ఉనికి – A Short Story On Nature’s Way Of Dealing With Separation

సాయంత్రం 5 గంటలు. చిన్న బాల్కనీ , చల్లని గాలి , ట్రాఫిక్ ని దాటి 13 వ అంతస్థు చేరేసరికి ఒంట్లో ఓపికంతా అయిపొయింది.ఆ బాల్కనీ మూల అదే అలిసిపోయిన కళ్ళతో నిద్రపట్టేసింది.ఎవరో నెట్టినట్టు సడన్ గా మెలుకువ వచ్చేసింది.చూసే సరికి టైం తొమ్మిదయింది. రోజు బాగుండాలంటే ఎన్నో అద్భుతాలు జరగాలి కానీ అదే రోజు పాడవడానికి ఒక్క చిన్న క్షణం , ఆ క్షణం లో ఏదొక పనికిమాలిన సంఘటన చాలు. ఈ ఒక్కరోజులో అలంటి సంఘటనలు చాలానే జరిగాయి.

బయట పడుకోడం వల్ల జలుబు చెసింది,రాత్రి తినకపోడం వల్ల నీరసం అంటింది.ఆ ముక్కుతో పడిన బాధలు అంత ఇంత కాదు.ఒంట్లో బలమంతా అయిపొయింది.ఆ క్షణం లో తనకి కోపం తెప్పించినవి రెండు , ఒకటి నిస్సహాయత , రెండు తోడు లేకపోడం.వాడు తనని వదిలేసి వెళ్ళిపోయి సరిగ్గా 384  రోజులు అవుతుంది.ఇంకొక రోజు అయితే వాడి బర్త్ డే . వాడు వదిలేసాడు అనే బాధ కన్నా , ఇపుడు తనతో లేడనే కోపం ఎక్కువ ఉంది తనలో.ఆ ఫ్లాట్ లో అతనికి సంభందించిన వస్తువులు ఒక్కటి కూడా వదలకుండా పడెసింది.అది కోపం తోనో బాధ తోనో తన మనసాక్షి కె తెలియాలి.

వస్తువుల్ని అయితె పడెసింది , మరి జ్ఞాపకాల్ని ? కనపడకుండా బాధించేవి,మోయలేనంత బరువైనవి,ఎప్పటికి వదిలి పోనివి జ్ఞాపకాలే.

సమయం 12 కావస్తుంది. వాడి గుర్తుగా తను ఉంచుకున్నవి రెండె రెండు , వాడి షర్ట్ , ఇద్దరు కలిసి సెలెక్ట్ చేసుకున్న పాటల ప్లేలిస్ట్.సంగీతం గాయాలని మానేలా సహాయం చేస్తుంటే , ఆ పాటలోని పదాలు , దాని బావాలు కొంచెం కొంచెం గా గుండె ని విరిచేస్తున్నాయి.

గతం ఎపుడు అద్భుతంగానే కనిపిస్తుంది , ఆ గతాల ఊహలు ఇచ్చే హాయి వర్ణనాతీతం , అదే ఆనందం లో లేచి , స్నానం చేసి ఎక్కడో దాచుకున్న షర్ట్ వేసుకుంది. గది మొత్తం సర్దేసి , చిన్న పిజ్జా ఆర్డర్ చేసుకుని అదే బాల్కనీ లో మళ్లీ కూర్చుంది.ఆ క్షణం ఆ షర్ట్ ఇచ్చిన వెచ్చదనం , అది గుర్తుచేసిన తోడు తన గుండెకి తాకింది.కనుబొమ్మ కంటే చిన్నగా చిలిపిగా తనలో తను నవ్వుకుంది , ఆ నిమిషం తను ఇక్కడ లేదు , ఆ కౌగిలి జ్ఞపకంలో తేలుతుంది , ఎప్పుడో పోయిందనుకున్న చిరునవ్వు పలకరిస్తూ దరికి చెరింది, తనకి కోపం తెప్పించిన నీరసం మాయం అయ్యింది.చనిపోయాడని తెలిసిన ఆ నిజాన్ని నమ్మడానికి ఇష్టపడలేదు.ప్రేమ రూపం లో కోపం పెంచుకుంది.కష్టమైన నిజాన్ని మింగే శక్తి , సాహసం రెండు లేవు తనకి.

కానీ ఆ ఉనికి తాకిన మరునిమిషం , సంవత్సరం నుండి తనతో తను , తనలో తాను  పోరాడిన యుద్ధం ఒక్కసారిగా ఆగిపోయిందనిపించింది.మౌనం కన్నీటి చుక్కగా మారింది.మనిషి లేకపోయినా తన వెచ్చదనం , తన ఉనికి , తన ఊపిరి ఆ గదిలో , తను పారేసిన వస్తువులలో బ్రతికే ఉంది.ఎన్నో భావాలతో బరువెక్కి స్తంభించిన కన్నీరు ధారాళంగా కారింది.

ఉదయం 5  గంటలకి సూర్యోదయం చూస్తూ ఆమె మళ్లీ జన్మించింది.ఈసారి వాడు ఎప్పటికి తనతో, తనలో సజీవంగా ఉంటాడన్న నమ్మకం తో. వీచే గాలిలో , పీల్చే శ్వాస లో , వెసుకున్న షర్ట్ లో  , ఆ గది లో తన మదిలో.

వాళ్ళు ఎప్పటికి ఏకం , ఈ సంగమము పవిత్రం.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,