This Nostalgic Note Of 90s Kid Will Tell You What Is The Actually Vibe Of Sankranthi

Contributed By Ravi Mantripragada

‘కొత్త సంవత్సరం వచ్చింది,వెళిపోయింది కూడా… ఓ పక్క చూస్తే బుజ్జిగాడు , నాని గాడు అందరూ పండక్కి కొత్త బట్టలు కొనేసుకుంటున్నారు ఈ నాన్న గారేంటీ,ఏమీ మాట్లాడరు?అసలు గుర్తుందో లేదో .. అమ్మైనా గుర్తు చెయ్యచ్చు కదా?’ అడుగుదామంటే,’అప్పుడే అంత ఖంగారేం’ అని గసిరింది…. 

                          మెల్లగా ఓ నాల్రోజుల తర్వాత…అంటే, జీతాలొచ్చిన తర్వాత అన్నమాట… ‘బడి అయ్యాకా ఆటలకెళ్ళద్దు.తిన్నగా ఇంటికొచ్చేయండి. సాయంత్రం నాన్నగారు బైటికి తీసుకెళ్తారు.’ ,ఉన్నఫళాన చెప్పేది అమ్మ. ఊరంతా ఎన్ని బట్టల కొట్లున్నా,నాన్నగారి సైకిల్ మాత్రం ముస్లింవీధి దేవిక్లాత్ వాళ్ళ షాపు ముందే ఆగేది. వెళ్లిన పది నిముషాల్లోనే నాకూ మా పెద్దోడికి,భోగి పండక్కి,పెద్ద పండక్కి కలిపి రెండు జతల లాగు,చొక్కాలు కొనేవారు.ఇద్దరికీ ఒకే తానులో ముక్కలు ఎందుకు అని ఆడిగితే,’మీరు కొట్టుకోకూడదనీ…’ అని ఓసారీ ,’అన్నదమ్ములు ఒకేలా ఉండాలని …’అని ఇంకోసారి ఏవో చెప్పేవారు.ఒకే రకం కొంటే కొంచెం బేరం ఆడొచ్చనీ,డబ్బులు తక్కువనీ ఇంత వయసొచ్చాక గాని అర్ధం కాలేదు.

                              అట్నుంచటే ఆ బట్టల్ని తీసుకెళ్లి అదే వీధిలో నాలుగు షాపులు అవతల ఉన్న చంద్రాటైలర్కిఇస్తే కొలతలు తీసుకుని,అన్ని కొలతల్లోనూ ఒక రెండో,మూడో ఇంచులు ఎక్కువ రాసుకునేవాడు.ఏం అంటే ‘ఎదిగే పిల్లలు కదండీ..మళ్ళీ పండగ దాకా సరిపోవద్దా? ‘,అని లాజిక్ చెప్పేవాడు.కుట్టాక చూస్తే,అవి మా వయసు వాళ్ళకి లూజుగాను,మా కన్నా పెద్దవాళ్ళకి పట్టకుండానూ ఉండేవి,అలా ఎలా కుట్టేవాడో మరి.పాత సినిమాల్లో పోలీసునిక్కర్లు అనే వారు వాటిని చూసి.రెండు జతల బట్టలు ఇచ్చినందుకు కొసరుగా తన చీరకి బ్లౌసో,కుదరకపోతే కనీసం ఫాలో కుట్టించేసేది అమ్మ.  పైగా, ఈయన మా ఆస్థాన టైలరు.కాలక్రమేణా డిజైనర్ బ్లౌజులు స్పెషలిస్టుగా పరిణామం చెంది మగవాళ్ళ బట్టలు కుట్టడం తగ్గించేసాడు,అదివేరే కధ.అక్కడికి బట్టల పని అయింది.

