Here’s The Story Of Vijaya, An Artist Who Turned Her Passion Into Career Is Inspiring

 

మా ఇంట్లో వారందరికీ దైవభక్తి ఎక్కువ. నా చిన్నతనం నుండే రామాయణం, భగవద్గీత, శివపురాణం మొదలైన ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువగా చదివేదానిని, వాటన్నిటి నుండి నేను నేర్చుకున్నది ఒక్కటే.. “ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరి పుట్టుకకు ఒక కారణం తప్పక ఉంటుంది, అదేమిటని తెలుసుకుని ఆచరించడమే ఈ జీవితానికి అర్ధం పరమార్ధం అని“. అయితే ఈ జ్ఞానోదయం అవ్వడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. 

నా పేరు విజయ, మాది మేడ్చెల్ జిల్లా శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లి అనే విలేజ్. అమ్మ నాన్నలకు మేము నలుగురు పిల్లలం. అన్నయ్య ఒక్కరికే శారీరకంగా ఏ లోపాలు లేనిది. నాకు పోలియో మూలంగా వీల్ చైర్ కే పరిమితమయ్యాను. మా తల్లిదండ్రులది మేనరిక వివాహం అవ్వడం వల్ల అక్కయ్యకు తమ్ముడుకు కంటిచూపు మందగించి, ఈ ప్రపంచాన్ని పూర్తిగా చూసే భాగ్యాన్ని కోల్పోయారు. అమ్మ ఇంటి పనులు చూసుకుంటుంది, నాన్న ఊరూరు తిరుగుతూ బట్టలమ్ముతుంటారు. బయటి ప్రపంచం కృత్రిమంగా నాపై ప్రేమ వలుకబోస్తూ జాలిపడేవారు కానీ అమ్మానాన్నలు మాత్రం నన్ను ఆత్మవిశ్వాసంతో నన్ను నన్నుగా ప్రేమించారు, అదే వారు నాకందించిన గొప్ప వరం, ఆస్థి, లక్షణం!! 

నాకు నడవడం ఎప్పుడైతే కష్టంగా ఉందో అప్పుడే నాన్న మూడు చక్రాల కుర్చీ ఒకటి చేయించారు. ఆ కుర్చీ వచ్చాక నాకన్నా నా స్నేహితులకే ఎక్కువ ఆనందం వేసింది. చిన్నతనంలో ఆట వస్తువులంటే పిల్లలకు చాలా నచ్చుతుంది, అలా వారికి దొరికిన పెద్ద ఆట వస్తువు నేను కూర్చునే మూడు చక్రాల కుర్చీ. నన్ను ప్రతిరోజూ ఎవరో ఒకరు స్కూల్ కి తీసుకువెళ్ళేవారు, నేను తీసుకువెళ్తా నేను తీసుకువెళ్తా అని పోటీపడి మరి తిరిగి ఇంటికి తీసుకువచ్చేవారు. 

నేను స్కూల్ కి వెళ్లడం మా కుటుంబానికి, కొంతమంది స్నేహితులకు తప్ప మరెవ్వరికి అంతగా నచ్చేది కాదు.. ఎందుకమ్మా ఇంట్లో ఉండనివ్వకుండా విజయను స్కూల్ కు పంపిస్తున్నారు..? చదువుకుని ఆమేమైన జాబ్ చేస్తదా? అని చాలామంది విమర్శించేవారు. అలాంటపుడు అమ్మ నాన్నలు బయటి వారి మాటలకు కాకుండా, నా ఇష్టానికి విలువ ఇచ్చారు. నేను పరీక్ష రాయడానికి వెళ్లినా, నా పనులు చూసుకోవడానికైనా నా కుటుంబం చూపించిన సహకారం, ప్రేమ ఎల్లలు లేనిది. 

మనం విద్యార్థిగా మారితే ఈ లోకమంతా ఓ పాఠశాల అవుతుంది, ప్రతి ఒక్క ప్రాణి, వస్తువు గురువవుతాడు. నేను పెయింటింగ్ కూడా అలాగే నేర్చుకున్నాను. యూట్యూబ్ లో, కొంతమంది ఆర్టిసులు వేసిన పెయింటింగ్స్ చూసి మరింత రాటుదేలాను. చిన్నప్పుడు మా క్లాస్ టీచర్, తోటి స్టూడెంట్స్ పెయింటింగ్స్ వేసి వారిని ఇంప్రెస్ చేసేదానిని. నన్ను జాలితో కాకుండా నన్ను నన్నుగా చూసుకునేది పెయింటింగ్ వల్లనే!! గరికపాటి నరసింహారావు గారు ఒక మాట అంటారు నీకంటూ ఒక రంగం ఎంచుకో అందులో వీరంగం ఆడు అని.. నాకెంతో నచ్చిన పెయింటింగ్ నే నా కెరీర్ గా ఎంచుకున్నాను.. వడ్డాది పాపయ్య, తోట వైకుంఠం గారిలా ఈ రంగంలో ఎదగాలన్నదే నా ప్రస్తుత ఆశయం. 

ఒకప్పుడు ఎవరైతే నాకు చదువు అక్కర్లేదు ఇంట్లోనే ఉంటే సరిపోతుంది అని అన్నవారు ఆర్టిస్ట్ గా నాకు వస్తున్న గుర్తింపును చూసి సంతోషపడుతున్నారు. అది బాగానే ఉంది కాని నన్ను నన్నుగా గుర్తించిన వారు వారింట్లో మహిళల ఇష్టాలను ఎందుకు గుర్తించరు.? ప్రోత్సహించరు..? వారింటి స్త్రీ వల్లనే గౌరవం దక్కుతుందని నమ్మేవాళ్ళు వాళ్ళని ఎందుకు గౌరవించరు.? శారీరక లోపంతోనే ఇంత సాధిస్తే అన్ని ఉండి ఎక్కడికంటే అక్కడికి ప్రయాణించి తెలుసుకోగల మహిళల అడుగులకు ఎందుకు సరిహద్దులు నిర్ణయిస్తారు.? వారు వంద అడుగులు వేస్తే కుటుంబ సభ్యులు ఒక్క అడుగు తోడుగా వేసినా చాలు అది ఎంతో శక్తినిస్తుంది!! 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,