This Open Letter To Ram & Janu Is Not Only For Them But Also To All True Lovers Out There

 

Contributed By Masthan Vali

 

K రామచంద్ర – S జానకి దేవి లకు ప్రేమతో,

 

మీదైనా, నాదైనా… ప్రేమ ఒక నాణెం లాంటిది. దానికిరువైపులా ఉండే గుర్తులే సఫలం – విఫలం. చిత్రమేంటంటే అది ప్రేమించుకునే వారి చేతుల్లో ఉండదు. కాలం దాన్ని పైకెగరేసి ఆడుకుంటూ ఉంటుంది. గాల్లో గింగిర్లు తిరుగుతున్నంత సేపు, పైకి-కిందికి లెక్కలేనన్ని చక్కర్లు కొడుతున్నంత వరకు ప్రేమెంతో అపురూపంగా, ఆనందంగా తోస్తుంది… ప్రేమలో ఉన్నవారికి, వారి ప్రేమకు సాక్ష్యంగా, సాయంగా నిలిచిన వారికీనూ. కాసేపటికి కాలానికి అలుపొచ్చి, ఆటలాపి ప్రేమను రెండు చేతుల్తో కప్పిపెడుతుంది. అప్పటిదాకా ఏ ఆటంకం లేకుండా సాగిన ప్రేమకథ ఉన్నపలంగా ఒక ముగింపుకు చేరువవుతుంది, అది సఫలమో – విఫలమో కాలం చేయి తెరిస్తే కానీ తెలీదు. సఫలమైతే పర్లేదు, ప్రేమికులకు ఆ ప్రేమని కాలం శాశ్వతంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత వారి ప్రయాణం వారి చేతుల్లోనే ఉంటుంది. కానీ, ఆ ముగింపు విఫలమైతే… వారి వేదనని తాళలేని కాలం, వారికి మరో అవకాశం ఇస్తుంది. మరో సారి ప్రేమను గాల్లోకెగరవేస్తుంది. ఆ కాస్త సమయంలో వాళ్ళు మళ్ళీ ఒక్కటైనట్టు తోస్తుంది. కానీ నిజానికి, ఎప్పుడో ముగిసిన కథను కాలం కాసేపు అందంగా కొనసాగించి… చివరకు విఫలంగానే ముగిస్తుంది. అనుకోకుండా, అంతా మాయలా తోస్తున్నట్టు ఆ జంటను వేరు చేస్తుంది. దాని తర్వాతి పరిణామాలను చూస్తూ సేదతీరుతుంది. మన అమాయకత్వం కాకపొతే, మనకు తెలిసిన ప్రతి ప్రేమకథలో విలన్ ఎవరో కాదు – కాలం. కానీ మనమెవ్వరం కాలాన్ని ఎదురించలేం, నిందించలేం… ఆ కాలం రాసిన మరో కథే, మీ కథ…
K రామచంద్ర – S జానకి దేవి ల ప్రేమ కథ.

 

అన్ని సంవత్సరాల తర్వాత కలిసిన మీ ఇద్దరి మధ్య అదే అనుబంధం ఎలా సాధ్యపడింది? నునులేత ప్రాయం లో చిగురించి అర్ధాంతరంగా ముగిసిపోయిన ప్రేమ కథ మళ్ళీ కొత్తగా మొదలయ్యే వీలుందా? మీ మనస్సులో పరస్పరం అంతే ప్రేముంటుందా, ఉంటే ఆ ప్రేమ ఎదుటివారికి తెలుస్తుందా? మీరిద్దరూ కలిసి జీవించలేకపోవడానికి మీరే ఎలా కారణమయ్యారో తెలుసుకున్న మరుక్షణం… గుండెల్లో అప్పటికే దాగున్న భారం వేల రెట్లు పెరగలేదా? దాన్ని ఎలా దిగమింగగలిగారు? ఇంత గొప్పగా, స్వచ్ఛంగా ప్రేమించుకున్న మీరు, కాలం అందించిన రెండో అవకాశాన్ని వాడుకోకుండా ఎందుకు వదులుకున్నారు… ఎలా వదులుకోగలిగారు?
ఇలా చాలా ప్రశ్నలకి మీ కథలో దొరికిన సమాధానాలు నా మనసును కుదుటగా ఉండనీయట్లేదు. కొన్ని జవాబులు ఆశ్చర్యపరిచాయ్, మరి కొన్ని ఆనందపరిచాయ్, ఇంకొన్ని మీ ఇద్దరితో ప్రేమలో పడేసాయ్. కానీ తెలుసా, చాలా జావాబులు మళ్ళీ ప్రశ్నల్నే మిగిల్చాయ్. అదొక పూర్తి కాని పరీక్షలా తోచింది.