                                 ఇక పండక్కి వారం ముందు పిల్ల గ్యాంగ్ అంతా రోడ్డుమీద ఆవులకోసం వెతుక్కునే వాళ్ళం.ఆవు కనిపిస్తే అది పేడ వేసే వరకు అక్కడే ఉండీ,వేసీ వెయ్యగానే వెచ్చని,పచ్చి,ఫ్రెష్ పేడ ఇంటికి తెచ్చేసేవాళ్ళం.’భోగి పిడకలకి ఆవు పేడే శ్రేష్ఠము..’అని శాస్త్రం చెప్పిందిట.ఏవిటో అవన్నీ మాకు తెలీదు గానీ… తెచ్చిన పేడలో చాలా కొద్దిగా నీళ్లు కలిపి గోడ మీద ఎండతగిలేలా చిన్నా,పెద్దా సైజుల్లో పిడకలు వేసుకోడం తరువాయి ఘట్టం.కొంతమంది పిడకలకోసం కొద్దిగా ఊక,ఎండుగడ్డి కలుపుతారు.కాపోతే,మాకు అలా కల్తీ చేసి పిడకని అవమానించడం ఇష్టం ఉండదు.మధ్యలో చిన్న చిల్లుతో చూడ్డానికి గారెలా భలే ఉండేది ఆ పిడక.రోజూ వాటిని జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళం.ఎవరో ఎత్తుకుపోతారని కాదుగానీ,ఊడి కిందపడిపోతే పిడక విరిగిపోతుంది,మళ్ళీ భోగిదండకి పిడకలు సరిపోకపోతే  వాళ్ళవి,వీళ్ళవి ఎత్తుకుని రావాలి.అడిగి కూడా తేవచ్చు గానీ,’ఓ పిడకివ్వా..’ అని ఏం   అడుగుతాం అసయ్యంగా? పైగా,కొంతమంది ఒకటో,అరో పిడకలు పొరపాటున అడిగినా ఇచ్చేవాళ్ళు కాదు.వాళ్ళ దండ చిన్నదైపోతుందని.

                        పండక్కి కొన్ని రోజుల ముందే బడికి సెలవలు ఇచ్చేస్తారు.కానీ,శంకరం మాస్టారు ప్రైవేటు మాత్రం పండగ మూడ్రోజులే సెలవు.పైగా,సెలవలకి ముందు టెస్టు ఒకటి.ఓ మోస్తరుగా మార్కులు వస్తే ఫరవాలేదు గానీ,ఏ మాత్రం తక్కువొచ్చినా చితక్కొట్టేసేవారు.అదేంటో గానీ పిల్లల అమ్మనాన్నలు కూడా ప్రైవేట్ దగ్గర దింపేటప్పుడు గాని,మాస్టారు బైట కనపడినపుడు గాని ‘మా వాడు చదవకపోతే బాదెయ్యండి..’ అని చెప్పేవారు.ఇంక ఆయన ఊరుకుంటారా? తక్కువ మార్కులొచ్చి భయపడి పారిపోయే పిల్లల్ని,ఈ బాగా చదివే పిల్లలు ఆకురౌడీల్లా అటు ఇటు కాసేసి మాస్టారి దగ్గరికి లాక్కుపోయే వారు.నెత్తికి ఉండే నూనెకి అరచేతిని బాగా రుద్దుకుని మాస్టారి ముందు పెడితే బెత్తం దెబ్బ కొంచెం తక్కువ నొప్పి అనిపించేది.అలా ఒకటీ,అరా దెబ్బలు తిని మొత్తానికి ఎలాగో,ఈ గండం గట్టెక్కి ఇంటికి చేరి మర్నాటికి ఏర్పాట్లు చేస్కునేవాళ్ళం.ఏ మాటకామాటే, శంకరంమాస్టారి దయవల్లే ఈ మాత్రం చదువన్నా వచ్చిందేమో!!!

                       సూరన్న కొట్లోనో,అక్కడ లేపోతే దూరంలో ఉన్న కొత్త కొట్లోనో బాగా లావుగా ఉన్న పురికొస తెచ్చి దానికి పిడకల్ని జాగ్రత్తగా గుచ్చి దండచేస్కుని ఎప్పుడు తెల్లారుతుందా అని కునుకుపాట్లు పడుతూ పడుకుంటే,ఎప్పుడు నిద్రపట్టేదో కూడా తెలిసేది కాదు.

