తెలుగు లోని గమ్మత్తు: తెలుగు మన భాష అయ్యినందుకు ఎందుకు గర్వపడాలో ఇక్కడ ఉన్న ఉదాహరణల ద్వారా తెలుసుకోండి.

Contributed By Masthan Vali.K
తెలుగంటే…? చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పదాలు, పద్యాలు, పాఠాలు… అంతే కదా! మిగతా భాషలు కూడా చదువుకున్నాం. ఏంటట తెలుగు గొప్ప?
ఏదైనా మాట్లాడాలన్నా… దేన్నైనా వర్ణించాలన్నా భాష వాడుతారు. మరి భాష గురించి మాట్లాడాలంటే, ఆ భాష లో ఉన్న మనకు తెలియని గమ్మత్తైన, తెలుగు భాష కు మాత్రమే సాధ్యమైన కొన్నిటి గురించి తెలుసుకోవాలి. ” దేశ భాషలందు తెలుగు లెస్స ” అని రాయలవారు అన్నారని మనం చదువుకున్నాం. ప్రతి భాషా గొప్పదే, కానీ తెలుగు భాష ప్రత్యేకమైనది., ఏంటా ప్రత్యేకత? అని కాస్త అంతార్జాల పరిశోధన చేస్తే, నేను కాసేపు విస్తుపోయాను. ఒక రకమైన గర్వం తో కూడిన ఉద్వేగం కలిగింది.
Palindrome అంటే తెలుసు గా, ఎటు నుంచి చదివినా ఒకే పదం వినిపిస్తుంది. దాన్నే తెలుగులో ” పత్రికపదకోశం ” అంటారు. చిన్న చిన్న పదాలుగా మనకు దీని గురించి తెలుసు… ఉదాహరణకు కిటికి, వికట కవి. ఇదే విధంగా తెలుగులో ఒక కావ్యమే ఉందంటే మీరు నమ్మగలరా…?
దైవజ్ఞసూర్య అనే పండితుడు 14వ శతాబ్దం లో “రామకృష్ణవిలోమ” అనే కావ్యం రచించారు. అందులో 40 వరకు శ్లోకాలున్నాయ్. ఈ కావ్యాన్ని మొదటి నుంచి చివరకు చదివితే రామాయణం అవుతుంది, అదే చివరి నుంచి మొదటికి చదివితే భారతం అవుతుంది! నాకు నమ్మకశ్యం కాలేదు, రెండు మహాగాధలను పత్రికపదకోశం లా ఒకే కావ్యం లో చెప్పడం… ఇంతకంటే గొప్ప భాషా ప్రయోగం ఏదైనా ఉంటుందా…?
అందులోని ఒక శ్లోకం…
” తాం భూసుతా ముక్తి ముదారహాసం
వందేయతో లవ్య భవం దయాశ్రీ ”
ఇందులో “భూసుతా” అంటూ సీతను గురించి ప్రస్తావిస్తూ మొదలవుతుంది…”దరహాసం చిందే లవని ప్రేమించే దయగల లక్ష్మియైన ఆ సీతను నమస్కరించుచున్నాను” అని దీనర్థం.
దీన్నే వెనుక నుంచి మొదటికి చదివితే,
” శ్రీయాదవం భవ్యలతోయదేవం
సంహారదాముక్తి ముతాసుభూతాం ”
ఇక్కడ ” శ్రీయాదవం ” అంటూ కృష్ణుని గురించి ప్రస్తావిస్తున జరుగుతుంది, “మంగళప్రదమైన ఆకర్షణగలవాడైన కృష్ణుని గీత బోధ చెడును సంహరిస్తూ ప్రాణప్రదమైనది” అని అర్థం వస్తుంది.
ఇదే విధంగా కావ్యం మొత్తం రచించడం అంటే… వారికి శతకోటి వందనాలు.
మరొక ప్రయోగం – ఏకాక్షర శ్లోకం/పద్యం…
రరోరరే రరరురో
రురూరూరు రురోరరే |
రేరే రేరారారరరే
రారేరారి రి రారిరా ||
భావం మరియు మరిన్ని ఏకాక్షర పద్యాల కోసం – Link
ఇవి మాత్రమే కాదు… సంగీత స్వరాల సమకూర్చనలో సర్వ సాధారణంగా కావలసిన లక్షణాలు కలిగిన భాష, “అచ్చు శబ్దము ” ల తో ముగిసే పదాలతో కూడిన భాష – “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అంటారు…
ఇవన్నీ కేవలం మచ్చుకలో మచ్చుకంత మాత్రమే…
తెలుగు గురించి తెలుసుకోవాలంటే మన-తరం తరం కాదు…
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన తెలుగు మన మాతృభాష కావటం కంటే గొప్ప అదృష్టం ఏముంది? మన దురదృష్టం ఏంటంటే మన అదృష్టాన్ని కూడా గుర్తించలేని పరిస్థితి లో ఉన్నాం మనం.!
తెలుగు పూర్తిగా దూరమైపోయింది అనలేము కానీ, అసలైన తెలుగు అంటే ఏమిటో మనం మర్చిపోతున్నాం. ఎదో తెలుగు కు సాయం చేద్దాం, తెలుగు ను బ్రతికించుకుందాం అని నేననను… తెలుగు భాష ను మనం తెలీకుండానే చాలా మిస్ అవుతున్నాం అని గట్టిగా చెప్పగలను. అందుకే మన కోసం వీలైనంత మేర తెలుగు సాహిత్యాన్ని తెలుసుకుందాం, తెలుగు నవలల్ని, కథల్ని చదువుదాం.
ఒకప్పటి మనలాంటి యువతకు తెలుగు నవలలంటే పిచ్చి. అవి వారి దినచర్య లో భాగంగా మారిపోయి ఉండేవి. దాని మూలంగా ప్రత్యక్షంగా కాలక్షేపం, పరోక్షణగా జ్ఞానార్జనా రెండు లభించేవి. తెలుగే చదవాలా… ఏ భాష లో అయినా జ్ఞానం ఒకటే కదా అనే ప్రశ్న తలెత్తితే… తల్లి ప్రేమకు, మరే ఇతర ప్రేమకు ఉన్న వ్యత్యాసం ఏంటో, అదే మీ ఆ ప్రశ్నకు సమాధానం. ఇంకో రకంగా చెప్పాలంటే,
తెలుగు మన మాతృభాష – సునాయాసంగా అర్థమవుతుంది, మనసులో గాఢంగా ముద్రించబడుతుంది… అలా వచ్చిన జ్ఞానం చచ్చే వరకు తోడుంటుంది… తల్లి ప్రేమ లాగ భావి తరాలకు తేట తెలుగు మాధుర్యాన్ని తెలియజేయడానికి సిద్ధమవుదాం…
ఆగష్టు – 29, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా…
శ్లోకం ఆధారం – అంతర్జాలం
అచ్చు తప్పులుంటే క్షమించండి.
నేను ఈ వ్యాసాంగంలో ఒక ఆంగ్ల పదము వాడాను, అదేంటో కనిపెట్టండి.
ధన్యవాదాలు,
తెలుగుభాషాభిమాని.
If you wish to contribute, mail us at admin@chaibisket.com