాని ఎదుటివారిని గౌరవించాలి వారి శక్తిని ఏ భేషజం లేకుండా గుర్తించి, గౌరవించాలి. ఎప్పుడైతే ఎదుటివారి శక్తిని తక్కువ అంచనా వేస్తే ఇదే ఓటమి వారికి వరిస్తుంది. మీరు ధైర్యంగా, నీతిగా, న్యాయంగా, ప్రాణంతో మొదలుపెట్టండి దానిని పూర్తి చెయ్యడానికి నేను వస్తాను.!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,