                              ఇంక పండగరోజు తెల్లవారుఝామున ముగ్గులు మొదలెడతారు అమ్మలు, అమ్మాయిలు. అదేవిటో,ఆ మూలన ఉన్నసుబ్బయ్య గారింట్లో అబ్బాయి వాళ్ళ అమ్మ,అక్కతో కలిసి పెద్ద పెద్ద ముగ్గులు,వాటికి రంగులు కూడా వేసేసేవాడు.మేము మాత్రం ప్రతీ ఇంటి ముందు ముగ్గులు చూస్తూ,వాటిని వేసే అమ్మాయిల్ని ఓరగా చూసి సిగ్గుపడిపోయేవాళ్ళం.ఇంటికొచ్చి,గబగబా నూతిపళ్లెం దగ్గర నలుగు పెట్టేసుకుని ,కుంకుడుకాయ పులుసుతో తలస్నానాలు చేసేసరికి కొత్త బట్టలకి పసుపు బొట్టు పెట్టి రెడీగా ఉంచేది అమ్మ.ఖర్మకాలి పులుసు కళ్ళల్లో పడితే ఉప్పు రాయి చప్పరించాలి.ఉన్న రెండు జతల్లో బాగా బావున్నది పెద్ద పండక్కి దాచేసుకుని,కొంచెం బావున్న ఇంకో జత వేస్కుని స్వయంవరానికి వెళ్తున్న రాకుమారి చేతిలో పూలమాలలా మా పిడకలదండని గర్వంగా తీసుకుని భోగి మంటదగ్గరికి వెళ్లి,మిగతావాళ్ళ దండలతో మా దండని సరిపోల్చుకుని,ఆఖరిసారి చూసుకుని మంటలో వేసి అది మొత్తం అయ్యేవరకు ఉండీ దణ్ణం పెట్టుకుని,ఆ బూడిదని బొట్టులా పెట్టేసుకుని ఇంటికొచ్చేసరికి వేడి వేడి సేమియాపాయసం రెడీ.భోగి రోజు సేమియా,సంక్రాంతికి పులిహోర బూర్లు,కనుమకి గారెలు,పొద్దున్న మిగిలిన గారెలతో రాత్రికి ఆవళ్ళు. ఇప్పటికీ ఇదే మెనూ.అందరి ఇళ్లలోనూ జంతికలు,సున్ని ఉండలు,పోకుండలు చేస్తారు నువ్వెందుకు చెయ్యవు అని ఆడిగితే ‘మన ఇళ్ల అవి చెయ్యరు’ అని చెప్పేది అమ్మ.మధ్య తరగతి లౌక్యం కాబోలు!

                               ఇంక అసలు కధ ఇప్పుడు మొదలవుతుంది.ప్రతీ సంక్రాంతికి చిరంజీవి కొత్త సినిమా రిలీజ్ అయ్యేది.వేరే హీరో సినిమా ఉన్నా మేము అంత ఇంట్రెస్టు చూపించే వాళ్ళం కాదు ఎందుకో!!!దానికి వెళ్ళడానికి డబ్బులు కావాలి.ఇదే వంక దొరికి, ‘సైకిల్ సుబ్భరంగా తుడిస్తే సినిమాకి డబ్బులిస్తా” అనే వారు నాన్నారు.పాపం తుడవకపోయినా ఇస్తారు అనుకో.అప్పట్లో తెలీదు.సైకిల్కి ముందు వైపునాది,వెనక వైపు పెద్దోడిది.ముందైతే తక్కువ కష్టం కదా..పాత బనీనుని రెండు ముక్కలుచేస్కుని,తలో ముక్కా తీస్కుని సైకిల్కి ఆయిల్ పెట్టి నానా కుస్తీ పడి మొత్తానికి తళ తళా మెరిపించాక సినిమాకి చెరో 5 రూపాయిలు డబ్బులొచ్చేసేవి.

