పాటలోని పాఠం: సిరివెన్నెల సినిమా లోని ‘విరించినై విరంచితిని’ పాటలో ఉన్న అద్భుతమైన భావం

 

Contributed By Sowmya Uriti

 

ఒక పాట నచ్చింది అన్నామంటే, సంగీతమే కాదు సాహిత్యం కూడా మన మదిలో చోటు సంపాదించుకుందనే చెప్పాలి. అలా ఎందరో మనస్సులను మీటిన పాట సీతారామశాస్త్రి గారి ఇంటిపేరుగా నిలిచిన ‘సిరివెన్నెల’ చిత్రంలోని ‘విధాత తలపున ప్రభావించినది ‘. ఈ పాటలోని ప్రతి వాక్యానికి అర్ధం తెలుసుకుంటే, ఇంత మంచి సాహిత్యాన్ని అందించిన శాస్త్రిగారికి కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.వాటి అర్ధం చెప్తూ పాట సారాంశం తెలిపే ప్రయత్నం ఇది .

 

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం.. ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓం..

 

సృష్టికర్త( బ్రహ్మ) ఆలోచనలలో మొదలైనది సృష్టికి ప్రతిరూపైన ఓం కారం.. ప్రాణనాడులలో కదలికలను తెచ్చినది ఈ ఓంకారం..

 

కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..
ఎద కనుమల లో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం..

 

(కళ్లను కొలనుతో పోల్చారు) విశ్వంలో కళ్ళకు కనిపించే ప్రతిది దైవ ప్రతిరూపమైనది.. బ్రహ్మ మీటుతున్న వీణ యొక్క గానం హృదయమనే పర్వత శ్రేణులలో మ్రోగుతుంది..

 

సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సార మిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం..

 

భారతీయ శాస్త్రీయ సంగీతానికి సామవేదం మూలం.. రమ్యమైన స్వరం వంటి ,(దేవనది) గంగా ప్రవాహం వంటి సామావేద సారాంశం ఇది..జీవితం గురించి నేను పాడిన ఈ పాట..

 

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం..

 

బ్రహ్మనై రాశాను ఈ కవిత.. వీణనై వినిపిస్తున్నా ఈ పాట..

 

చరణం :
ప్రార్దిష వీణియ పైన దినకర మయూహ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా..
విశ్వ కావ్యమునకిది భాష్యముగా..(విరించినై..)

 

తూర్పు అనే వీణపై సర్యకిరణాలనే తీగలుగా.. మేల్కొన్న పక్షుల గుంపులు విశాల ఆకాశమనే వేదికపై పలికే కిలకిలారావాలు లయ కాగా అది ప్రపంచానికి మొదలు.. విశ్వమనేది కావ్యమైతే దాని భాష సంగీతం.. సృష్టిలో ప్రతిదాన్లో సంగీతం ఉంటుందని భావం..

 

చరణం :
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం..
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం.. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే.. (విరించినై..)

 

పుట్టే ప్రతి శిశువు గొంతులో పలికే శబ్ధ కెరటాలలో (ఏడుపు) కూడా సంగీతమే.. చైతన్యం చెంది స్పందించే గుండె చప్పుడు మృదంగ యొక్క ధ్వని వంటిది.. ఇలా సృష్టిలో జరిగే అనంతమైన ప్రక్రియలు ఓంకారంలో ఇమిడి ఉన్నాయని వివరించారు..

 

నా ఉచ్ఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం.. (సరసస్వర)
నేను పీల్చే ఊపిరి కవిత.. నేను విడిచే ఊపిరి పాట..

 

ఇలా ప్రణవనాదం గురించి సంగీతం గురించి అద్భుతంగా రచించారు శాస్త్రి గారు. పాట విన్న ప్రతిసారి ఆయన్ని తలచుకొని ఇంత మంచి సాహిత్యాన్ని పరిచయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోక తప్పదు..


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,