 

మీరిద్దరూ ఒకరికోసం ఒకరు ఎదురు చూసారని, కలవడానికి పరితపించారని ఇద్దరికీ తెలియదు. అయినప్పటికీ ” నన్ను రామ్ మర్చిపోయాడు…”, ” జాను నేను లేకున్నా ఇంత సంతోషంగా ఎలా ఉంది…? ” అనే భావన మీ ముఖాల్లో, మాటల్లో కనిపించలేదు. బహుశా మీ అంతరంగానికి తెలుసేమో మీ పరస్పర ఎదురుచూపులు. మీ సంభాషణ మధ్య ఇద్దరూ వేరుగా గడిపిన సమయంలో మీరెలా ఉన్నారో చెప్పుకుంటున్నప్పుడు, మీ ప్రేమ, బాధ రెండూ ఆకాశాన్ని తాకినట్టు అనిపించింది.
‘ ఇంతలా ప్రేమించావా ‘ అని తెలుసుకున్నాక, ‘ ఎందుకు మనం ఒక్కటి కాలేకపోయాం ‘ అనే వేదనను ఎలా తట్టుకోగలిగారు?

 

జాను… నువ్వు రామ్ స్టూడెంట్స్ తో మీ ప్రేమ ‘కథ’ గా జరిగిన దాన్ని మార్చి… మీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారో చెబుతున్నప్పుడు, నా మనసులో రేగిన ఉద్వేగాన్ని మాటల్లో చెప్పలేను. చాలా సేపటి వరకు రెండు విరుద్ధ (ఆ క్షణానికి ఖచ్చితంగా విరుద్ధంగా తోచాయ్) అనుభూతులు ఒకేసారి నాలో కల్లోలం రేపాయ్, సంతోషం – బాధ. పోన్లే, ఇలాగైనా రామ్-జాను లు కలుసున్నారనే ఆనందం ఒకవైపు… అరెరే నిజంగా అలా జరుగుంటే ఎంత బాగుండేది అనే బాధ మరోవైపు… నువ్వలా చెబుతున్నప్పుడు, పక్కనే వింటున్న రామ్ కళ్ళను గుర్తుచేసుకుంటే, గుండె బరువెక్కుతుంది… వెంటనే తేలిక పడుతుంది… బహుశా గుండె ఇలానే కొట్టుకుంటుందేమో అన్నట్టు!

 

రామ్… జాను జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని తెలుసుకున్న నువ్వు… తాను నీ కోసం ఎదురుచూస్తోంది అని మాత్రం అర్థం చేసుకోలేకపోయావా? నేనేం నిన్ను నిలదీయట్లేదు, నాకు తెలుసు నీ సమాధానం ఏంటో… ఇంత నాటకీయతను రచించిన కాలం, నువ్వు జాను ను కలుసుకోడానికి మరొక్కసారి ప్రయత్నించే వీలు కల్పించేలేదెందుకు అని కాలాన్ని ప్రశ్నించలేక నిన్నడిగాను. అలా జరిగుంటే, ఈ లేఖని మరోలా రాసేవాడిని.

 

ఏదిఏమైనా, మీరిద్దరూ జీవితం లో ఇక కలవలేరు అని తెలిసాక మీ ప్రేమ సఫలమెలా అవుతుంది? మీ ఇద్దరి మనసుల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ చావనంతవరకూ, అది విఫలమెలా అవుతుంది? మీ కథ నాణేనికి ఏటో ఒక వైపు ముగియలేదు… అసలు మీ కథకు ముగింపు లేదు. మీ కథ అనంతం. మీ ప్రేమ అమరం.

 

మీరిద్దరూ రెండోసారి కలుసుకుని దూరమయ్యాక మీ జీవితాల్లో ఏం జరిగుంటుంది? ఏమో…

 

నిరంతరం ప్రవహించే నది క్రమంగా భూమిని సారవంతం చేసినట్టు, కాల ప్రవాహం మీ మనసుల్లోని బాధను దూరం చేసి, ప్రేమను అలాగే మిగిల్చి… కేవలం ప్రశాంతంగానే కాదు, సంతోషంగా బ్రతికేలా చేస్తుందని కోరుకుంటూ…

 

Happy Valentine’s Day ?

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,