                              గబా గబా ఏవో నాలుగు మెతుకులు తినేసి గ్యాంగ్ అంతా కలిసి నడుచుకుంటూ వెళ్లిపోయి 3రూపీస్,బెంచి లైన్లో నిలబడిన గంటకి బుకింగ్ ఓపెన్ చేస్తే తొక్కుకుంటూ, తోసుకుంటూ మొత్తానికి టిక్కెట్లు సంపాయించి లోపల అడుగుపెట్టడం ఒక చిన్న సైజు యుద్ధమే.సినిమా ఎలా ఉన్నా నచ్చేసేది.తెరమీద ఉన్న ప్రతీ యాక్టరు పేరూ తెలుసు.పాడే వాళ్ళు తెలుసు.అన్ని పాటలు నోటికొచ్చేసేవి.ఇంటర్వెల్లో తలొక సోడా తాగి(మామూలు సోడా ఐతే 50 పైసలు,ఐస్ సోడా రూపాయి,కలర్ సోడా రెండు రూపాయిలు).మన దగ్గర ఉన్న డబ్బులకి మామూలు సోడా వచ్చేది.తాగి ఒక రూపాయితో పాప్కార్న్,ఒక రూపాయితో గొట్టాల ప్యాకెట్ కొనుక్కుని పదివేళ్ళకి పదిగొట్టాలు పెట్టుకుని తింటూ చూస్తుంటే మిగతా సగం సినిమా ఎప్పుడయ్యేదో కూడా తెలిసేది కాదు.

                      ఆ సినిమా ముచ్చట్లు చెప్పుకుంటూ మిగిలిన రూపాయితో గంగరాజు హాలు దగ్గరో, ముమ్మిడారం గేటుదగ్గరో జామకాయల బండి కనిపించేది.కాయ అర్ధరూపాయి.బేరం ఆడితే,వాడికి మన మొహం నచ్చితే రూపాయికి మూడు కాయలు కూడా ఇస్తాడు ఒక్కోసారి.దోరగా ఉన్న కాయలు ఏరుకుని వాటికి ఉప్పు కారం రాయించుకుని తినుకుంటూ ఇళ్లకు వెళ్తుంటే,దారి అంతా ఆడపిల్లలు, అమ్మలు, అమ్మమ్మలు భోగి పళ్ళు పేరంటానికి వెళ్తూనో వస్తూనో కనిపించే వారు.కాళ్ళకి పసుపు,మెడకి గంధం,తల్లో చేమంతి పూలతో పెద్దవాళ్ళు,పూలజడలు,పట్టుపరికిణీలతో ఆడపిల్లలు భలే గమ్మతుగా ఉండేవారు చూడటానికి.

                       చంటిపిల్లలకి ఓ పక్క భోగిపళ్ళు అవుతూఉంటే,ఎవరో ఒకరి ఇంట్లో ఆడపిల్లలు అంతా చేరి గొబ్బిళ్ళ పేరంటం చేసుకునేవారు.మాములుగా ఐతే ఇక్కడ అబ్బాయిలకి నో ఎంట్రీ.కానీ మూడు నాలుగు వాటాలకి కలిపి ఒకే పెరడు ఉన్న ఇళ్లలో అబ్బాయిలకి  మాత్రం ఫ్రీ పాస్. ‘రాజావారి తోటలోన ఏమి విత్తు వేసారంట అనీ,ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనో‘ అనీ రకరకాల పాటలు పాడి చివరిగా ‘తామర పువ్వంటి తమ్ముడినివ్వవే ,మొగలి పువ్వంటి మొగుణ్నివ్వవే ‘అని పాడి అమ్మాయిలు అందరు ఒకటే నవ్వులు సిగ్గులు.ఏవేవో పాటలు పాడుకుంటూ గొబ్బెమ్మచుట్టూ ఎరుపు నీలం పసుపుపచ్చ రంగుల్లో పట్టు పరికిణిలు వేస్కుని తిరిగే ఆ అమ్మాయిలని చూస్తే అదో గిలిగింత.

