Unlimited Buffet @ ₹50: This Hotel Serves Healthy & Tasty Food For Just Fifty Rupees

 

జియో రాకముందు మన పరిస్థితి ఎలా ఉండేదో తెలుసు కదా.. జియో వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం వల్ల మిగిలిన నెట్ వర్క్ కంపెనీలన్ని ధరలు తగ్గించాయి, ఫలితంగా ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి పల్లెలో అందుబాటులోకి వచ్చింది.. నెట్ వర్క్ రంగంలో జియో ఎలాంటి రివెల్యూషన్ తీసుకువచ్చిందో హైదరాబాద్ నాగోల్ మరియు దాని పరిసర ప్రాంతాలలో “తిన్నంత భోజనం” అనే హోటల్ అంతే ప్రభావం తీసుకువచ్చింది. కేవలం రూ.50 చెల్లిస్తే చాలు కడుపునిండా మనకు ఇష్టమచ్చినంత ఆరోగ్యకరమైన భోజనం చెయ్యొచ్చు. 

“నేను ఎదుటి మనిషిలో భగవంతుడిని చూస్తాను” –మిర్యాల గాంధీ గారు.

 

ప్రాణమైన వదులుకుంటాను కానీ రాజీపడను:
తిన్నంత భోజనమా..? అంటే కొద్దిగా తినగానే కడుపునిండేలా సున్నం కానీ మరే ఇతర పౌడర్లు కానీ తినే భోజనంలో వేస్తారా అని భయపడాల్సినదేమి లేదు!! “ప్రాణమైన వదులుకుంటాను కానీ కస్టమర్ల ఆరోగ్యం విషయంలో రాజీపడను” అని హోటల్ యజమాని మిర్యాల గాంధీ గారు అంటారు. ఒకప్పుడు నాన్న మిర్యాల శంకరయ్య గారు హైదరాబాద్ ఇంకా చుట్టు ప్రక్కల ప్రాంతాలలో సక్సెస్ ఫుల్ గా హోటళ్లు నడిపించారు.. ఐతే ఇతర విషయాలలో మోసానికి గురి కావడం మూలంగా వారి కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంది. నాన్న శంకరయ్య గారి స్పూర్తితో రకరకాల పనులు అలాగే 15 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేసి కుటుంబానికి అండగా నిలబడ్డారు.. రెండు సంవత్సరాల క్రితం అన్నయ్య సూర్యప్రకాష్ గారు ప్రారంభించిన తిన్నంత భోజనాన్ని గాంధీ గారు అద్భుతంగా అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తీసుకువచ్చారు. 

“నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను, ఎక్కడంటారా.. చిన్నప్పుడు మా నాన్న నడిపించిన హోటల్ లోనే లెండి!!”

 

75 సంవత్సరాల అమ్మ కూడా పనిచేస్తారు:
ఈ హోటల్ లో భోజనం ఇంటి భోజనంలా ఉండటానికి గల కారణాలలో గాంధీ గారి అమ్మ అనసూర్యమ్మ గారు కూడా ఒక ప్రధాన కారణం. 75 సంవత్సరాల వయసులోనూ హోటల్ కు వచ్చి కూరగాయలు కత్తిరించడం, 15 మంది పనివాళ్లకు రుచికరమైన భోజనం తయారు చెయ్యడంలో విలువైన సూచనలిస్తుంటారు. “తిన్నంత భోజనం” ఈ హాటల్ పేరును సూచించింది గాంధీ గారి అన్న సూర్య ప్రకాష్ గారు. దేవుడి పేరు లేదంటే మరే ఇతర పేరు కన్నా “తిన్నంత భోజనం” అని పెట్టడమే కరెక్ట్ అని వారు బలంగా సూచించారు.


 

“నేను భవిషత్తులో ఎన్ని హోటల్స్ ప్రారంభించినా సాధ్యమైనంత వరకు తక్కువ ధరకే భోజనం అందిస్తాను”

 

ప్లేట్లు కూడా కడుగుతాను:
గాంధీ గారు ఎదుటి మనిషిలో, ఇంకా పనిలో భగవంతుడిని చూస్తారు. మోసం చెయ్యడానికి భయపడాలి కానీ పని చేయడానికి కాదనేది ఆయన సిద్ధాంతం. 15 మంది ఉద్యోగులు ఉన్నా కానీ గాంధీ గారు భోజనం వడ్డిస్తారు, కూరగాయలు కట్ చేస్తారు, టేబుల్ క్లినింగ్, పాత్రలు శుభ్రం చేయడానికి కూడా ఆయన వెనుకాడరు. రుచికరమైన భోజనంతో పాటు గాంధీ గారి ఆత్మీయ పలుకరింపు, వారి ఆతిధ్యం కస్టమర్లను మరోసారి వచ్చేలా ప్రోత్సహిస్తుంది. మధ్యాన్నం 12 నుండి సాయంత్రం వరకు నడుస్తూ ప్రతిరోజు 1000మందికి పైగా ఇక్కడ భోజనం చేస్తుంటారు. బస్సులలో సీట్ కోసం కర్చీఫ్ వేసినట్టుగా ఇక్కడ కూడా కష్టమర్లు వారి సీట్లను రిజర్వ్ చేసుకుంటారు. 

“డబ్బు వెనుకాల పరిగెడితే డబ్బు రాదు, పనిచేస్తేనే డబ్బు మన వెనుకాల వస్తుంది”

మీ హోటల్ మూసివెయ్యండి:
రూ.50 రూపాయలకే తిన్నంత భోజనమా.? అదేంటి అలా ఎలా పెడతావు!! నీ వల్ల జనాలు మమ్మల్ని కూడా ధరలు తగ్గించమని అడుగుతున్నారు, నీ హోటల్ మూసేయ్!! అని గాంధీ గారికి రకరకాల యజమాన్యాల నుండి ఒత్తిడులు వచ్చాయి. అలాగే మా హోటల్ కి ఉద్యోగిగా రండి మీకు లక్షల్లో జీతం ఇస్తాను అంటూ చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ వాటన్నిటినీ సున్నితంగా వదులుకున్నారు. గాంధీ గారికి డబ్బు సంపాదించాలనే కాంక్ష ఉంటే ఈరోజు ఇలా మనం మాట్లాడుకునేవారమే కాదు.. ఆ ఒక్క లక్షణమే ఆయనకు గౌరవము, తక్కువ సమయంలోనే గుర్తింపు, వేలాది కస్టమర్ల దీవెనలు అందుకుంటున్నారు.


 

నాగోల్ మెట్రో స్టేషన్ RTO ఆఫీస్ పక్కనే వీరి హోటల్ కలదు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,