                                    సంక్రాంతి కూడా ఇంచుమించు ఇదే హడావుడి ఉంటుంది. పొద్దున్న పాటలు పాడుకుంటూ, సన్నాయి వాయిస్తూ డూ డూ బసవన్నలతో దాసులు వచ్చేవారు.ప్రతీ ఇంటిముందు ఆగి వాయించి,ఆ ఇంటివాళ్ళు ఏం ఇస్తే అది తీసుకుని దీవించి వెళ్లేవాళ్ళు.వాళ్లతో పాటు వచ్చిన గంగిరెద్దు చూడటం మాకు భలే సరదా.రంగురంగుల దుప్పట్లు,గుడ్డలు కప్పి,పసుపు కుంకంతో చాలా అందంగా ఉండేది.అందుకేనేమో ఇప్పటికీ ఎవరన్నా ఎక్కువ తయారైతే గంగిరెద్దులా తయారయ్యి ఎక్కడికెళ్తున్నావ్ అనడం అలవాటైపోయింది.

                           కనుమ రోజైతే మాకు పెద్దగా చెయ్యడానికి ఏం ఉండేది కాదు.అందరూ ఎద్దుల బండ్లు,ట్రాక్టర్లు ఎక్కి అరుచుకుంటూ పక్క ఊరికో,అదే ఊరిలో ఊరేగింపుకో వెళ్లేవారు.మేమూ వెళ్తాం అంటే చిన్నపిల్లలు, మీరు తప్పిపోతారు అని కూచోపెట్టేసేవాళ్ళు.ఇంక అలా వాళ్ళని వీళ్ళని చుస్కోడంతో రోజు అయిపోయేది.మధ్యలో  ‘పండగ పప్పలెట్టండి‘ అంటూ ఇస్త్రీ బండేసే త్రిమూర్తులు పిల్లలో,బట్టలుతికే సూర్యకాంతం మానవరాలో వస్తూ పోతూ ఉండేవాళ్ళు.

                             పండగలు,సెలవలు అయ్యాక మెల్లగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు,మళ్ళీ స్కూళ్ళు. బళ్ళో పిల్లలు తెచ్చిన పండగ జంతికలు,సున్నిఉండలు,అమ్మమ్మ నానమ్మ ఇళ్ల కబుర్లు,చూసిన చిరంజీవి సినిమా జ్ఞాపకాలు… ఇది…నాకు తెలిసిన పండగ!!!

                             ఇదంతా కేబుల్ టీవీలు,కంప్యూటర్లు,ఫోన్లు రానప్పటి నాటి పండగ.మేము చూసిన పండగ. బహుశా ఈ పండగ ఇలా చూసిన ఆఖరి తరం మాదే అనుకుంటా.ఈ ఆనందాలు ఇప్పుడు లేవా అంటే.. ఉన్నాయి. కాకపొతే, దానికీ దీనికీ ప్లాస్టిక్ తోరణాలకి,పచ్చటి మావిడాకులకి ఉన్నంత చిన్న తేడా…

                                           వేసవికాలంలో ఆరుబయట నాన్న పక్కన పడుకుని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ మెల్లగా నిద్రలో జారుకోడానికి,AC రూమ్ లో పడుకుని పైన రేడియం నక్షత్రాల్ని చూస్తూ పడుకోడానికి ఉన్నంత చిన్న తేడా.

                               పిల్లలందర్నీ తన చుట్టూ కూచోపెట్టుకుని తన చిన్నప్పటి కబుర్లు చెప్తూ ఆవకాయ్ ముద్దలు పెట్టే అమ్మమ్మ చేతి ముద్దకి,డబ్బాలో దొరికే పచ్చడితో చేసిన ముద్దకి ఉన్నంత చిన్న తేడా.రెండో దాన్లోకడుపు మాత్రమే నిండితే,మొదటి దాన్లో మనసు కూడా నిండుతుంది.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,